వెలంపల్లి.. ఇదేం లొల్లి..?

ABN , First Publish Date - 2020-08-15T16:54:56+05:30 IST

కరోనాతో అసలే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటే మంత్రి..

వెలంపల్లి.. ఇదేం లొల్లి..?

మంత్రిగారి బర్త్‌డే పేరిట అనుచరుల దందాలు

వ్యాపారుల నుంచి భారీ చందాలు

స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడానూ..

కోట్ల రూపాయల్లో వసూళ్లు

కరోనా వేళ ఇదేంటని వ్యాపారుల గగ్గోలు

ఆర్భాటం వద్దని మంత్రి సూచన

అయినా బ్యానర్లు, కటౌట్లతో అనుచరుల హడావిడి

గుంపులుగా తిరిగినా పట్టించుకోని పోలీసులు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): కరోనాతో అసలే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటే మంత్రి పుట్టినరోజు పేరుతో వేలకు వేలు చందా ఇవ్వాలంటే ఎలా? అన్నీ బాగుంటే మేమే సంతోషంగా మా సెంటర్లో కేకు కట్ చేసి బ్యానర్ కట్టేవాళ్లం కదా..! .. వన్‌టౌన్‌లో ఉన్న కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్‌లో వస్త్ర వ్యాపారం చేసే ఓ వ్యాపారి ఆవేదన ఇది. ఈయనొక్కరే కాదు.. వస్త్రలత, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, గొల్లపూడి గాంధీ హోల్‌సేల్ మార్కెట్, భవానీపురం ఐరన్‌యార్డులోని వ్యాపారుల నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బర్త్‌డే పేరిట ఆయన అనుచరులు కోట్ల రూపాయల్లో చందాలు వసూలు చేశారు. అంతేకాదు.. కొవిడ్ నిబంధనలను పక్కనపెట్టి గుంపులుగా వేడుకలు నిర్వహించి నగరంలో నానా హంగామా సృష్టించారు.


మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు పేరుతో ఆయన అనుచరుల వసూళ్ల దందాకు వన్‌టౌన్‌లోని పలువురు వ్యాపారులు కన్నీరు పెడుతున్నారు. చిన్న వ్యాపారులను సైతం విజయవాడలో వివిధ రకాల వ్యాపారులకు పెట్టింది పేరు. వస్త్రలత, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వంటి హోల్‌సేల్ వస్త్రవ్యాపారాలు మొదలు అన్ని రకాల టోకు వ్యాపారాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడున్న వ్యాపారులతో పాటు గొల్లపూడిలోని గాంధీ హోల్‌సేల్ మార్కెట్, దక్షిణ భారతంలోనే అతిపెద్దదైన భవానీపురం ఐరన్ యార్డులోని వ్యాపారుల నుంచీ మంత్రి అనుచరులు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేశారు.


ఫార్మా వ్యాపారి అయిన మంత్రి అనుచరుడొకరు మెడికల్ షాపుల నుంచి పెద్ద ఎత్తున చందాలు లాగారు. చిన్న, పెద్ద ఆలయాల ఈవోల నుంచి కూడా భారీగానే వసూళ్లు జరిగినట్లు సమాచారం. పుట్టినరోజు పేరుతో సుమారు రూ.5కోట్ల మేర వసూళ్లు జరిగినట్లు తెలిసింది. మంత్రి అనుచరులకు డబ్బు సమర్పించుకోవడంతోపాటు పత్రికల్లో ప్రకటనలు, వన్‌టౌన్‌లోని వివిధ సెంటర్లలో కేక్ కటింగ్‌లు, అన్నదానాలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం అదనం. అసతే కరోనాతో వ్యాపారాలు నడవక తాము అల్లాడుతుంటే ఈ వసూళ్ల దందా ఏమిటని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.


ఆయన అలా.. వీరు ఇలా..!

‘కరోనా కారణంగా ఈ ఏడాది నా జన్మదిన వేడుకల పేరిట ఆడంబరాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయండి..’ అంటూ మంత్రి వెలంపల్లి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన చదివిన వ్యాపారులంతా ఆయనెంతో ఆదర్శనీయుడని సంతోషించారు. కానీ, ఆయన అనుచరులు స్వామికార్యం, స్వకార్యం రెండూ తీర్చుకోడానికి వసూళ్ల దందాకు తెగబడ్డారు. ఇవ్వకుంటే కేసులు పెట్టించి వేధిస్తారన్న భయంతో చాలామంది వ్యాపారులు కిక్కురుమనకుండా సమర్పించుకున్నారు. మంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పేరుతో హోర్డింగులు పెట్టిన వారిలో అధిక శాతం దందాలు వసూలుచేసే వారేనని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు.



ఇప్పుడు పార్టీ కార్యాలయం ప్రారంభమా..?

నిజానికి పుట్టినరోజైన్ శనివారం మంత్రి వెలంపల్లి నగరంలో ఉండడం లేదు. దీంతో ఒకరోజు ముందే శుక్రవారం ఆయన అభిమానులు హడావిడి చేశారు. పుట్టినరోజు వేడుకలంటే బాగోదన్న ఉద్దేశంతో వన్‌టౌన్ శివాలయం సెంటరులో 42వ డివిజన్ వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం పేరిట పెద్దఎత్తున హంగామా చేశారు. పనిలోపనిగా మంత్రి పుట్టినరోజు వేడుకలనూ నిర్వహించారు. కరోనా ఆంక్షలను పట్టించుకోకుండా అభిమానులు గుంపులుగుంపులుగా తరలివచ్చారు. ఇదిచూసి స్థానికులు బెంబేలెత్తారు. సాధారణంగా ప్రతిపక్షాల కార్యకర్తలు పదిమంది నిరసనలకు దిగితే కరోనా నిబంధనల పేరుతో వేధించే పోలీసులు.. వందల సంఖ్యలో గుమిగూడిన మంత్రి అభిమానుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.

Updated Date - 2020-08-15T16:54:56+05:30 IST