వర్షంతో దెబ్బతిన్న పంటలు

ABN , First Publish Date - 2021-07-23T03:36:27+05:30 IST

మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల తాకిడికి సాగులో ఉన్న మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. బుధవారం మోస్తరుగా కురిసి

వర్షంతో దెబ్బతిన్న పంటలు
దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తున్న ఏఈవో శివజ్యోతి

వరికుంటపాడు, జూలై 22: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న  వర్షాల తాకిడికి సాగులో ఉన్న మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. బుధవారం మోస్తరుగా కురిసిన వర్షం రెండో రోజైన గురువారం కూడా అదే రీతిలో కురిసిన వర్షానికి తోడు గాలులు సైతం జోరుగా తోడయ్యాయి. దీంతో పలు గ్రామాల్లో చేతికందే దశలో ఉన్న వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిని మొలకెత్తే పరిస్ధితి నెలకొంది. గణేశ్వరాపురం, వరికుంటపాడు, నారసింహాపురం తదితర గ్రామాల్లో కోసిన పంటలతో పాటు రెండు, మూడు రోజుల్లో కోతకు సిద్ధంగా పంటలు సైతం దెబ్బతినడంతో రైతుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. ఇక సాగు కష్టాలు తీరినట్లేనని సంబరపడుతున్న రైతన్నలకు నిరాశే మిగిలింది. ఇలాంటి పరిస్ధితుల్లో వర్షం పుణ్యమాని పెట్టుబడుల కోసం చేసిన అప్పులకు మరీంత అప్పులు తోడై తలకు మించిన భారంగా మారుతున్నాయని వాపోయారు. నివాసాల వద్ద నిల్వ ఉంచుకొనే అవకాశం లేని రైతుల పరిస్ధితి మరింత ధారుణంగా మారింది. పరిస్ధితి ఇలాగే కొనసాగితే మరికొంతమంది రైతులు సైతం సాగులో ఉండే తమ పంటలను నష్టపోవాల్సి వస్తుందేమోనని బెంబేలెత్తిపోతున్నా రు. ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి పంట నష్టపోయిన రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 


 పరిశీలించిన అధికారులు


 విషయం తెలుసుకున్న ఏఈవో శివజ్యోతి గణేశ్వరాపురంలో దెబ్బతిన్న వేరుశనగ పంటలను పరిశీలించారు. పరిస్ధితిపై రైతులతో చర్చించి నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామినిచ్చారు. ఆమె వెంట సర్పంచ్‌ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి మాల్యాద్రి, వీఏఏ పవన్‌  ఉన్నారు.


Updated Date - 2021-07-23T03:36:27+05:30 IST