వామ్మో.. నల్లి పురుగు

ABN , First Publish Date - 2022-06-29T06:39:15+05:30 IST

మిరప రైతులను నల్లి పురుగు భయం వెంటాడుతోంది. జూలై మొదటి వారంలో మిరప సాగు మొదలవుతుంది.

వామ్మో.. నల్లి పురుగు
నల్లి దెబ్బకు ఎండిపోయిన మిరప పంట (ఫైల్‌)

వణికిస్తున్న మందు లేని తెగులు

మిరప సాగుకు జంకుతున్న రైతు

గతేడాది రూ.90 కోట్ల నష్టం

ఆయకట్టు కింద 20 వేల ఎకరాల్లో సాగు

ఈ ఏడాది సగం కూడా కష్టమే

విడపనకల్లు: మిరప రైతులను నల్లి పురుగు భయం వెంటాడుతోంది. జూలై మొదటి వారంలో మిరప సాగు మొదలవుతుంది. గత ఏడాది నల్లిపురుగు దెబ్బకు పంట సర్వనాశనమైంది. ఈ ఏడాది మిరప సాగు చేయవద్దని కర్ణాటక అధికారులు అక్కడి రైతులకు సూచించారు. నల్లి పురుగుకు మందు లేదని, ఈ ఏడాది దాని బెడద ఎక్కువగా ఉంటుందని  హెచ్చరించారు. దీంతో అనంతపు రం జిల్లా రైతాంగంలో ఆందోళన మొదలైంది. నల్లిపురుగు దెబ్బకు జడిసి ఇప్పటికే కొందరు మిరప సాగును మానుకున్నారు. గత ఏడాది 20 వేల ఎకరాల్లో మిరప సాగు అయింది. ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో కూడా సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది అధిక వర్షాల కారణంగా మిరప పంటను నల్లి ఆశించింది. దీంతో విడపనకల్లు రైతాంగం రూ.90 కోట్లకు పైగా పెట్టుబడులు నష్టపోయింది. మొదట విల్ట్‌ తెగులు సోకింది. దాని బారినుంచి కాపాడుకున్నారు. కానీ వర్షాలు దెబ్బకొట్టాయి. తెగులు సోకి కాయ లు తెల్లగా మారి కుళ్లి పోయాయి. ఎకరానికి ఒక క్వింటం కూడా దిగుబడి రాలేదు. విడపనకల్లు మండల రైతులు మిర్చి పంటలను సాగు చేసేందుకు ఉరవకొండ, వజ్రకరూరు, గుంతకల్లు, బొమ్మనహాళ్‌, చిప్పగిరి మండలాలతోపాటు బళ్లారి జిల్లాకు కూడా వెళ్లి అక్కడి పొలాలను కౌలుకు తీసుకుంటారు. ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు కౌలు చెల్లిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మిరప అంటేనే రైతులు వణికిపోతున్నారు. 



ఈ ఏడాది సెలవు..

కాయలు బాగా ఎర్రబారుతున్న సమయంలో నల్లి పురుగు సోకుతుంది. అధిక వర్షాలు కురిస్తే నల్లి పురుగు సోకి.. కాయలు, పూత కుళ్లిపోతాయి. దిగుబడి అమాంతం పడిపోతుంది. ఎకరాకు ఒక్క క్వింటం కూడా రాదు. విడపనకల్లు రైతులు పొలాల్లోనే తిష్ట వేసి పంటను కాపాడుకునేవారు. గత ఏడాది నష్టాల కారణంగా ఈ సారి 50 శాతం కూడా మిరప సాగు చేయడం లేదు. ఫర్టిలైజర్‌ దుకాణదారులు ఈ ఏడాది రైతులకు అప్పు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిరప రైతు ఈ ఏడాది హాలిడే అంటున్నారు. 


వేలాది  ఎకరాల్లో...

.జీబీసీ కింద 15,800 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాది ఇందులో 8 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. హెచఎల్‌సీ కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 3 వేల ఎకరాలలో మిరప సాగు చేశారు. బోరు బావుల కింద మరో 5 వేల ఎకరాలలో మిరప సాగు చేశారు. నారు మొదలు కాయలు ఇంటికి వచ్చేవరకూ కౌలు రైతుకు ఎకరాకు రూ.లక్షకు పైగా ఖర్చు అవుతుంది. సొంత పొలం ఉన్న రైతుకు రూ.50 వేల వరకూ ఖర్చు వస్తుంది. మిరపపై ఆసక్తి ఉన్న రైతులు 5 ఎకరాల నుంచి 40 ఎకరాల వరకూ సాగు చేసేవారు. విడపనకల్లు మండల ఆయకట్టు రైతులు జీబీసీ కింద ఎర్ర బంగారం(ఎండు మిర్చి), వాణిజ్య పంటగాను వివిధ రకాల మిరపను సాగు చేసేవారు. రూ.కోట్లలో పెట్టుబడి పెట్టి, కూలీలకు పనులు కల్పించేవారు. మిరప రకాన్ని బట్టి దిగుబడులు వస్తాయి. సింజెంటా బ్యాడిగి 2043 రకం ఎకరాకు 24 నుంచి 26 క్వింటాళ్లు, గుంటూరు నాటీ వెరైటీ ఎల్‌సీ రకం 28 నుంచి 31 క్వింటాళ్లు, బీఎ్‌సఎఫ్‌ ఆర్మూరు రకం 30 నుంచి 40 క్వింటాళ్లు, డబ్బి రకం ఎకరాకు 25 నుంచి 30 క్వాంటాళ్లు, గుంటూరు కారం కడ్డీ కాయలు ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఈ పంట సాగుతో రైతులకు లాభాలు వచ్చేవి. కొన్నేళ్లుగా లాభాలు చూసిన రైతులు, గత ఏడాది ఒక్కసారిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. 



సాగు చేయకండి 

బళ్లారి కలెక్టర్‌

కర్ణాటక ప్రాంతంలో హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు మిరప పంటలను సాగు చేయవద్దని బళ్లారి జిల్లా కలెక్టర్‌ మాలపాటి పవనకుమార్‌ ఆదేశాలు ఇచ్చారు. నల్లి పురుగు అధికంగా ఉన్నందున, ఈసారి కూడా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.  ఎవరూ మిరప జోలికి వెళ్లవద్దని కోరారు. నల్లి పురుగు నివారణకు మందులు లేవని స్పష్టం చేశారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ హెచ్చరించారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.


10 బస్తాలు కూడా రావడం లేదు

గత ఏడాది విడపనకల్లు గ్రామంలోనే 5మిషన్లతో రోజు ఒక్కొక్క మిషన ద్వారా వంద బస్తాలు మిరపకాయలను ఆడించేవాళ్లం. రోజు కనీసం 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లు మిరప విత్తనాలు తీసేవాళ్లం. కానీ ఈ ఏడాది ఒక్కొక్క మిషనకు 10 బస్తాలు కూడా మిషనకు ఆడించడం లేదు. నల్లి పురుగు దెబ్బకు రైతులు ముందుకు రావటంలేదు. ఈసారి 50 శాతం కూడా మిరప సాగయ్యేలా లేదు. 

- రామాంజనేయులు, మిరప విత్తనంమిషన యజమాని



నల్లిపురుగుకు మందు లేదు 

నల్లి పురుగు నివారణకు పరిశోధనలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో మందు కూడా లేదు. ఈ నల్లి పురుగు ఒక్కటి రోజుకు 100 గుడ్లు పెడుతుంది. ఇలా 10 రోజులు గుడ్లు పెట్టి వెయ్యి దోమలను ఉత్పత్తి చేస్తుంది. మిరప చెట్టుకు వేర్లు ఆకులు, పూత పైనా ప్రభావం చూపటంతో పంటలు కుళ్లి పోవటం, ఎండిపోవటం జరుగుతుంది. కొద్దిగా పంటను కాపాడుకోవాలంటే జీవ సిలీంద్రాల ఎరువులు వేప మందులు వాడి కొద్దిగా నియంత్రించవచ్చు. రైతులు తగిన జాగ్రత్తలు పాటించి  పంటలను కొంత వరకు కాపాడుకోవచ్చు.

- నెట్టికల్లు, ఏఓ, హార్టికల్చర్‌ 


మిరప సాగు అంటేనే భయమేస్తోంది..

గత ఏడాది ఆరు ఎకరాల్లో సింజెంటా బ్యాడిగి 2043 వెరైటీ రకం మిర్చి పంటను సాగు చేశాను. వర్షాలు అధికంగా రావటంతో తేమశాతం అధికమై కాయలు మొత్తం తెల్లగా మారిపోయాయి. దీంతో నాలుగు ఎకరాల్లో పంటను నష్టపోయా. మరో రెండు ఎకరాల్లో పంటకు నల్లిపురుగు రావటంతో దిగుబడి రాలేదు. రూ.5లక్షలు వరకూ అప్పులు చేశాను. ఈ సారి మిరప జోలికి వెళ్లాలంటేనే భయమేస్తోంది. 

- ఈశ్వరప్ప, గడేకల్లు


రూ.10 లక్షలకు పైగా అప్పు..

గత ఏడాది 16 ఎకరాల్లో డబ్బి రకం మిర్చి పంటలను సాగు చేశాను అధిక వర్షాలకు నల్లి పురుగు దెబ్బకు తెగులు రావటంతో మొక్కల్లోని కాయలకు మచ్చలు రావటం తెల్లగా మారాయి. తేమ ఎక్కువ కావటంతో  తెగుళ్లు సోకి ఎర్రగా ఉన్న కాయలు కూడా రంగు మారి మొక్కలతో పాటుగా ఎండిపోయాయి. రూ.10లక్షలకు పైగా అప్పులు చేశాను. మిరప పంట సాగు చేయాలనుకుంటున్నారు. నల్లిపురుగు సోకితే పంటను తొలగించేస్తా.

- ప్రసాద్‌, విడపనకల్లు


రూ.20 లక్షలకు పైగా నష్టపోయా..

గత ఏడాది 16 ఎకరాల్లో డబ్బి, కడ్డి రకం మిర్చిని సాగు చేశా. పంట మార్పిడిలో భాగంగా 10 ఎకరాల్లో బీఎస్‌ఎఫ్‌ రకం మిర్చి పంటను సాగు చేశా. అధిక వర్షాలకు దాదాపుగా 11 ఎకరాలు పంట ఎండిపోయింది. ఉన్న పొలంలో మిరప కాయలు మచ్చలు ఏర్పడి తెల్లగా మారిపోయాయి. మిరప కోతలు కోయగా కనీసం ఎకరాకు క్వింటాల్‌ దిగుబడి కూడా రాలేదు. 26 ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశాం. రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయా.

- వెంకటేశులు, గడేకల్లు

Updated Date - 2022-06-29T06:39:15+05:30 IST