ప్రకృతి వనాలతో పల్లెలకు శోభ

ABN , First Publish Date - 2020-11-29T05:09:45+05:30 IST

ప్రకృతి వనాలతో పల్లెలకు శోభ

ప్రకృతి వనాలతో పల్లెలకు శోభ
కర్నంగూడలో అభివృద్ధి చేసిన పల్లె ప్రకృతి వనం

  • పచ్చదనం పర్చుకుంటున్న వైకుంఠధామాలు
  • పండ్లు, పూలు, ఔషధ మొక్కల పెంపకం

ఇబ్రహీంపట్నం: పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు శోభనిస్తున్నాయి. గతంలో పల్లెల్లో ఎవరైనా మృతిచెందితే ఆరుబయటే దహన సంస్కారాలు నిర్వహించేవారు. అంత్యక్రియలకు వచ్చిన కుటుంబ సభ్యులు స్నానాలు చేయడానికి కనీసం దాపు కూడా ఉండేది కాదు. బంధుమిత్రులు నిల్చోవడానికి కూడా పరిసరాలు అనుకూలంగా ఉండేవి కావు. పరిస్థితుల్లో మార్పు వస్తోంది. వైకుంఠధామాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్నానాల గదులు, స్టోర్‌ రూం, దింపుడు గల్లం, దహన వాటికలు రూపుదిద్దుకుంటున్నాయి. అంతేగాక వీటికి నీటి వసతి కల్పిస్తున్నారు. పరిసరాల్లో పచ్చదనం పెంచుతున్నారు. పలు చోట్ల వైకుంఠధామాలకు పక్కన పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి చేస్తున్నారు. పూలసోయగాలు కొత్త అందాలను పరుస్తున్నాయి. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక పార్కును అభివృద్ధిలోకి తేవాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాగా, దీనికి అనుగుణంగా ప్రభుత్వ స్థలాల్లో వనాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుంటే దాతల సహాయంతో వనాలను తీర్చిదిద్దుతున్నారు.చెర్లపటేల్‌గూడ, కర్నంగూడలలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు పక్క పక్క నే ఏర్పాటు చేయడంతో నిర్వహణకు కూడా అనువుగా ఉం ది.  ఇబ్రహీంపట్నం మండలం లో 14 పంచాయతీలు ఉండగా రూ.1.30 కోట్ల వ్యయంతో వైకుంఠధామాలు నిర్మాణం చేస్తున్నారు. వీటిలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఐదు చోట్ల, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా 9 చోట్ల నిర్మాణం చేస్తున్నారు. నాగన్‌పల్లి, కర్నంగూడ, చెర్లపటేల్‌గూడలలో నిర్మాణం పూర్తవగా, పలు చోట్ల పనులు ప్రగతిలో ఉన్నాయి. 


వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు


ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, ఏడు అనుబంధ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వీటిలో పూలు, పండ్లు, ఔషధ మొక్కలు నాటుతున్నారు. వీటిలో వాకింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


దాతల సహకారం..


కర్నంగూడ కొత్తగా ఏర్పడ్డ పంచాయతీ. కాగా ఇక్కడ పల్లె ప్రకృతి వనానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదు. దీంతో పంచాయతీ సర్పంచ్‌ వంగేటి కవిత చొరవ తీసుకున్నారు ఐదుగురు రైతులను ఒప్పించి ఐదు గుంటల చొప్పున మొత్తం 25 గుంటల భూమిని విరాళంగా తీసుకుని వనాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ రూ.2లక్షల సొంత డబ్బులతో ప్రకృతి వనం చుట్టూ ఫెన్సింగ్‌, గేటు ఏర్పాటు చేయించారు. పక్కనే ఉన్న వైకుంఠధామానికి రూ.40 వేలు ఖర్చుచేసి ఓ ట్రాన్‌ఫార్మర్‌, వీధి దీపాలు కూడా ఏర్పాటు చేశారు.  

Updated Date - 2020-11-29T05:09:45+05:30 IST