ఏపీ మంత్రి అనుచరుడికి కాంట్రాక్ట్‌.. ఫలితం ఇది!

ABN , First Publish Date - 2021-05-06T06:48:14+05:30 IST

విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి..

ఏపీ మంత్రి అనుచరుడికి కాంట్రాక్ట్‌.. ఫలితం ఇది!
బాధితుల బెడ్స్‌ పక్కనే కుప్పలుగా వ్యర్థాలు

చెత్త.. కంపు!

జీజీహెచ్‌లో పారిశుద్ధ్య నిర్వహణ దయనీయం 

బెడ్స్‌ చుట్టూ ఆహార, బయో మెడికల్‌ వ్యర్థాలు  

గుట్టలుగా పేరుకుపోతున్న వాడేసిన పీపీఈ కిట్లు 

సూపరింటెండెంట్‌కు ఆర్‌ఎంవో లేఖ?


‘‘కరోనా బాధితులకు మెడికల్‌ కేర్‌... క్వాలిటీ ఫుడ్‌... శానిటైజేషన్‌... ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మూడూ ఉండాలి.. ఈ ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి... ఫోన్‌ చేసిన మూడు గంటల్లోనే బెడ్‌ దొరకాలి... అదనపు ఆక్సిజన్‌ సిద్ధంగా ఉండాలి...’’ 

- కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న విలయంపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకిచ్చిన ఆదేశాలివి. 


ఆంధ్రజ్యోతి-విజయవాడ: విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి పడకల సామర్థ్యం 750 కాగా.. ప్రస్తుతం వెయ్యి మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అయితే సీఎం ఉపదేశించిన మూడు ప్రమాణాల్లో ఏ ఒక్కటీ ఇక్కడ అమలు కావడం లేదు. బాధితులకు మెడికల్‌ కేర్‌ సక్రమంగా లేకపోవడంతో ప్రతిరోజూ 40మందికి పైగా చనిపోతున్నట్టు అంచనా. పోషకాలతో కూడిన మంచి ఆహారం మాటలకే పరిమితం. డైట్‌ కాంట్రాక్టరుకు దాదాపు ఏడాదిగా బిల్లులు చెల్లించడం లేదని, దీంతో రోగులకు నాసిరకమైన ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారని ఆసుపత్రి వర్గాలే చెబుతున్నాయి. వాటిని తినలేక.. పైకి లేవలేని స్థితిలో ఉన్న బాధితులు బెడ్స్‌ పక్కనే పడేస్తున్నారు. వైద్యసిబ్బంది బయోమెడికల్‌ వ్యర్థాలను ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు.


పారిశుద్ధ్య సిబ్బంది లేక బెడ్స్‌ చుట్టూ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఇక మరుగుదొడ్లలో పరిశుభ్రత గురించి చెప్పుకోకపోవడమే మంచిది. ఇటీవలే రూ. 150కోట్ల ఖర్చుతో అత్యాధునిక వసతులతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో పారిశుద్ధ్య నిర్వహణ తీరు దయనీయంగా ఉంది. చెత్తకుప్పల మధ్యలో మంచాలపై పడుకుని కరోనా బాధితులు దినదిన గండంగా రోజులు లెక్కపెట్టుకుంటుంటే.. వైద్యసిబ్బంది గత్యంతరం లేని పరిస్థితుల్లో ముక్కులు మూసుకుని విధులు నిర్వహిస్తున్నారు. 


సూపర్‌ బ్లాక్‌లో ఆరుగురే పారిశుద్ధ్య సిబ్బంది  

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వైద్యసేవలను అందించాలన్న లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద రూ. 150 కోట్లలో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ను నిర్మించారు. మొత్తం 18.542 చదరపు మీటర్ల వైశాల్యంలో జి+5 భవనాన్ని నిర్మించి అత్యాధునిక హంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈబ్లాక్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు  నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి తక్కువకు కోట్‌ చేసిన ప్రైవేటు కాంట్రాక్టరుకు బాధ్యతలు అప్పగించాలి. అయితే ఈ నిబంధనలేవీ పాటించకుండానే ఓ బినామీ వ్యక్తి పేరుతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అనుచరుడికి నామినేషన్‌ పద్ధతిపై శానిటేషన్‌ కాంట్రాక్టును కట్టబెట్టేశారు.


ప్రతినెలా రూ.లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్నా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకుండా సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో తూతూ మంత్రంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేస్తుండటంతో వార్డులు దుర్బరంగా తయారయ్యాయి. రెండు నెలలుగా సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ మొత్తం కరోనా బాధితులతో నిండిపోవడం, అదే క్రమంలో వ్యర్థాలు పేరుకుపోతుండటంతో వాటిని తొలగించేవారు లేక వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల బెడ్స్‌ చుట్టూ చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. పరిస్థితిని రోజురోజుకూ దుర్భరంగా తయారవుతున్నా కాంట్రాక్టరును గట్టిగా నిలదీద్దామంటే మంత్రి గారికి కోపమొస్తుందోనని ఉన్నతాధికారులు నోరుమెదపక ఉండిపోతున్నారు. బాధితులు, వైద్య సిబ్బంది ఒత్తిళ్ల నేపథ్యంలో రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసరు చొరవ తీసుకుని సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వకంగా లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికైనా పరిస్థితులు చక్కబడతాయో లేదో వేచి చూడాలి. 


మిగిలిన బ్లాకులలోనూ అంతంత మాత్రమే.. 

సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో పారిశుద్ధ్య నిర్వహణ దుర్భరంగా ఉంటే.. మిగిలిన ఆసుపత్రి బ్లాకులలోను, వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. సిబ్బంది కరోనా బాధితులున్న వార్డులలోకి వెళ్లకుండా వరండాలు, ఆవరణలను శుభ్రం చేసి వెళ్లిపోతున్నారు.


Updated Date - 2021-05-06T06:48:14+05:30 IST