తాడేపల్లి వేదికగా తాడోపేడో..!

ABN , First Publish Date - 2022-05-20T06:17:17+05:30 IST

తాడేపల్లి వేదికగా తాడోపేడో..!

తాడేపల్లి వేదికగా తాడోపేడో..!

వంశీతో కలిసేదే లేదు : దుట్టా వర్గం

దుట్టా వర్గంపై ఎమ్మెల్యే వంశీ ఫిర్యాదు

చర్చల అనంతరం మరోసారి భేటీకి నిర్ణయం

గన్నవరం వైసీపీలో కాకరేపుతున్న రాజకీయం


(విజయవాడ- ఆంధ్రజ్యోతి) : గన్నవరం వైసీపీ రాజకీయం మరింత వేడెక్కింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు గురువారం ఒక్కసారి భగ్గుమంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా వంశీ, దుట్టా వర్గాలు తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యాయి. ఈ పోరును చక్కదిద్దేందుకు గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం పేషీ కార్యదర్శి ధనుంజయరెడ్డి రెండు వర్గాలతో భేటీ అయ్యారు. రెండు గంటల పాటు సాగిన భేటీలో ఇరువర్గాల వారు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించడంతో ఎటూ తేల్చలేక సీఎం పేషీ పెద్దలు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. 

పరస్పర ఫిర్యాదులు 

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి గన్నవరం ఎమ్మెల్యే వంశీ, నియోజకవర్గ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు, వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి హాజరయ్యారు. అయితే, ముఖాముఖి భేటీకి రెండు వర్గాలు సుముఖత చూపకపోవడంతో సజ్జల, ధనుంజయరెడ్డి ఇరువర్గాలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పంచాయతీ అనంతరం దుట్టా రామచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. గన్నవరం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను సజ్జలకు వివరించామన్నారు. వైసీపీ పాత కేడర్‌ను వంశీ కలుపుకొని పోవడం లేదని, వారిని తొక్కేస్తున్నారని సజ్జలకు తెలిపామని చెప్పారు. వంశీ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, కలిసి పనిచేయలేమని స్పష్టం చేశామన్నారు. తాము ఎప్పుడూ పదవులు ఆశించలేదని దుట్టా పేర్కొన్నారు. వంశీ వచ్చినప్పటి నుంచి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఇన్‌చార్జిగా వంశీని మార్చాలని సజ్జలను కోరామన్నారు. వంశీతో మాట్లాడి మరోసారి పిలుస్తామని అన్నారని, ఏం జరుగుతుందో, అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని తెలిపారు. సీఎం పేషీ నుంచి వచ్చాక వంశీ విలేకరులతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

ఏ మొహం పెట్టుకుని తిరుగుతావ్‌? : శివభరత్‌రెడ్డి

‘సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఏ మొహం పెట్టుకుని వైసీపీ జెండాను భుజాన వేసుకుని తిరుగుతున్నావు? రెండుసార్లు టికెట్‌ ఇచ్చి, 20 ఏళ్లు పార్టీలో నీడనిచ్చి, అన్నం పెట్టిన ఎన్టీఆర్‌ కూతురు, చంద్రబాబు భార్యను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడానని చెప్పుకొంటూ తిరుగుతావా? ప్రస్తుతం నీకు నీడనిస్తున్న వైసీపీ అధినేత తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని చెత్తకుప్పలో వేసిన ఘనత నాదేనని చెప్పుకుని తిరుగుతావా..!’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ జరగడానికి ముందు ఆయన గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. అక్రమ ఆస్తులు రక్షించుకోవడానికే వంశీ వైసీపీ పంచన చేరారన్నారు. వైసీపీ కార్యకర్తలు ఛీ కొడుతున్నారని, ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరగని పని అని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-20T06:17:17+05:30 IST