కొండెక్కిన కూరగాయలు

ABN , First Publish Date - 2021-10-10T05:28:04+05:30 IST

కూరగాయల ధరలు కొండెక్కాయి. నెల రోజుల వ్యవధిలో ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. మరోవైపు ఉల్లి ధరలు కూడా ఘాటెక్కాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కార్తీకమాసంలో కూరగాయల ధరలు పెరుగుతాయి. కానీ, ఇటీవల గులాబ్‌ తుఫాన్‌తో పాటు అకాల వర్షాల కారణంగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.

కొండెక్కిన కూరగాయలు

- నెలరోజుల వ్యవధిలో ధరలు రెట్టింపు

- ఆందోళన చెందుతున్న సామాన్యులు 

(టెక్కలి)

కూరగాయల ధరలు కొండెక్కాయి. నెల రోజుల వ్యవధిలో ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. మరోవైపు ఉల్లి ధరలు కూడా ఘాటెక్కాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కార్తీకమాసంలో కూరగాయల ధరలు పెరుగుతాయి. కానీ, ఇటీవల గులాబ్‌ తుఫాన్‌తో పాటు అకాల వర్షాల కారణంగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గత నెలలో టమాటాలు కిలో రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60కి విక్రయిస్తున్నారు. ఉల్లిపాయలు కేజీ రూ.23 నుంచి రూ.50కి చేరాయి. పొటల్స్‌, బీన్స్‌, క్యాబేజీ పువ్వు గత నెలలో కిలో రూ.50 ఉండగా... ప్రస్తుతం రూ.90కి విక్రయిస్తున్నారు. క్యారెట్‌ రూ.40 నుంచి రూ.70కి చేరుకుంది. బీరకాయలు, బరబాటీ, గోరుచిక్కుడు, వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, క్యాబేజీ బుట్ట రూ.30 నుంచి రూ.60కి పెరిగింది. సారికంద రూ.20 నుంచి రూ.30కి, కాకరకాయలు రూ.30 నుంచి రూ.50కి చేరుకున్నాయి. జిల్లాకు విశాఖపట్నం, రాజమండ్రి, ఒడిశా ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతాయి. రోజుకు సుమారు 672 టన్నుల కూరగాయలు, 30 టన్నులకు పైగా ఉల్లిపాయల విక్రయాలు సాగుతాయి. అకాలవర్షాలతో పాటు పెట్రో ధరల పెంపు కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.  దరల కారణంగా ఒక్కో కుటుంబంపై ప్రతి నెలా సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది. కరోనా కష్టకాలంలో ఉపాధిలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో కూరగాయల ధరలు తమకు మరింత భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వీటి నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. 

 

కొనలేం...తినలేం: 

నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో ఏమీ కొనలేని.. తినలేని పరిస్థితి నెలకొంది. టమాటా, ఉల్లి ధరలు కూడా పెరగడంతో అదనపు భారం పడుతోంది. 

 -  జె.దుర్గమ్మ, గృహిణి, టెక్కలి


ఆర్థిక భారమే:

రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలతో మధ్య తరగతి కుటంబాలపై మరింత ఆర్థిక భారం పడింది. రోజువారీ వంటకాల్లో ఉల్లి, టమాట వినియోగాన్ని తగ్గించేస్తున్నాం. ధరల భారంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది.   

-  పి.ఉషారాణి, గృహిణి, టెక్కలి

Updated Date - 2021-10-10T05:28:04+05:30 IST