Abn logo
May 15 2020 @ 15:18PM

ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో సహకార స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో కుటుంబాల పాత్రే కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన ఫేస్‌బుక్‌ వేదికగా కుటుంబ వ్యవస్థపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సమాజాన్ని ఏకం చేసే మార్గంలో కుటుంబమే ప్రాథమిక పునాదని.. సాంఘిక విలువలు నిర్మితమై, వాటిని పోషించే కుటుంబ వ్యవస్థ సమాజానికి పునాది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. వసుధైవ కుటుంబకం అనే భారతీయ భావన, కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను, అదే విధంగా మానవ నాగరికత పురోగతిలో దాని సార్వత్రిక పాత్రను నొక్కి చెబుతుందన్నారు. ఆయన మాటల్లోనే... 


శతాబ్దాలుగా భారతదేశంలో శాశ్వతమైన వాటిల్లో సంప్రదాయ కుటుంబ వ్యవస్థ కూడా ఒకటి. విస్తృతమైన కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ జీవన విధానంలో ఓ ప్రత్యేకమైన అంశం. ఏదేమైనా పాశ్చాత్యీకరణ, పట్టణీకరణతో పాటు అనేక ఇతర సామాజిక, ఆర్థిక కారణాల ఫలితంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చిన్న కుటుంబాల వ్యవస్థ బాగా పెరిగిపోయింది.


ప్రస్తుత ప్రపంచంలో సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల యువత మీద ఉమ్మడి కుటుంబం చూపే సానుకూల ప్రభావం బలహీనపడడం దురదృష్టకరం.


కుటుంబ సభ్యులందరి సహకారంతో జీవన వ్యయాన్ని తగ్గించుకోగలగడం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండే ప్రధానమైన సానుకూల అంశం. వాస్తవానికి ఈ వ్యవస్థలో వివిధ రోజువారి ఇంటి కార్యకలాపాలకు సహకార స్ఫూర్తి ఆధారంగా నిలిచింది. ఉదాహరణకు పిల్లల తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తూ ఉంటే, అత్త మామలు లేదా ఇతర కుటుంబ సభ్యులు రోజు వారి హోం వర్క్ లాంటి వాటిల్లో పిల్లలకు సహాయం చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారాన్ని పంచుకునే భావన సంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో సహజంగానే నిర్మితమైంది.


ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతి ప్రధానంగా తెలియజేసే షేర్ (భాగస్వామ్యం), కేర్ (సంరక్షణ) వైఖరిని పిల్లల్లో ప్రేరేపిస్తుంది. పిల్లలు, తోబుట్టువులు, అత్తమామలు, పిన్ని బాబాయిలు, మేనమామలు, తాతయ్య బామ్మలతో విస్తరించిన కుటుంబాల్లో పెరిగే పిల్లలు సహానుభూతి, సహనం వంటి లక్షణాలను సహజసిద్ధంగా కలిగి ఉంటారు. కలసికట్టుగా కృషి చేయడంలో ఉండే లాభాన్ని కూడా వారు గ్రహించగలుగుతారు. అదే విధంగా కుటుంబంలో అందరూ కలిసి అందించే సహకారం ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను పటిష్టం చేస్తుంది.


యోగ్యతలేమిటి, లోపాలేమిటి అనే విషయాలను పక్కన పెడితే, ఆరోగ్యకరమైన, విలువల ఆధారిత సమాజాన్ని నిర్మించడంలో ఓ సంస్థగా కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పెద్దలను గౌరవించుకోవడం అనేది భారతీయ సంస్కృతి మనోగతంలో నిక్షిప్తమైన పురాతన ఉదాత్త భావం. భారతీయ కుటుంబాలు పెద్దలకు, సహాయం అవసరమైన ఇతరులకు సహాయక వ్యవస్థలుగా పని చేస్తాయి. వృద్ధులు, పిల్లలకు మానసిక భద్రతను అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కోవిడ్ -19 లాంటి మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇది మరింత కీలకం.


“అఘోరేణ చక్షుషా మిత్రియేణ... గృహానైమి సుమనా వన్దమానో రమధ్వం.. మా బిబీత మత్‌...” అని అధర్వణ వేదం చెబుతోంది. శక్తి కలిగి, ధనార్జన చేసే ఉత్తమ మేధా సంపన్నుడు, కోపం లేని కళ్లతో స్నేహంగా చూసేవాడు, సుప్రసన్నమైన మనసుతో అందరూ శ్లాఘించే విధంగా జీవించేవాడు గృహంలోని వారికి లభ్యమగుగాక అని దీని అర్థం.


గృహమే కదా స్వర్గసీమ అనేది పెద్దల మాట. స్వర్గం, నరకం అనేవి ఎక్కడో ఉండవు. గృహస్థ జీవనమే స్వర్గం అని వేదవేత్తల అభిప్రాయం. అలాంటి కుటుంబాన్ని విస్మరించి, వ్యక్తిగత సుఖం కోసం అందరినీ దూరంగా పెట్టి, ఒంటిగా జీవించడం ఆత్మహత్యా సదృశం అని పెద్దలు తెలియజేశారు. సనాతన భారతీయ కుటుంబ వ్యవస్థకు పునరుత్తేజం తీసుకువచ్చిన నాడే మనిషి గమనం సుగమం అవుతుంది.


సంఘర్షణా సమయంలో పరిష్కారాన్ని అందజేయడంలో కుటుంబం మార్గదర్శక పాత్ర పోషిస్తుంది. కష్ట సమయాల్లో ఓదార్పునిస్తుంది. మన ప్రతి సమస్యకు కౌన్సిలింగ్ అందిస్తుంది. మనిషి జీవన నాణ్యతను పెంచే పునాది వేసే దిశగా సంప్రదాయ విలువలను కుటుంబం మనకు బోధిస్తుంది.అదే విధంగా జీవన విధానాన్ని బోధించి మనల్ని సరైన మార్గంలో ముందుకు నడుపుతుంది.


ప్రతి భారతీయుడు భారతీయ కుటుంబ వ్యవస్థలో భాగమైనందుకు గర్వపడడమే కాదు, అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించి, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి.


సమాజంలో నైతిక, సామాజిక మరియు సాంస్కృతిక విలువలను రూపొందించడంలో కుటుంబాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇలాంటి విషయాల్లో కుటుంబాలు ముందడుగు వేయడం ద్వారా అవినీతి, లింగ వివక్ష, పెద్దల పట్ల జరుగుతున్న అపచారాలు లాంటి సామాజిక మౌఢ్యాలను పూర్తిగా దూరం చేయాల్సిన అవసరం ఉంది.


1993లో, ఐక్యరాజ్యసమిత సర్వసభ్య సమావేశం ప్రతి ఏడాది మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా పాటించాలని ఒక తీర్మానంలో నిర్ణయించింది. ఈ రోజు ఆరోగ్యకరమైన వ్యక్తులు, సమాజాలు మరియు దేశాల అభివృద్ధిలో కుటుంబాల కీలక పాత్ర గురించి అవగాహన పెంచడమే కాకుండా, కుటుంబ వ్యవస్థను ఎప్పటికప్పుడు పీడిస్తున్న వివిధ రుగ్మతలను తొలగించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపడం కూడా ఇందులోని భాగమే.


కుటుంబాన్ని పాథమిక సామాజిక విభాగంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, భారతీయులు ఎల్లప్పుడూ మొత్తం విశ్వ శ్రేయస్సును విశ్వసిస్తారు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తికి ఉదాహరణగా, కోవిడ్ -19 వల్ల గతంలో ఎప్పుడూ చూడని సంక్షోభం నేపథ్యంలో భారతదేశం ఇతర దేశాలకు సహాయం అందించింది. “ప్రపంచంతో స్నేహం చేయడం, మొత్తం మానవ కుటుంబాన్ని ఒక్కటిగా పరిగణించడమే బంగారు మార్గం” అని చెప్పిన జాతిపిత మహాత్మాగాంధీ మాటలను ఈ సమయంలో మననం చేసుకోవడం సముచితం.


 -           వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ప్రత్యేకంమరిన్ని...