PK Teamతో TRS చేయించిన సర్వేలో షాకింగ్‌ రిజల్ట్స్‌.. వార్ వన్‌సైడ్ అనుకుంటే ఇలా జరిగిందేంటి..!?

ABN , First Publish Date - 2022-03-22T17:12:31+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి వన్‌ మాన్‌ షో నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీలు కేవలం ప్రేక్షకపాత్ర...

PK Teamతో TRS చేయించిన సర్వేలో షాకింగ్‌ రిజల్ట్స్‌.. వార్ వన్‌సైడ్ అనుకుంటే ఇలా జరిగిందేంటి..!?

ఆ నియోజకవర్గంలో ప్రతిపక్షమే లేదు..అధికార పక్ష నేతలను కనీసం ప్రశ్నించే వారు లేరు. బలం, బలగం లేక  విపక్షం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. దీంతో ఈ నియోజకవర్గంలో వార్‌ వన్‌సైడే అయినా ఆశ్చర్యకరంగా టీఆర్ఎస్ బలహీనపడుతోంది. టీఆర్‌ఎస్‌ ఇక్కడ చేయించిన సర్వేలో షాకింగ్‌ రిజల్ట్స్‌వచ్చాయట. మరి దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


వేముల ప్రశాంత్‌రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి వన్‌ మాన్‌ షో నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీలు కేవలం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. పాలకుల లోపాలను ఎండగట్టే శక్తి లేక విపక్షాలు మౌనవ్రతం చేస్తున్నాయి. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వేముల ప్రశాంత్‌రెడ్డి  ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. ఇక్కడ నుంచి ఈయన వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి మంత్రి పదవీ వరించింది. దీంతోపాటు సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు కావడంతో బాధ్యతలు ఎక్కువ అయ్యాయి. తన మంత్రిత్వ శాఖ బాధ్యతలతోపాటు సీఎం పురమాయించే పనులు కూడా ఈయనే చూసుకుంటున్నారు.  దీనికోసం ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి వస్తోంది. సీఎం పక్షాన జాతీయ స్థాయి పనుల్లోనూ పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో ఆయన గ్రాఫ్ బాగా పెరిగింది. సీఎం అంతరంగికుల్లో ఒకడిగా ఇటు పార్టీలో, అటు ప్రజల్లో గుర్తింపు లభించింది.. ఇంతటి ముఖ్య నేత సొంత నియోజకవర్గంలో టీఆర్ఎస్  పరిస్థితి ఎలా ఉందనే విషయమై ఇటీవల అధిష్ఠానం ఓ శాంపిల్‌ సర్వే చేసింది. ఈ సర్వేలో మంత్రికి ప్రతికూల ఫలితాలు వచ్చాయని తెలిసింది. 


రాష్ట్ర స్థాయి నేతగా వేముల ప్రశాంత్ రెడ్డి 

రాష్ట్ర స్థాయి నేతగా మారిన వేముల ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాత్రం ఎదురీదే పరిస్థితి ఏర్పడింది. సహజంగానే ఆయన ఇక్కడి ప్రజలకు దూరమవుతున్నారు. పార్టీ శ్రేణులను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆయన తమ్ముడు అజయ్‌ ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయనే అందుబాటులో ఉంటున్నాడు. అనేక వ్యవహారాలు మంత్రి వరకు వెళ్ళకుండానే చక్కపెట్టేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డో.. ఆయన తమ్ముడు అజయో తెలియని పరిస్థితి ఏర్పడింది.  ఇక బాల్కొండలో  అభివృద్ధి పనులన్నీ ఒకే కాంట్రాక్టర్‌ చేతిలో ఉన్నాయి. ఈయన  ప్రశాంత్ రెడ్డికి సన్నిహితుడు. ఇటీవలే నాయకుడిగానూ  అవతారమెత్తాడు.  బాల్కొండలో ఏ పనైనా ఆ కాంట్రాక్టరే  చేయాలనే ఆదేశాలుండడంతో పార్టీనే నమ్ముకున్న ఇతర నేతలు ఆవేదన చెందుతున్నారు. దీంతో జేబులు నింపుకోవడానికి  కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పడుతున్నారు. ఇసుక  దందా, మొరం తవ్వకాలు, కంకర క్వారీలు నడుపుతూ అభాసుపాలవుతున్నారు. 


నియోజకవర్గమంటే చాలు కన్నెత్తి చూడ్డని మంత్రి

మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్ పల్లి,  భీమ్ గల్ ప్రాంతాల్లో వాగుల్లోంచి ఇసుకను తోడేస్తున్న వారిలో టీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఉన్నారు. అభివృద్ధి పనుల పేరుతో  ఇసుక దందా సాగిస్తున్నారు. అడ్డుకునే అధికారులను మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు మొదలు గ్రామ పంచాయతీల వరకు నిధుల దుర్వినియోగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవలే తాళ్ళ రాంపూర్, ఎర్గట్ల సొసైటీల్లో కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు తీసుకునే ప్రయత్నం చేయగా, మంత్రి పేరు చెప్పి మాయ చేసేశారు. కొన్ని సందర్భాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పక్షాన అధికారులపై వివిధ రకాల ఒత్తిళ్ళు కూడా వచ్చాయి. దీంతో చాలామంది అధికారులు మంత్రి  నియోజకవర్గమంటే చాలు కన్నెత్తి చూడ్డం లేదు.


అనేక వివాదాలకు కారణమవుతోన్న గులాబీ నేతల పనితీరు

బాల్కొండలో గులాబీ నేతల పనితీరు అనేక వివాదాలకు కారణమవుతోంది. తగిన నియంత్రణ లేకపోవడంతో కిందిస్థాయి నేతలు రెచ్చిపోతున్నారు. దీని ఫలితంగానే సర్వేలో గులాబీ నేతలపై అసంతృప్తి వ్యక్తమైనట్లు తేలిందట. అనేక అభివృద్ధి పనులు, కొత్త పథకాల వల్ల ప్రజలకు మేలు జరిగినా, నాయకుల పనితీరుతో అవి జనానికి పట్టడం లేదని సర్వే బృందం తేల్చిందట.ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎదురీత తప్పదని భావిస్తున్నారు. అందుకే ఢిల్లీకి రాజైనా గల్లీ ప్రజలను మరిచిపోకూండదని అంటారు.  

Updated Date - 2022-03-22T17:12:31+05:30 IST