మోదీని ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ: మస్తాన్ వలీ

ABN , First Publish Date - 2021-06-15T19:08:29+05:30 IST

మోదీని ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ ఉన్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు.

మోదీని ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ: మస్తాన్ వలీ

విజయవాడ: మోదీని ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ ఉన్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీలో వ్యాస రచన పోటీలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఏపీసీసీ కార్యాలయంలో మస్తాన్ వలీ, రాజీవ్ రతన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ 51వ పుట్టిన రోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఆన్ లైన్ విధానంలో వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. రెండు గ్రూపులుగా 16-45, 45పై బడిన వారు పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. రక్తదానం, అన్నదానంతో పాటు చైతన్య కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎంఫిల్ పూర్తి చేసిన విద్యావేత్త రాహుల్ గాంధీ...దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో నూతన విధానాలను అమలు చేశారని చెప్పారు. నోట్ల రద్దుతో బ్లాక్ మనీ తేలేకపోయినా... ప్రజలకు కష్టాలు తెచ్చారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ ముందే ఈ ప్రమాదం చెప్పినా మోదీ మాయ మాటలతో మోసం చేశారన్నారు. అంబానీ గ్రూపుకు వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టి, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లుండీ చూడలేని గుడ్డి ప్రభుత్వాలుగా మారాయన్నారు.


కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడినా సకాలంలో స్పందించ లేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ బాధ్యతతో అనేక సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు. నరేంద్ర మోదీని  ప్రశ్నించ లేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ ఉన్నాయని వ్యాఖ్యానించారు. మోదీ మోసాలను నిలదీసే దమ్ము ఒక్క కాంగ్రెస్‌కే ఉందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక పారిపోయిన చరిత్ర బీజేపీ నేతలదని వ్యాఖ్యానించారు. కరోనాతో లక్షల మంది చనిపోయారు అంటే అది ప్రభుత్వాల వైఫల్యమే అని అన్నారు. కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు నిందలు‌ వేసుకోవడమే తప్ప.. చేసుందేమీ లేదన్నారు. మందులు, ఆక్సిజన్, బెడ్‌ల కొరత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకో లేదని  తెలిపారు.


భవిష్యత్తుపై దూర దృష్టి ఉన్న రాహుల్ గాంధీ పాలన దేశానికి ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలంతా ఆయన ప్రధానిగా ఉండాలని  ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ఇష్టం వచ్చినట్లుగా పెంచేస్తున్నారని మండిపడ్డారు. ధరలు తమ పరిధిలో లేవని కేంద్ర మంత్రి  చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వాల మోసాలను ప్రజలకు వివరిస్తామని  మస్తాన్ వలీ తెలిపారు.

Updated Date - 2021-06-15T19:08:29+05:30 IST