కరోనా పరీక్షల పేరుతో నిలువు దోపిడి

ABN , First Publish Date - 2020-08-15T11:15:13+05:30 IST

కరోనా వైరస్‌ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా, వైద్య పరీక్షల పేరుతో ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వహకులు బాధితులను భారీగా దోచుకుంటున్నారు.

కరోనా పరీక్షల పేరుతో నిలువు దోపిడి

అద్దంకి, ఆగస్టు 14 : కరోనా వైరస్‌ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా, వైద్య పరీక్షల పేరుతో ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వహకులు బాధితులను భారీగా దోచుకుంటున్నారు. కొవిడ్‌ భయాన్ని వారు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం అద్దంకి పట్టణంలో యథేచ్చగా సాగుతోంది. ఇటీవలకాలంలో పలు ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వహకులు గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహించి ఎటువంటి రిపోర్టులు ఇవ్వకుండానే మౌఖికంగా పాజిటివ్‌, నెగిటివ్‌ అని చెప్పి రూ.3 వేల నుంచి రూ.4వేల వసూలు చేస్తున్నారు. ఈక్రమంలో పట్టణంలోని కొన్ని ల్యాబ్‌ల నిర్వహకులు మిగిలిన పరీక్షలను పక్కన పెట్టి కేవలం కరోనా పరీక్షలకే ప్రాధాన్యత ఇస్తూ  దండుకుంటున్నారన్న విమర్ళలు వస్తున్నాయి. ఇక నియోకవర్గస్థాయిలో అద్దంకి పట్టణానికి సమీపంలో శింగరకొండ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉన్న క్వారంటైన్‌ కేంద్రంలో ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.


అయితే అక్కడి వైద్యులు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను ఒంగోలు రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు పంపాల్సి ఉండగా, హోం క్వారంటైన్‌కు రిఫర్‌ చేస్తూ ప్రైవేటు ల్యాబ్‌లో ఎక్స్‌రే తీయించుకోవాలని సలహా ఇస్తుండటం గమనార్హం. ఇదే అదునుగా ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వహకులు ఇష్టానుసారం దండుకుంటున్నారు.  ఎక్స్‌రే తీసినందుకు రూ.200 నుంచి రూ.250 కాగా కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల వద్ద మాత్రం రూ.700 నుంచి రూ. 1000 వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో కుటుంబంలో నలుగురైదుగురు కరోనా పరీక్షల కోసం వచ్చి ఎక్స్‌రే తీయించుకోవాల్సి రావటంతో రూ.4వేలకుపైగా ఖర్చుచేయాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. అసలే పనులు లేక కుటుంబపోషణ భారంగా ఉన్న కుటుంబాలకు కరోనా పరీక్షలు, ఎక్స్‌రేలకు రూ.వేలకువేలు ఖర్చుచేయాల్సి రావటం మరిం త భారంగా మారింది. అనుమతులు లేకుండా ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. 


అనుమతుల్లేకుండా పరీక్షలు చేయకూడదు

అనుమతులు లేని ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహించకూడదు. పరీక్షలు నిర్వహిస్తే కచ్చితంగా  రిపోర్టులు ఇవ్వాలి. రిపోర్టులు ఇవ్వకుండా మౌఖికంగా చెప్పటం నేరం.

- డాక్టర్‌ విజయేంద్ర, సీహెచ్‌సీ, అద్దంకి


వాళ్లకే ఎక్స్‌రేలు సూచిస్తున్నాం

కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు ఒంగోలు ఐసోలేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడకుండా హోం క్వారంటైన్‌లో ఉంటామని అం టున్నారు. దీంతో కచ్చితమైన నిర్ధారణ కోసం ఎక్స్‌రే తీయించుకోవాలని సూచిస్తున్నాం. 

-డాక్టర్‌ అమీర్‌ఆలీ, క్వారంటైన్‌ కేంద్రం వైద్యులు, శింగరకొండ

Updated Date - 2020-08-15T11:15:13+05:30 IST