వయా బీహెచ్‌ఈఎల్‌..ప్రయాణం ఇక ఈజీ..!

ABN , First Publish Date - 2022-07-20T17:13:24+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులోని బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ చిక్కుముళ్లకు త్వరలో చెక్‌ పడనుంది. ఎప్పుడో అటకెక్కిన ఫ్లై ఓవర్‌ నిర్మాణ ప్రతిపాదనకు మోక్షం

వయా బీహెచ్‌ఈఎల్‌..ప్రయాణం ఇక ఈజీ..!

ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కేంద్రం నిధులు   

మారనున్న ఆ ప్రాంత రూపురేఖలు


హైదరాబాద్‌ సిటీ/భెల్‌కాలనీ: గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులోని బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ చిక్కుముళ్లకు త్వరలో చెక్‌ పడనుంది. ఎప్పుడో అటకెక్కిన ఫ్లై ఓవర్‌ నిర్మాణ ప్రతిపాదనకు మోక్షం కలిగింది. కేంద్ర రవాణ శాఖ నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తాలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది. జాతీయ రహదారి 65లోని హైదరాబాద్‌-పుణె మార్గంలో గల బీహెచ్‌ఈఎల్‌ వద్ద 1.65 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ను ఆరు లైన్లతో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అక్కడ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కునే వాహనదారులకు ఇది ఉపశమనమే. 

పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన బీహెచ్‌ఈఎల్‌ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున వివిధ రకాల కంపెనీలున్నాయి. పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలతో పాటు గేటెడ్‌ కమ్యూనిటీలూ వెలిశాయి. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. దాంతో బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌లో సిగ్నల్‌ పడితే నలువైపులా వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గం గుండా నగరంలోకి ప్రవేశించడం, నగరం నుంచి బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. 


కష్టాలకు చెక్‌

జాతీయ రహదారులను ఎక్స్‌ప్రె్‌సవేలుగా మారుస్తున్న కేంద్రం వాహనాల రద్దీ ఉండే రోడ్లపై ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు చేపడుతోంది. ఇప్పటికే బెంగళూర్‌ జాతీయ రహదారిపై శంషాబాద్‌ వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌లో రూ.130.65 కోట్లతో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయితే నల్లగండ్ల ఓల్డ్‌ ముంబై రోడ్డు మార్గం ద్వారా నగరంలోకి రావడం, లింగంపల్లి రోడ్డు నుంచి ఐటీ కారిడార్‌కు చేరడం సులభం కానుంది. పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట్‌, జహీరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఆ ప్రాంత రూపురేఖలు కూడా మారనున్నాయి. అయితే, ఇక్కడ కేవలం ఫ్లై ఓవర్‌ నిర్మాణంతో ఉపయోగం లేదని, భవిష్యత్తులో మెట్రోరైల్‌ పొడిగింపునకు అనుగుణంగా డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం కేటాయించిన నిధులు కేవలం ఫ్లై ఓవర్‌కేనా, డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మిస్తారా అనే దానిపై స్పష్టత కొరవడింది.

Updated Date - 2022-07-20T17:13:24+05:30 IST