‘కెప్టెన్‌’కు ఏమైంది.. కార్యకర్తల్లో ఆందోళన!?

ABN , First Publish Date - 2021-03-04T18:04:25+05:30 IST

డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ బుధవారం ఉదయం వైద్యపరీక్షలు

‘కెప్టెన్‌’కు ఏమైంది.. కార్యకర్తల్లో ఆందోళన!?

చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ బుధవారం ఉదయం వైద్యపరీక్షలు చేసుకున్నారు. గత కొద్ది మాసాలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంతేగాక ఇటీవల ఆయన కరోనా వైరస్‌ తాకిడికి గురై చికిత్సలు పొంది కోలుకున్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన ఇంటిపట్టునే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలను ఆయన సతీమణి‌, బావమరిది ఎల్‌కే సుధేష్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు విజయకాంత్‌ నందంబాక్కంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళారు.


ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రి నుంచి కారులో స్వగృహానికి బయల్దేరి వెళ్ళారు. విజయకాంత్‌కు సాధారణ వైద్యపరీక్షలు జరిపామని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా విజయకాంత్‌ కారులో ఇంటి నుంచి బయల్దేరటం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్లుపై చర్చలు జరిపేందుకు వెళుతున్నారని భావించి హుటాహుటిన సాలిగ్రామంలోని ఆయన నివాస గృహానికి తరలివెళ్ళారు. ఆ తర్వాత విజయకాంత్‌ సాధారణ వైద్య పరీక్షల కోసం నందంబాక్కం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళారని తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇదిలా వుండగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయకాంత్‌ ఆస్పత్రికి వెళ్లడం పట్ల డీఎండీకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయనకు సాధారణ ఆరోగ్యపరీక్షలు నిర్వహించేందుకే ఆసుపత్రికి తీసుకెళ్లామని పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడ్డాక అందరూ శాంతించారు.

Updated Date - 2021-03-04T18:04:25+05:30 IST