యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు!

ABN , First Publish Date - 2022-04-13T04:27:42+05:30 IST

ధనార్జనే ధ్యేయంగా పెచ్చుమీరుతున్న రియల్టర్లు నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు.

యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు!
విరువూరులో నూతనంగా వేస్తున్న లేఅవుట్లు

జోరుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

పట్టించుకోని అధికారులు

వరికుంటపాడు, ఏప్రిల్‌ 12: ధనార్జనే ధ్యేయంగా పెచ్చుమీరుతున్న రియల్టర్లు నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. వాటిని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో రియల్‌ దందా సాగిస్తూ ప్రజలను మోసం చేసి ప్లాట్లు అప్పగిస్తూ  జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కనీసం పంచాయతీ అనుమతులు కూడా పొందడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తేటతెల్లమవుతోంది. రాజకీయ నాయకుల ఒత్తిడిలకు తలొగ్గిన అధికారులు మనకెందుకులే అని అటువైపు కన్నెత్తి చూడకుండానే మామూళ్ల మత్తులో మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులకు వత్తాసుగా అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తుండడం గమనార్హం. ఇటీవల కాలంలో జాతీయ రహదారులు, పట్టణాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, కావలి తదితర పట్టణాలకు సమీపంలోని గ్రామాల్లో వీటి ప్రభావం మరింత అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యాపారులు రాత్రికి రాత్రే లేఅవుట్లు వేసి ఎంచక్కా ప్లాట్లను జోరుగానే విక్రయిస్తున్నారు. కేవలం వ్యాపారులు, మధ్యవర్తుల మాయమాటలు నమ్మిన ప్రజలు నిబంధనలు తెలియకుండానే లక్షలు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా మారుమూల మండలాలైన వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, కలిగిరి ప్రాంతాల్లో అధికశాతం అక్రమ లేఅవుట్లు రాజ్యమేలుతున్నాయి. ఇదంతా ఒకవంతైతే నెల్లూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దు మండలమైన వరికుంటపాడులో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతం కావడంతో అడిగేవారు లేరులే అన్న ధీమాతో వ్యాపారులతో పాటు అధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విరువూరు, వేంపాడు, రామాపురం, వరికుంటపాడు పంచాయతీల్లో రోజుకో చోట పోటీ తత్వంతో అక్రమ లేఅవుట్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాలకు చేరువ కావచ్చనే ఆశతో పాట్లు కొన్నప్పటికీ తమ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనేందుకు భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండడం అధికారుల పనితీరుకు నిదర్శంగా మారుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ లేవుట్లకు అడ్డుకట్ట వేసి వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

నిబంధనలు ఇవే...

ముందస్తుగా ఆర్డీవో వద్ద కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకొని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు అనుమతులు తీసుకోవాలి.

భూమిలో వేసే లేఅవుట్‌ ప్లాన్‌తో సహా కన్వర్షన్‌ కాపీని పంచాయతీల ద్వారా టౌన్‌ ప్లానింగ్‌కు పంపి అప్రూవల్‌ తీసుకోవాలి.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పది శాతం భూమిని రహదారులు, డ్రైనేజీల కోసం పంచాయతీలకు రిజిస్ర్టేషన్‌ చేసి అప్రూవల్‌ తర్వాత ఫీజు చెల్లించాలి.

ఆపై పంచాయతీ ఆమోదం పొందిన తరువాతే ప్లాట్లు వేసి క్రయవిక్రయాలు సాగించాలి.

కానీ ఆవేమీ ఇక్కడ అచరణకు నోచుకోవడం లేదు.

Updated Date - 2022-04-13T04:27:42+05:30 IST