Abn logo
Jan 24 2021 @ 00:37AM

గేటు ధ్వంసం చేసి.. పాత మార్కెట్‌ ఆక్రమించి

కోర్టు ఆదేశాలిచ్చిందన్న వ్యాపారులు 


చిత్తూరు, జనవరి 23: నగర పరిధిలోని మూతపడిన పాత కూరగాయల మార్కెట్‌ను వ్యాపారులు ఆక్రమించారు. హైకోర్టు ఆదేశాలతోనే వచ్చామని అధికారులకు తేల్చిచెప్పారు. వివరాలివీ.. లాక్‌డౌన్‌ దృష్ట్యా గత ఏడాది మార్చిలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని చర్చివీధిలో ఉన్న పాత కూరగాయల మార్కెట్‌ను నగరపాలక సంస్థ అధికారులు మూసివేశారు. అన్‌లాక్‌ సమయంలో స్థానిక మార్కెట్‌ యార్డుకు మార్చారు. అయితే వ్యాపారం లేదని వ్యాపారులు వివరించడంతో అధికారులు ప్రైవేట్‌ బస్టాండ్‌కు మార్చారు. అక్కడే షెడ్ల నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కరించారు. ఈ నేపథ్యంలో పాత కూరగాయల మార్కెట్‌ను పునఃప్రారంభించాలంటూ పలువురు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు అనుకూలంగా తీర్పువచ్చిందంటూ పలువురు వ్యాపారులు శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పాత కూరగాయల మార్కెట్‌ చేరుకున్నారు. ప్రధాన గేటును ధ్వంసం చేసి తాము వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణాల వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ అధికారులు, వన్‌టౌన్‌ సీఐ నిరంజన్‌ సిబ్బందితో కలసి అక్కడికి వచ్చారు. మార్కెట్‌ వ్యాపారుల సంఘ నాయకులకు సర్దిచెప్పేయత్నం చేశారు. కాగా, దుకాణాల నిర్వహణకు హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. అయితే దౌర్జన్యంగా మార్కెట్‌ను ఆక్రమించడం సబబుకాదని పోలీసులు చెప్పారు. అధికారులకు కోర్టు ఆదేశాలు అందేంత వరకు దుకాణాలు నిర్వహించరాదని సూచించినా వ్యాపారులు కదల్లేదు. దీంతో అర్ధరాత్రి దాటినా అధికారులు వ్యాపారుల సంఘ నేతలతో చర్చిస్తూనే ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement