న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల (Vice President Elections) పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఎన్డీయే అభ్యర్థిగానూ, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా ప్రతిపక్షాల అభ్యర్థిగానూ పోటీ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్డీయే అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మార్గరెట్ అల్వా (Margaret Alva (80) కాంగ్రెస్ సీనియర్ నేత, గతంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జగదీప్ ధన్‌కర్ (Jagdeep Dhankhar) జాట్ నేత, సోషలిస్టు భావజాలం కలిగిన వ్యక్తి.
శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే ప్రతిపక్షాలు ఐకమత్యంగా లేనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ ఓటింగ్‌కు గైర్హాజరవాలని నిర్ణయించుకుంది. మార్గరెట్ అల్వాను ఎంపిక చేసేటపుడు తమను సంప్రదించలేదని ఆరోపించింది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తోంది.
అల్వాకు మద్దతిస్తున్నది వీరే...
మార్గరెట్ అల్వాకు దాదాపు 200 ఓట్లు (26 శాతం) లభించే అవకాశం ఉంది. ఆమెకు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు మద్దతిస్తున్నాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.
బీజేపీ మాక్ డ్రిల్
ఇదిలావుండగా, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసే విధానాన్ని వివరిస్తూ బీజేపీ శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీల ఎంపీలు దీనిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కొందరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, మరో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ధన్‌కర్ ధన్యవాదాలు
బీజేపీ నిర్వహించిన మాక్ ఓటింగ్ డ్రిల్ అనంతరం ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ పార్లమెంటుకు వచ్చారు. తనకు మద్దతిస్తున్నందుకు ఎన్డీయే ఎంపీలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి