ఉక్రెయిన్ విద్యార్థుల కోసం నిబంధనలను సడలించాలి : వరుణ్ గాంధీ

ABN , First Publish Date - 2022-03-06T19:56:25+05:30 IST

యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి

ఉక్రెయిన్ విద్యార్థుల కోసం నిబంధనలను సడలించాలి : వరుణ్ గాంధీ

న్యూఢిల్లీ : యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న విద్యార్థుల కోసం నిబంధనలను సడలించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆదివారం ట్విటర్ వేదికగా  డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల వేలాది మంది విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రభావితమైందని చెప్పారు. ఓవైపు, యుద్ధ క్షేత్రంలో ఎదురైన చేదు అనుభవాల జ్ఞాపకాలు వారిని వెంటాడుతున్నాయని, మరోవైపు, వారి భవిష్యత్తు ఊగిసలాటలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు భారతీయ విద్యా సంస్థల్లో చదువు కొనసాగించడానికి వీలుగా నిబంధనలను సడలించాలన్నారు. వారు, వారి తల్లిదండ్రులు చాలా ఆవేదన, ఆందోళనతో ఉన్నారని, వారి ఆవేదనను మన ఆవేదనగా పరిగణించాలని చెప్పారు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విద్యార్థులను భారత దేశానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పోలండ్, రొమేనియా, హంగేరీ, స్లోవాక్ రిపబ్లిక్‌ల మీదుగా ఉక్రెయిన్ నుంచి వీరిని తరలిస్తోంది. 


వరుణ్ గాంధీ ఫిబ్రవరి 28న ఇచ్చిన ట్వీట్‌లో, ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఉక్రెయిన్‌లో వేలాది మంది చిక్కుకుపోయారని ఆరోపించారు. 


Updated Date - 2022-03-06T19:56:25+05:30 IST