‘మాస్టర్‌’పై అభిమానుల ఆశలు

ABN , First Publish Date - 2020-08-24T14:21:22+05:30 IST

‘మాస్టర్‌’పై అభిమానుల ఆశలు

‘మాస్టర్‌’పై అభిమానుల ఆశలు

రాజకీయ ఆరంగేట్రం జరిగేనా? 


చెన్నై, (ఆంధ్రజ్యోతి):  తాను కూడా పార్టీని ప్రారంభించాలన్న అభిమతంతో వున్న నటుడు విజయ్‌ రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడు జరుగుతుందోనని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ‘మాస్టర్‌’ విజయ్‌కి ఎప్పటినుంచో వుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  మాజీ ముఖ్యమంత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ్‌ నటించిన ‘తలైవా’ సహా కొన్ని సినిమాలకు సమస్యలు ఎదురయ్యాయి. చెన్నై మీనాంబాక్కం వద్ద అట్టహాసంగా జరగాల్సిన విజయ్‌ జన్మదిన వేడుకలు చివరి క్షణంలో పాలకవర్గం ఒత్తిడి కారణంగా రద్దయ్యాయి. విజయ్‌ నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. ఈ సంఘటనల కారణంగా సీఎం కావాలనే తన కోరికను ప్రక్కన పెట్టి సినిమాల్లో నటించడంపైనే విజయ్‌ దృష్టిసారిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో స్వంత పార్టీ ప్రారంభించ డానికి, ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు నమోదు చేయించడానికి విజయ్‌ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.


2026 ఎన్నికలే లక్ష్యం

వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల లోపున పార్టీని ప్రారంభించడం కంటే 2026లో జరిగే ఎన్నికల సమయంలో పార్టీ పెడితే గెలిచి తీరుతామని విజయ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీని ప్రారంభించ డానికి విజయ్‌ ఇంత టైమ్‌ తీసుకోవడానికి కారణాలు లేకపోలేదు. విజయ్‌ మొదటి నుంచి ’తొలుత సంపాదన- ఆ తర్వాతే ప్రజాసేవ’ అనే భావన ప్రదర్శిస్తు న్నారు. విజయ్‌ ప్రస్తుతం ఒక చిత్రంలో నటిం చేందుకు సుమారు రూ.60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఈ ఆదా యాన్ని విడిచిపెట్టి త్వరపడి రాజకీ యా ల్లోకి అడుగుపెట్టకూడదని విజయ్‌ భావి స్తున్నారు. అంతేకాకుండా యాభై యేళ్లు దాటిన తర్వాతే రాజకీయాల్లోకి ప్రవేశిం చమని, అంతవరకూ సినిమాల్లో నటిం చమని స్నేహితులు ఆయనకు సలహా ఇస్తున్నా రు. ప్రస్తుతం విజయ్‌ వయసు 44 సంవత్సరాలు. అందువలన 2026 వరకు సినిమాల్లో నటించి తర్వాత రాజ కీయాల్లో అడుగుపెట్టాలని అనుకుంటు న్నారు. ప్రధాని మోదీ, ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ వంటి నేతలను విజయ్‌ స్వయంగా కలుసుకుని మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తమ పార్టీలో చేరమంటూ పార్టీనేతలు ఎంద రో ఆహ్వానించినా విజయ్‌ చేరలేదు. ఇక విజయ్‌ తండ్రి, సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తొలుత డీఎంకే వీరాభి మానిగా వుండే వారు. ఓ దశలో డీఎంకే ను విబేధించి అన్నాడీఎంకేకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. కానీ తన తనయుడు విజయ్‌ని రాజకీయ అరం గేట్రం చేయించాలనే ఆలోచన ఆయన కు లేదు.  ఆయితే రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించిన తర్వాత ఆయనకు లభించే ప్రజా మద్దతును పరిశీలించిన మీదటే విజయ్‌ రాజకీయ పార్టీని ప్రారంభించే అవకాశముందని ఆయన సన్నిహితుంటున్నారు.


తండ్రే రాజకీయ సలహాదారు

విజయ్‌కి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ రాజకీయ సలహాదారుడిగా ఉంటున్నారు. విజయ్‌ అభిమాన సంఘాలన్నింటినీ సేవా సంఘాలుగా మార్చి రాజకీయ ప్రవేశానికి మార్గాన్ని సులభతరం చేసింది కూడా ఆయనే. అయితే కొన్నేళ్లుగా తండ్రీకొడుకుల మధ్య సఖ్యత కొరవడిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే తొందరపడి తన ఇమేజ్‌ను రాజకీ యాల్లోకి దిగి పోగొట్టుకోకూడదని విజయ్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. తన  పలుకుబడిని ఉపయోగించి తండ్రికి రాజ్యసభ సీటు ఇప్పిఇంచాలని అనుకుంటున్నారు.


డీఎంకేకు సానుకూలం

వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు సానుకూలంగా వ్యవహరించాలని విజయ్‌ నిర్ణయించారు. ఆ కారణంగానే ఆయన రాజకీయ అరంగేట్రం వాయిదా వేసుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే యేడాది ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరాలన్న నిర్ణయంతో డీఎంకే ఎన్నికల బరిలోకి దిగనుంది. ఆ సమయంలో తాను రాజకీయ ప్రవేశం చేసి, స్వంత పార్టీని ప్రారంభించి డీఎంకేకు సంకట పరిస్థితి కలిగించకూడదని విజయ్‌ అనుకుంటున్నారు. 


ఇక డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ తొలుత నిర్మించిన చిత్రం ‘కురువి’. ఆ చిత్రం లో విజయ్‌ హీరోగా నటించారు. అప్పటి నుంచి ఉదయ నిధి స్టాలిన్‌, విజయ్‌ మధ్య సన్నిహిత సంబంధాలు కొన సాగుతున్నాయి. ‘మెర్సల్‌’ సినిమా పంచాయతీ, ‘సర్కార్‌’ చిత్రం బ్యానర్ల చింపివేత వంటి పలు వ్యావహారాల్లో అధికార అన్నాడీఎంకేపై విజయ్‌ ఆగ్రహంతో వున్నారు. ఆ ఆగ్రహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా ప్రదర్శించబోతున్నారు. తన అభిమాన సంఘాలతో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ప్రచారం చేయించనున్నారు. 


ఐటీ దాడులు

విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రసార మాధ్యమాల్లో ఏవైనా ఊహగానాలు వెలువడితే చాలు, ఆయన నివాస గృహాలపైనా, చిత్ర నిర్మాణ సంస్థలపై ఆదాయపు పన్నుల శాఖ  దాడులు జరపడం ఆనవాయితీగా వస్తోంది.  తమిళనాట రాజ కీయ పార్టీని ప్రారంభించకుండా విజయ్‌ను అడ్డుకోవాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు జరిపిస్తోందని చెబుతున్నారు. ‘మాస్టర్‌’ చిత్రం షూటింగ్‌ బిజీగా జరుగుతు న్నప్పుడు కూడా విజయ్‌ రాజకీయ ప్రవేశం చేయబోతు న్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఐటీ అధికారులు నైవేలిలో ‘మాస్టర్‌’ చిత్రం షూటింగ్‌లో ఉన్న విజయ్‌ వద్దకు వెళ్ళి విచారణ జరిపారు. అంతటితో ఆగకుండా వారి కారులోనే చెన్నై తీసుకెళ్ళి, నగరంలో విజయ్‌కి చెందిన రెండు నివాసగృహాలలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ అనవసరపు ఐటీ తనిఖీలు జరుగ కుండా ఉండాలంటే తమకంటూ ఓ రాజకీయ పార్టీ, పార్టీ శ్రేణు లు వుంటే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు జరిపేందుకు తటపటాయిస్తుంది కదా అని అభిమాన సంఘాల నాయ కులు విజయ్‌కి సలహాలు ఇస్తున్నారు. పార్టీ అనేది ఒక ఆయుధం వంటిందని, కనుక తప్పకుండా పార్టీని ప్రారంభించాలని విజయ్‌పై ఆయన అత్యంత సన్ని హితులు ఒత్తిడి చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు విజయ్‌ రజనీలాంటివారని, రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారో ఆయనకే తెలియదని చెబుతున్నారు. అయితే ఈ ‘మాస్టర్‌’ వచ్చే ఐదేళ్ల దాకా మరిన్ని సినిమాల్లో నటించిన తర్వాతే రాజకీయప్రవేశం చేస్తారని కోలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి. 

Updated Date - 2020-08-24T14:21:22+05:30 IST