గంగమ్మ సన్నిధిలో విషాదం

ABN , First Publish Date - 2022-05-17T08:22:25+05:30 IST

కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తమ పట్టణంలో జరిగే గంగమ్మ జాతరకోసం తన భర్తతో కలిసి కర్నూలు నుంచి వచ్చారామె.

గంగమ్మ సన్నిధిలో విషాదం
ప్రభాకర్‌నాయుడును పరామర్శిస్తున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి

జాతరకోసం కర్నూలు నుంచి వచ్చి.. 

పలమనేరు గుడిలో విద్యుదాఘాతంతో 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి 

పలమనేరు, మే 16: కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తమ పట్టణంలో జరిగే గంగమ్మ జాతరకోసం తన భర్తతో కలిసి కర్నూలు నుంచి వచ్చారామె. నిజరూప విగ్రహానికి ఏడడుగుల దూరంలో గంగమ్మను దర్శించుకునే క్రమంలో ఆదివారం రాత్రి రేకు తలుపును తాకగానే విద్యుదాఘాతానికి గురయ్యారు. అమ్మవారిని దర్శించుకోకనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రజిని అసువులు బాశారు. పలమనేరులో ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పలమనేరు పట్టణంలోని ముత్తాచారిపాళ్యంలో నివాసముంటున్న ప్రభాకర్‌నాయుడు ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య రజిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కొంతకాలం స్టాఫ్‌నర్సుగా పనిచేశారు. ఆ తర్వాత పదోన్నతిపై ఆమె కర్నూలులోని మెడికల్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది గంగజాతర నిర్వహిస్తున్నారని తెలిసి తన భర్తతో కలిసి ఆదివారం సాయంత్రం పలమనేరులోని ఇంటికి చేరుకున్నారు. ఇంటి కిటికీలు గాలికి కొట్టుకొని అద్దాలు పగిలిపోయి ఉండటంతో శుభ్రపరిచారు. రాత్రి చినుకులు పడుతున్నా.. గంగమ్మ శిరస్సు ఊరేగించిన అనంతరం ప్రతిష్ఠించిన అమ్మవారి నిజరూప దర్శనం కోసం గుడికి వెళ్లారు. క్యూలో వెళ్లే సమయంలో గుడివెనుక వైపునకు వెళ్లే దారి వద్దనున్న రేకు తలుపును తాకగానే విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే ఆమెను తలుపు నుంచి లాగేందుకు ప్రభాకర్‌ నాయుడు రెండుసార్లు ప్రయత్నించే క్రమంలో ఆయనా విద్యుదాఘాతానికి గురయ్యారు. షాక్‌ కొడుతోందంటూ కేకలు వేయడంతో డ్యూటీలో ఉన్న పోలీసులు వచ్చి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న రజినిని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ప్రభాకర్‌నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కంటి ముందే భార్య ప్రాణాలు కోల్పోతున్నా ఏమిచేయలేని నిస్సహాయుడిగా ఉండిపోవాల్సి వచ్చిందంటూ ఆయన కన్నీటి పర్యంత మయ్యారు. 

నిర్వాహకుల నిర్లక్ష్యం!

రెండేళ్ల తర్వాత జరుగుతున్న గంగమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొనేందుకు వస్తారని తెలుసు. అయినా, ఆలయం లోపల విద్యుత్‌ తీగల ఏర్పాటు విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించారని నిర్వాహకులపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తున్నా ఎండోమెంట్‌ అధికారులు, సిబ్బంది ఆలయం వద్ద లేకపోవడం గమనార్హం. ఆలయ కమిటీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్థానికులు అంటున్నారు. కాగా, జాతర చాటు సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ కాలిపై గంగమ్మ ఊరేగింపు కోసం ఏర్పాటుచేసి ఇనుపరథం చక్రం ఎక్కడంతో ఆయన కాలి వేలు చితికి పోయింది. ఇప్పుడు ఆలయంలోనే విద్యుదాఘాతంతో ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

ఆలయం మూసివేయని అధికారులు 

హిందూ సంప్రదాయం ప్రకారం ఏ ఆలయంలోనైనా ఎవరైనా చనిపోతే వెంటనే ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించి, సంప్రోక్షణ చేశాక దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. కానీ, గంగమ్మ గుడిలో అధికారులు ఈ సంప్రదాయాలను ఏమాత్రం పట్టించుకోలేదు. శనివారం రాత్రి ఆలయంలోనే విద్యుదాఘాతంతో రజిని మృతి చెందినా, ఆదివారం తెల్లవారుజామున గంగమ్మ జలది ఉత్సవాల నిర్వహణ.. దర్శనాలనికి భక్తులను అనుమతించడం పలువిమర్శలకు తావిస్తోంది. ఆదివారం ఉదయం వరకు కూడా ఎండోమెంట్‌ అధికారులు ఆలయాన్ని ఎందుకు మూయించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

రద్దీ ఉన్నప్పుడు జరిగి ఉంటే.. 

‘ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే నా భార్య చనిపోయింది. గంగమ్మ విగ్రహానికి కేవలం ఏడు అడుగుల దూరంలో ఆమెకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. నేను గొంతు చించుకొంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. గంగమ్మ విగ్రహం వద్ద నిమ్మకాయలు విసురుకొంటూ ఉండిపోయారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసం’ అని ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే వెంకటేగౌడను ప్రభాకర్‌ నాయుడు ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన్ను పరామర్శించేందుకు వీరు వచ్చారు. ఆలయ నిర్వహణ గురించి ఎండోమెంట్‌ అధికారులు ఏమాత్రం పట్టంచుకోలేదని ఆయన ఆరోపించారు. భక్తుల రద్దీ ఉన్నప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే ఎంతో మంది మృత్యువాత పడి ఉండేవారన్నారు. కాగా, వీరి కుమార్తెలు అమెరికానుంచి రావాల్సి ఉండటంతో మంగళవారం సాయంత్రం లేదా బుధవారం పోస్టుమార్టం నిర్వహించాలని డాక్టర్లకు ఫోనులో ఎమ్మెల్యే సూచించారు.


మృతురాలి కుటుంబీకులకు అమర్‌ పరామర్శ 

రజిని కుటుంబ సభ్యులను సోమవారం మాజీ మంత్రి అమరనాథరెడ్డి పరామర్శించారు. గంగమ్మ ఆలయంలోనే రజిని విద్యుత్‌షాక్‌తో చనిపోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో జరగలేదని.. ఇప్పుడు జరగడం చాలా బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రముఖులు, పెద్దల సలహాలు తీసుకోవాలని అధికారులు, ఆలయ కమిటీ నిర్వాహకులకు సూచించారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు ఖాజాపీర్‌, నాగరాజు, జగదీ్‌షనాయుడు, జగదీష్‌ తదితరులున్నారు. 

Updated Date - 2022-05-17T08:22:25+05:30 IST