వరద నష్టంపై సీఎంకు వివరిస్తాం..

ABN , First Publish Date - 2020-11-30T05:34:58+05:30 IST

నివర్‌ తుఫాన్‌తో జిల్లాలో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వివరి స్తామని రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిలు తెలిపారు.

వరద నష్టంపై సీఎంకు వివరిస్తాం..
నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలో నిరాశ్రయులతో మాట్లాడుతున్న మంత్రులు అనిల్‌, గౌతమ్‌రెడ్డి

మంత్రులు అనిల్‌, గౌతమ్‌

దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, వంతెనలకు ప్రతిపాదనలు తయారు చేయాలి

అధికారులకు అమాత్యుల ఆదేశం

నెల్లూరులోని వరద బాధిత ప్రాంతాల్లో  పర్యటన


నెల్లూరు(జడ్పీ), నవంబరు 29 : నివర్‌ తుఫాన్‌తో జిల్లాలో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వివరి స్తామని రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిలు తెలిపారు. నెల్లూరులోని మేకపాటి కార్యాలయంలో  ఆదివారం సోమశిల జలాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంత రం  వారు నగరంలోని రంగనాయకులపేట పెన్నా బ్యారేజీ, భగత్‌సింగ్‌ కాలనీ, జనార్దన్‌రెడ్డి కాలనీ, అహ్మద్‌నగర్‌లలో పర్యటించారు. భారీ వర్షాలకు జలమయమైన ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ పెన్నాకు ఈ స్థాయిలో వరద రావడం చరిత్రలో రెండోదఫా మాత్రమే అన్నారు. భారీగా వరద రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టామని చెప్పారు.  వరద బీభత్సాలకు జిల్లాలో జరిగిన నష్టాన్ని పూర్తి గా ముఖ్యమంత్రికి వివరించి అందరికీ సహాయం అందేలా చూస్తామన్నారు. దెబ్బతిన్న వంతెనలు, రోడ్లు, చెరువు కట్టలను వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. వారధి నుంచి బ్రిడ్జీ వరకు రెండువైపులా కట్టలు నిర్మించి వరద ముంపునకు శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ వల్ల జిల్లా లో  దెబ్బతిన్న పైర్లు, రోడ్లు, ఇళ్లు, ఇతర నష్టాలపై అధికారుల తో ఇప్పటికే సమావేశం నిర్వహించామన్నారు.  నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించామన్నారు.  నివేదికలు అందగానే ముఖ్యమంత్రికి అందచేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందిస్తామన్నారు. 

Updated Date - 2020-11-30T05:34:58+05:30 IST