చెల్లని కాగితం..!

ABN , First Publish Date - 2022-08-02T04:58:09+05:30 IST

పోలీసులకు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలంలో దక్కించుకున్న వారికి కొత్త కష్టం వచ్చిపడింది. పోలీసులు ఓ పత్రం అందజేసి, దాంతో రిజిస్ట్రేషన చేసుకోవచ్చని చెప్పి, పంపుతున్నారు.

చెల్లని కాగితం..!

హిందూపురం


పోలీసులకు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలంలో దక్కించుకున్న వారికి కొత్త కష్టం వచ్చిపడింది. పోలీసులు ఓ పత్రం అందజేసి, దాంతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పి, పంపుతున్నారు. వేలంలో దక్కించుకున్న వారు వాటిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్తే చుక్కెదురవుతోంది. పత్రంతో రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. తామే అమ్మినట్లు పోలీసులు గానీ, షోరూమ్‌లో కొనుగోలు చేసిన వ్యక్తిగానీ వచ్చి వేలిముద్ర వేస్తే తప్ప.. రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదని వారు తెగేసి చెబుతున్నారు. దీంతో వాహనాలను దక్కించుకున్న వారు అయోమయంలో పడుతున్నారు.


కాగితం ఇచ్చి.. పంపుతున్నారు..

సెబ్‌, పోలీసులకు పట్టుబడిన వాహనాల్లో కొన్నింటిని వాటి యజమానులు జరిమానాలు చెల్లించి, తీసుకెళ్లారు. మరికొంత మంది వాహనాలను వదిలేసి, వెళ్తున్నారు. వాటితోపాటు మరికొంత మంది పట్టుబడిన వాహనం తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. ఈ వాహనాలు ఆయా స్టేషన్ల ఆవరణాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. తుప్పుపట్టిపోతున్నాయి. వాటిని వేలం వేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు వాహనాలను తనిఖీ చేసి, వాటి మోడల్‌ని బట్టి ధరను నిర్ణయిస్తారు. ఆ ధర మేరకు సెబ్‌ అధికారులు.. పోలీసులతో కలిసి ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో పట్టుకున్న వాహనాలకు వేలంపాట నిర్వహిస్తున్నారు. వేలంలో దక్కించుకున్న వారికి పోలీసులు ఓ కాగితం అందజేసి, పంపుతున్నారు. దానిని రవాణాశాఖ కార్యాలయానికి తీసుకెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తారని చెబుతున్నారు. ఆ పేపరు తీసుకుని, వేలంలో దక్కించుకున్న వారు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్తున్నారు.


ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ...

పోలీసులు అందజేసిన కాగితంతో రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లిన వారికి నిరాశ ఎదురవుతోంది. ఆ కాగితంతో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయలేమని చెబుతున్నారు. ఆ వాహనాన్ని తాము విక్రయించినట్లు పోలీసు అధికారులు గానీ, షోరూంలో కొన్న వ్యక్తిగానీ వచ్చి వేలిముద్ర వేస్తే తప్ప.. రిజిస్ట్రేషన్ చేయడం అసాధ్యమంటున్నారు. ఇందుకు కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.


పెద్దఎత్తున పట్టుబడిన వాహనాలు

అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా మద్యం విధానం ఉండేది. పక్క రాష్ట్రాల ధరలకు సమానంగానే ఇక్కడ కూడా విక్రయించేవారు. వైసీపీ అధికారం చేపట్టాక మద్య నిషేధం అంటూ కొత్త విధానాన్ని అమలు చేశారు. మద్యం ధరలు విపరీతంగా పెంచేసి, ప్రభుత్వమే దుకాణాలు ఏర్పాటు చేసి, విక్రయించింది. పక్క రాషా్ట్రలతో పోల్చుకుంటే మద్యం ధరలు రెండు, మూడు రెట్లు పెంచేశారు. బ్రాండెడ్‌ కనిపించకుండా.. ఎప్పుడూ వినని పేర్లతో ప్రభుత్వం మద్యం సరఫరా చేసింది. మద్యం ధరలు చుక్కలను అంటుతుండడం, బ్రాండెడ్‌ లభించకపోవడంతో మందుబాబులు పక్క రాషా్ట్రల వైపు చూశారు. కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలోకి విపరీతంగా అక్కడి మద్యం అక్రమ మార్గంలో వచ్చిపడింది. ఇది పెద్ద వ్యాపారంగా మారింది. పెద్దలు కూడా ఇందులో భాగస్వాములై, రూ.కోట్లు గడించారు. అక్రమ మద్యం కట్టడికి ప్రభుత్వం సెబ్‌ను ఏర్పాటు చేసింది. సెబ్‌ అధికారులు, సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో పెద్దఎత్తున కర్ణాటక మద్యం వాహనాల్లో తీసుకొస్తూ పట్టుబడ్డారు. అలా వేల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయి. వాటిని అధికారులు సీజ్‌ చేసి, పోలీసు స్టేషన్లకు తరలించారు.


విక్రయించిన వారు వేలిముద్ర వేయాలి

వేలంలో వాహనాలను దక్కించుకున్న వారి పేరున రిజిస్ర్టేషన చేయాలంటే నిబంధనలున్నాయి. వాహనం ఎవరు పేరుమీద ఉంటే వారు గానీ, సంబంధిత పోలీసు అధికారులు గానీ వచ్చి వేలిముద్ర వేస్తే బదిలీ చేయొచ్చు. వేలం పాటలో పోలీసులు ఇచ్చిన పత్రంతో వాహనాన్ని బదిలీ చేయడం కుదరదు.

కరుణసాగర్‌రెడ్డి, ఆర్టీఓ, హిందూపురం


పత్రం మాత్రమే ఇస్తాం

మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాలను కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం వేస్తాం. అందులో దక్కించుకున్న వారికి పత్రాలను అందజేస్తున్నాం. వాటితో రిజిస్ర్టేషన చేయొచ్చు.

లక్ష్మీదుర్గయ్య, సెబ్‌ సీఐ, హిందూపురం

Updated Date - 2022-08-02T04:58:09+05:30 IST