జలయంత్రాలు

ABN , First Publish Date - 2022-06-04T06:34:03+05:30 IST

వారణాసి జ్ఞానవాపి మసీదులో కనిపించిందని చెబుతున్నది శివలింగమో, నీటిని విరజిమ్మే జలయంత్రమో తేలవలసి ఉన్నది.

జలయంత్రాలు

వారణాసి జ్ఞానవాపి మసీదులో కనిపించిందని చెబుతున్నది శివలింగమో, నీటిని విరజిమ్మే జలయంత్రమో తేలవలసి ఉన్నది. దానిని న్యాయస్థానానికి, నిపుణులకు వదిలివేయవచ్చు. కానీ, ఈ వివాదం సందర్భంగా జరిగిన, జరుగుతున్న వాదనలు ఆసక్తికరమైనవి. ఒకటి, అందులో నీటిని చిమ్మడానికి ఏర్పాటు ఉన్నది, అది సిమెంటు లేదా సున్నపురాయి నిర్మాణమే తప్ప శివలింగంగా భావించే శిల్పం కాదు అన్నది ఒక పక్షం వాదన. మరో పక్షం వాదన, ఔరంగజేబు కాలం నాటికి విద్యుచ్ఛక్తి ఉన్నదా, కరెంటు లేకుండా ఫౌంటేన్ ఎట్లా పనిచేస్తుంది? అన్నది మరో పక్షం వాదన. లోపల కనుగొన్న రూపం ఏమిటి, దాని సారం ఏమిటి అన్నది ప్రత్యక్ష పరిశీలన ద్వారానో, పరిశీలకుల వీడియో బహిర్గతం కావడంతోనో తెలియాలి. ఆ ప్రక్రియలతో సంబంధం లేకుండా చర్చించగలిగిన విషయాలు, అసలు ఫౌంటేన్లు ఎప్పటి నుంచి ఉన్నాయి, విద్యుచ్ఛక్తి లేకపోతే అవి పనిచేయవా?

చాలా జానపద, పౌరాణిక సినిమాలలో కూడా తోటలలో నాయికానాయకులు పాటలు పాడుకునేటప్పుడు, ఫౌంటేన్లను చూపిస్తారు. అది సినిమాకళలో తీసుకున్న స్వేచ్ఛ అని ఇంతకాలం అనుకుని ఉంటాము. కానీ, తాజ్‌మహల్ ఎదురుగా ఉన్న పొడవాటి సన్నటి కొలనులో ఫౌంటేన్లు చూడవచ్చు. ఈ మధ్య వాటిని విద్యుదీకరించారు కానీ, అప్పటిదాకా అవి భూమ్యాకర్షణ శక్తి లేదా నీరు పల్లానికి పారుతుంది అన్న సూత్రాల ద్వారా నడచినవే. ప్రపంచంలోని అన్ని నాగరికతలలోనూ వేలాది సంవత్సరాలుగా జలయంత్రాలు ఉన్నాయి.


కేవలం కనువిందు చేసేవిధంగా నీరు ఎగజిమ్మే ఏర్పాట్లు మాత్రమే కాదు, మంచినీరు తాగడానికి, స్నానం చేసే విధంగా జలధారలు పడడానికి, ఎత్తైన ప్రాంతాలకు నీరు సరఫరా చేయడానికి జలయంత్రాలు వాడేవారు. ప్రాకృతికంగా నీటి నుంచి ఎగజిమ్మే ఊటలను చూసినప్పుడు మనిషికి తాను అటువంటి ఏర్పాటును యాంత్రికంగా, కృత్రిమంగా చేయాలని ఎందుకు అనిపించదు. ఫౌంటేన్ అన్న ఇంగ్లీషు మాటకు అర్థం కూడా ఊటబుగ్గ. తెలుగులో నీటిబుగ్గ. కృత్రిమంగా రూపొందించిన ఊటబుగ్గను కూడా నీటిబుగ్గగా కవులు ప్రస్తావించారు. ఆకాశం నీటి బుగ్గతో సమానంగా ముసురుపట్టింది అని కృష్ణదేవరాయలు వర్ణించాడు. ఇక్కడ నీటిబుగ్గ, నీరు వేగంగా ఎగజిమ్మే యంత్రమే అయి ఉండాలి. తెలుగులో చిమ్మనగ్రోవి అన్న మాట ఉన్నది. అంటే, మనం రంగుల పండుగ సందర్భంగానూ, నీటి ఆటల్లోనూ పరస్పరం నీరు చల్లుకోవడానికి ఉపయోగించే ఒత్తిడి గొట్టం. పిల్లనగ్రోవి మాదిరిగానే చిమ్మన గ్రోవి. పీడనం కల్పించడం ద్వారా, నీటిని ఎత్తుపల్లాలతో నిమిత్తం లేకుండా కొంతదూరం చిమ్మవచ్చు. ఫౌంటేన్ వెనుక కూడా పనిచేసేది అదే సాంకేతికత. భూమ్యాకర్షణ ద్వారా నీటి ఒత్తిడిని పెంచి, సన్నటి రంధ్రాల ద్వారా నీటిని పంపినప్పుడు అది తగినంత వేగంతో పైకి విరజిమ్ముతుంది. 


తొలినాటి విదేశీ సందర్శకుడయిన మెగస్తనీసు, తాను పాటలీపుత్రంలో ఫౌంటేన్లను చూసినట్టు రాశాడు. ప్రాచీన గ్రీక్ రాజ్యంలోను, రోమన్ సామ్రాజ్య నగరాలలోను జలయంత్రాలు పరిపాటి. నీటిని ఎగజిమ్మే యంత్రాన్ని జలయంత్రంగా హర్ష నైషధం పేర్కొన్నది. పైకప్పు నుంచి నీటి తుంపరలను వెదజల్లే యంత్రమున్న గదిని ‘ధారాగృహ’ అని చరక సంహిత పేర్కొన్నది. నీటిని చిమ్మే జలయంత్రాన్ని, గాలివిసిరే వాతయంత్రాన్ని ఉపయోగిస్తే ఆరోగ్యమని చెప్పింది. చల్లదనం ఇచ్చే శయ్యలను, ఆసనాలను ఉపయోగిస్తే మంచిదని సుశ్రుత సంహిత చెబుతుంది. నీటి తుంపరలున్న తామరాకుల శయ్య గురించి సుశ్రుతుడు రాశాడు. మనుషులు ఒక తాడును లాగుతూ ఉండడం ద్వారా, గదిలో పెద్ద విసనకర్ర పనిచేసినట్టే, మనుషులు తోడిపోయడం ద్వారా, చిన్న చిన్న యంత్రాల ద్వారా నీటిని తరలించడం ద్వారా ఉద్యానవనాలలో ఇళ్లలో నీరు అందుబాటులో ఉండేది. ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ కనీసం రెండువేల సంవత్సరాలుగా జలయంత్రాలు అందుబాటులో ఉన్నాయి. నిజానికి, విద్యుచ్ఛక్తి వినియోగంలోకి వచ్చిన తరువాతనే వీటి వాడకం తగ్గిపోయింది.


ఈ మధ్యనే హైదరాబాద్‌లో గోల్కొండ కోటలో జలయంత్రాల కోసం ఉపయోగించే సున్నపు రాయితో చేసిన పెద్ద పెద్ద గొట్టాలు తవ్వకాలలో లభించాయి. ఆ జలవ్యవస్థను చూసి ఆశ్చర్యపోక తప్పదు. ఎత్తున ఉన్న గోలకొండ కోటకు దిగువన ఉన్న దుర్గం చెరువు నుంచి నీటి సరఫరా జరిగేది. హంపీ విజయనగరంలో ఆనాటి రాజులు ఎత్తుగా నిర్మించిన కాలువల ద్వారా నీటిసరఫరా కోసం ఏర్పరచిన వ్యవస్థను చూసి ఆశ్చర్యపోతాము. ఇక సుల్తానులు నివసించిన రాజభవనాలలో, వారు నిర్మించిన ఉద్యానవనాలలో జలయంత్రాలు తప్పనిసరి. 


శతాబ్దంన్నరకు ముందు నిఘంటువు రాసిన సి.పి. బ్రౌన్ ఫౌంటేన్ అన్న ఇంగ్లీషు మాటకు జలయంత్రము, బుగ్గ, దొన, నదీమూలము వంటి అర్థాలు ఇచ్చాడు. ఊటబుగ్గను కుదురుమూలంగా పరిగణించడం ఇంగ్లీషువారిలోనూ ఉన్నది. రుషీమూలం, నదీమూలం తెలుసుకోకూడదనే నానుడిలో అదే అర్థం ధ్వనిస్తుంది. సమశీతోష్ణమో, ఉష్ణమో భారతదేశంలో పాక్షికంగా అయినా ఎండలు మండుతూనే ఉంటాయి. ఇంతటి వేడిదేశంలో నీటికణికలతో సాయంత్రాలను చల్లార్చుకునే జలయంత్రాలు ఉండడంలో ఆశ్చర్యమూ లేదు విశేషమూ లేదు.

Updated Date - 2022-06-04T06:34:03+05:30 IST