రెండో పంటపై ధ్యాసేది ?

ABN , First Publish Date - 2021-03-08T05:36:17+05:30 IST

రబీ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

రెండో పంటపై ధ్యాసేది ?
బుచ్చిలో వరి కోత కోస్తున్న యంత్రం

తెలిసీతెలియనట్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు

పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారంభం

నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం

ఇంత వరకూ ఐఏబీ మాటే లేదు..

ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు

గతేడాది ఆలస్యంతో రైతులపై తీవ్ర ప్రభావం


నెల్లూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : రబీ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గూడూరు, నాయుడుపేట డివిజన్లలో కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం డెల్టాలో కోతలు జోరందుకున్నాయి. ఈ నెలాఖరుకు దాదాపు 80 శాతానికిపైగా వరి కోతలు పూర్తికానున్నాయి. అయినా ఇంత వరకూ రెండో పంటపై ఆలోచనే జరగలేదు. కోతలు పూర్తవుతున్న రైతులు అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది మాదిరిగా ఎక్కడ ఆలస్యంగా నిర్ణయం తీసుకొని మళ్లీ ముంచుతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.


పుష్కలంగా నీరు

 పెన్నా ఎగువ ప్రాంతాల్లో పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో గడిచిన రెండు సీజన్ల నుంచి అధిక విస్తీర్ణంలో పంటకు సాగు నీరందిస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో కూడా అధికారిక, అనధికారికంగా కలుపుకుంటే సుమారు ఎనిమిది లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఇంకా కూడా సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుంది. రెండో పంటకు కూడా పూర్తిస్థాయిలో నీరిచ్చే అవకాశం ఉంది. 


అన్నీ తెలిసి కూడా..

ఓ వైపు వరి కోతలు పూర్తవుతున్నాయని, రెండో పంటకు సన్నద్ధమవుతున్నారని అధికారులకు తెలుసు. అదే సమయంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులకు కూడా ఈ విషయం అర్థమవుతోంది. కానీ ఎవరూ కూడా తమకు తెలి యదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ సాగునీటి కేటాయింపులపై సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒకరికొకరికి సమన్వయం లేకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం సోమశిలలో 66 టీఎంసీలు, కండలేరులో 53 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. సోమశిల నుంచి రోజుకు మూడు వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలానే కండలేరు నుంచి 1500 క్యూసెక్కుల వరకు నీరు విడుదలవుతోంది. రబీ సీజన్‌ పూర్తయ్యే సరికి సోమశిలలో 60 టీఎంసీల వరకు నీరు మిగిలే అవకాశముంది. ఈ లెక్కన సోమశిల కింద డెల్టాకు పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు చేయడంతో పాటు కనుపూరు కాలువ, కావలి కాలువ, ఉత్తర, దక్షిణ కాలువల కింద చాలా వరకు రెండో పంటకు సాగు నీరందించే వీలుంది. కండలేరు కింద కూడా ఆయకట్టుకు రెండో పంటకు నీరిచ్చే అవకాశముంది. నీటి సమస్య లేకున్నప్పటికీ సాగునీటి సలహా  మండలి (ఐఏబీ)పై ఆలోచ న చేయడం లేదు. ఏ కాలువ కింద ఎంత ఆయకట్టు వరకు నీరందిస్తారో రైతులకు తెలియజేస్తే వారు సాగు పనులు మొదలు పెట్టుకుంటారు


గతేడాది మునిగిన రైతులు

సాధారణంగా ఏప్రిల్‌ మొదటి వారానికల్లా జిల్లాలో కోతలు పూర్తవుతాయి. ఆ వెంటనే రైతులు రెండో పంటకు సన్నాహాలు మొదలు పెడతారు. దీంతో ఆగస్టు నాటికి రెండో పంట కోతలు కూడా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి. సెప్టెంబరులో వర్షాలు కురిసే అవకాశాలుండడంతో ఆ మేరకు రైతులు సాగు ప్రణాళికలు రచించుకుంటారు. కానీ గతేడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. రెండో పంటకు నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ కేటాయింపుల విషయంలో ఆలస్యం జరిగింది. ఓ వైపు కరోనా, మరోవైపు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఐఏబీ దాదాపు నెల ఆలస్యమైంది. సోమశిల కింద 27.5 టీఎంసీలను 2.47 లక్షల ఎకరాలకు కేటాయించారు. అందులో డెల్టాలో 1.80 లక్షల ఎకరాలు, కావలి కాలువ కింద 40 వేలు, ఉత్తర కాలువ కింద 17,500 ఎకరాలు, దక్షిణ కాలువ కింద 10 వేల ఎకరాలకు నీరందించారు. ఏప్రిల్‌ 20 నుంచి నీటి విడుదల చేశారు. దీంతో పంట సెప్టెంబరులో చేతికందింది. ఆ సమయంలో వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎప్పుడూ ఎదురవని కష్టాలు గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎదురయ్యాయి. ధాన్యాన్ని అమ్ముకోవడం కూడా కష్టంగా మారింది. మరోసారి అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదంటే ముందుగానే ఐఏబీ నిర్వహించి నీటి కేటాయింపులు జరపాల్సి ఉంది. 

 

Updated Date - 2021-03-08T05:36:17+05:30 IST