అక్రమాలపై విజిలెన్స్‌...!

ABN , First Publish Date - 2022-07-02T04:07:10+05:30 IST

మంచిర్యాల మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై విచారణ ప్రారంభ మైంది. విచారణ అధికారిగా ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శైలజను నియమిస్తూ మున్సిపల్‌ పరిపాలనశాఖ అదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె అప్పడు పనిచేసిన అధికారులతో విచారణ జరిపారు. దాదాపు మూడు గంటలపాటు విచారణ కొనసాగగా మీడియాను అనుమతించలేదు.

అక్రమాలపై విజిలెన్స్‌...!
విచారణకు హాజరైన అప్పటి కమిషనర్‌, డీఈలతో ప్రస్తుత అధికారులు

స్వచ్ఛ ఆటోల కుంభకోణంపై దర్యాప్తు షురూ

ఎంక్వయిరీ ఆఫీసర్‌గా ఆదిలాబాద్‌ కమిషనర్‌

మూడు గంటలపాటు సాగిన విచారణ

ఆంధ్రజ్యోతి కథనంతో కదులుతున్న డొంక

మంచిర్యాల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై విచారణ ప్రారంభ మైంది. విచారణ అధికారిగా ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శైలజను నియమిస్తూ మున్సిపల్‌ పరిపాలనశాఖ అదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె అప్పడు పనిచేసిన అధికారులతో విచారణ జరిపారు. దాదాపు మూడు గంటలపాటు విచారణ కొనసాగగా మీడియాను అనుమతించలేదు. మున్సిపాలిటీ పారిశుధ్య విభాగం కోసం కొనుగోలు చేసిన స్వచ్ఛ ఆటోల్లో జరిగిన కుంభకోణంపై 2020 నవంబర్‌ 5న ’ఆంధ్రజ్యోతి’ జిల్లా అనుబంధంలో ‘కొనుగోల్‌మాల్‌’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనశాఖ అవినీతిపై విచారణకు విజిలెన్స్‌ విభాగం అఽధికారులను పురమాయించింది.  

కార్పోరేట్‌ సంస్థకు ఆర్డర్‌...

స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు సంబంధించిన ఆర్డర్లను మున్సిపల్‌ యం త్రాంగం హైద్రాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనే నోడల్‌ ఏజెన్సీకి ఇచ్చింది. ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లతోపాటు మున్సిపాలిటీలకు సంబంధించిన ఇతర పరికరాలు, వాహనాలను సరఫరా చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 209ను జారీ చేసింది. సదరు సంస్థకు ఆర్డర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభు త్వం కలెక్టర్లకు సూచించింది. జీవోను ఆసరాగా చేసుకున్న మున్సిపాలిటీ వాహనాల కొనుగోలు కోసం నిబంధనలకు విరుద్ధంగా నేరుగా టీఎస్‌ ఆగ్రోస్‌ సంస్థకు ఆర్డర్‌ చేసింది. టీఎస్‌ ఆగ్రోస్‌ సంస్థ వాహనాలు, ఇతర పరికరాల తయారీ చేయకపోగా, కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుంది. ఆర్డర్లు పొందిన అనంతరం వివిధ కంపెనీలు, డీలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వాహనాలు, పరికరాలను ఆయా సంస్థలకు సరఫరా చేస్తుంది. 

ఇవీ నిబంధనలు...

మున్సిపాలిటీల పరిధిలో లక్ష రూపాయలు పైబడి చేపట్టే ప్రతీ పనికి ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌ టెండర్లను పిలవాల్సి ఉంటుంది. చేపట్టవలసిన పనికి సంబంధించి ముందుగా కౌన్సిల్‌ తీర్మానం చేసిన అనంతరం అంచనా వ్యయం కోసం ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు పంపాలి. పని అంచనా వ్యయం నిర్ధారించుకున్న తరువాత కౌన్సిల్‌ పరంగా అనుమతి పొందాలి. అనంతరం కొనుగోలు చేయదలచిన వాహనం, పరికరం అం చనా వ్యయం రూ.5 లక్షల వరకు ఉన్నట్లయితే మున్సిపల్‌  ఇంజనీరు, రూ.50 లక్షల వరకు జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు, రూ.కోటి వరకు రీజియన్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీరు, ఆపై ధరతో కొనుగోలు చేయడా నికి హైద్రాబాద్‌లోని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నుంచి టెక్నికల్‌ సాంక్షన్‌ పొం దాల్సి ఉంటుంది. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో టెండర్లు ఆహ్వానిస్తే అర్హత, ఆసక్తిగల కాంట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉంటుంది. టెండర్లలో తక్కువ ధర కోట్‌ చేసిన వారికి అధికారులు అగ్రిమెంటు పూర్తిచేసి, వర్క్‌ ఆర్డరు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలన్నీ గాలికి వదిలిన మంచిర్యాల మున్సిపాలిటీ ఆటోల కొనుగోలు ఆర్డర్లు నేరుగా టీఎస్‌ ఆగ్రోస్‌ సంస్థకు ఇవ్వడం కలకలం రేపింది.

నిధులు దుర్వినియోగం....

వాహనాల కొనుగోలు విషయంలో రూ.13 లక్షల పైచిలుకు ప్రజా ధనం దుర్వినియోగం అయినట్లు సమాచారం. చెత్త సేకరణకు అవసరమైన 23 మారుతీ సూపర్‌ క్యారీ హైడ్రాలిక్‌ (పెట్రోల్‌) బీఎస్‌ 6 వాహనాల కోసం మున్సిపాలిటీ టీఆఎస్‌ ఆగ్రోస్‌కు ఆర్డరు ఇచ్చింది. సంస్థ ఒక్కో వాహనం ఖరీదు విడిభాగాలు, ఇన్సూరెన్స్‌ తదితర అన్ని అంశాలు కలుపుకొని రూ.5,81,407 నిర్ణయించగా మొత్తం రూ.1,33,72,361 వెచ్చించి ఆర్డర్లు పెట్టింది. వాహనాల వ్యయం రూ.కోటి దాటినందున వరంగల్‌లోని సూపరింటెండింగ్‌ ఇంజనీరు నుంచి టెక్నికల్‌ సాంక్షన్‌ తీసుకొని, మున్సి పాలిటీ తరుపున టెండర్లు పిలవాలి. అవేమీ పరిగణలోకి తీసుకోకుండా నేరుగా ఆర్డర్లు ఇవ్వడంతో ప్రజాధనాన్ని వృథా చేసినట్లయింది. అవే వాహనాలకు సంబంధించి జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ టీఎస్‌ ఆగ్రోస్‌కు ఆర్డర్లు ఇవ్వకుండా నిబంధనల మేరకు టెక్నికల్‌ సాంక్షన్‌ పొంది రూ.5,24,000 అంచనాతో ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించింది. మంచిర్యాలలో ఈ పద్ధతి పాటించకపోవడంతో మున్సిపాలిటీపై అదనపు భారం పడింది. ఈ లెక్కన వాహనాల కొనుగోలులో రూ.13,20,361లను మంచిర్యాల మున్సిపాలిటీ అదనంగా చెల్లించింది. వాహనాలు వచ్చిన వారం రోజులకే వరుసగా మరమ్మతులకు గురికావడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇలా అధిక ధరలు చెల్లిస్తూ ఆర్డర్లు ఇవ్వడం వల్ల పెద్ద మొత్తంలో కమీషన్లు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి పార్టీలకు సంబంధం లేకుండా కౌన్సిల్‌ సభ్యులను తన ఇంటికి పిలిపించుకొని రూ.25వేల నగదుతో కూడిన కవర్లు అందజేయడాన్ని ’ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. అయితే ఆటోల కొనుగోలులో అందిన కమీషన్లనే ఇలా సభ్యులకు పంపిణీ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ సజావుగా జరిగి అధిక చెల్లింపులపై బాధ్యులపై చర్యలు తీసుకొని డబ్బును రికవరీ చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-07-02T04:07:10+05:30 IST