నేడు ప్రేమికుల దినోత్సవం

ABN , First Publish Date - 2020-02-14T09:26:45+05:30 IST

గుండెనిండా దాచుకున్న ఆకాశమంత ప్రేమను, మాటల్లో చెప్పలేని అనంతమైన భావాలను వెల్లడించే అపూర్వమైన ప్రేమికుల రోజు వచ్చేసింది. జాతి, కుల, మత, వర్గ, భాష, ప్రాంతీయ భేదాల్లేనిది

నేడు ప్రేమికుల దినోత్సవం

ఇలా మొద‘లవ్‌’తుంది

గుండెనిండా దాచుకున్న ఆకాశమంత ప్రేమను, మాటల్లో చెప్పలేని అనంతమైన భావాలను వెల్లడించే అపూర్వమైన ప్రేమికుల రోజు వచ్చేసింది. జాతి, కుల, మత, వర్గ, భాష, ప్రాంతీయ భేదాల్లేనిది ఈ ప్రేమ. విశ్వవ్యాప్తమైనది. ఇలాంటి ప్రేమ గురించి ఎంతచెప్పినా తక్కువే. అసలు ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎలా పుట్టింది, దీని వెనుక కారణాలేంటి, పండగలా ఎలా మారిందో తెలుసుకుందాం... 

విజయవాడ, ఆంధ్రజ్యోతి: వాలెంటైన్‌ ఎవరు..? వాలెంటైన్‌ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. క్రీస్తుపూర్వం 270లో రోమ్‌ దేశంలో జీవించిన వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. దీంతో యువతలో వాలెంటైన్‌ పట్ల క్రేజ్‌ పెరిగింది. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె వాలెంటైన్‌ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గెలాసియన్స్‌ వాలెంటైన్‌ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. ఈ రోజును ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకొంటారు.

మనదేశంలో : మనదేశంలో 20-30 ఏళ్లుగా ప్రేమికుల రోజును జరుపుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్యతో పాటు పాశ్చాత్య సంస్కృతిని నిషేధించాలనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంగ్లీష్‌ ప్రధాన భాషగా చలామణిలో ఉన్న అన్ని దేశాల్లో ప్రేమికుల దినోత్సవాన సెలవు ఇచ్చే విధానం ఉంది. మనదేశంలో అలా లేదు.

ఇటలీలో.. : ఇటలీలో ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం మొట్టమొదటిసారి చూసిన వ్యక్తే తమ జీవిత భాగస్వామిగా మారతారనే భావన ఉంది. అలా కనిపించిన వారితో తర్వాతి ప్రేమికుల దినోత్సవానికి వివాహం కూడా అయిపోతుందని నమ్మకం.

జర్మనీలో.. : జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ లేదా పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. దీంతో వాలెంటైన్‌ డేకు ముందు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్‌ పెరుగుతుంది. 

అర్జెంటీనాలో.. : అందరికీ ప్రేమికుల రోజు ఉంటే అర్జెంటీనా వాసులకు ప్రేమికుల వారం ఉంది. ఆ దేశంలో జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.

కొరియాలో.. : కొరియాలో రెండు సంప్రదాయాలున్నాయి. ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ఓ పక్క ప్రేమికులు ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. మరోపక్క ప్రేమలో పడనివారు ఇదేరోజును బ్లాక్‌ డేగా భావిస్తూ నల్లటి దుస్తులు ధరిస్తారు.

జపాన్‌లో.. : జపాన్‌లో వాలెంటైన్స్‌ డేన ప్రేమికులు బహుమతులుగా చాక్లెట్లను ఇచ్చుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా చాకెట్లు తయారుచేస్తారు. ఇలా చాక్లెట్లు బహుమతిగా అందుకున్న వారు నెల తర్వాత అవతలి వారికి చాక్లెట్లతో పాటు బహుమతులనూ అందజేస్తారు. 

పక్షుల కోసం : ఫిబ్రవరిలో పక్షులు తమ జంటల కోసం ఎక్కువగా వెతుకుతాయి. కాబట్టి పక్షులూ ప్రేమను తెలుపుకొంటాయనే ఆలోచనతో ఈ రోజును ఎంపిక చేశారు. 


గ్రేట్‌ గ్రీటింగ్‌

అమెరికా, డెన్మార్క్‌, యూకే, ఇటలీ, జపాన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో వాలెంటైన్స్‌ డేను పెద్ద పండుగలా చేస్తారు. క్రిస్మస్‌ తర్వాత ఎక్కువగా గ్రీటింగ్స్‌ పంచుకునే రోజుగా వాలెంటైన్స్‌ డే గుర్తింపు పొందింది. ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రీటింగులు అమ్ముడవుతాయని అంచనా. 


ప్రేమకు అడ్రెస్‌

ప్రేమికుల రోజున ధరించే డ్రెస్‌ కూడా ఒక సందేశాన్ని పంపుతుంది. ఆ సందేశా న్ని పసిగట్టేలా రంగులకూ కొన్ని అర్థాలు ఏర్పాటు చేసుకున్నారు. 

పింక్‌ : గోయింగ్‌ టు ప్రపోజ్‌

బ్లూ : వెలకమ్‌ ఫర్‌ అప్లికేషన్స్‌

ఆరెంజ్‌ : ఆల్రెడీ ఇన్‌ లవ్‌

బ్లాక్‌ : నాట్‌ ఇంట్రస్టెడ్‌

ఎల్లో : లవ్‌ ఫెయిల్యూర్‌

గ్రీన్‌ : లవ్‌ యాక్సెప్టెడ్‌

వైట్‌ : డబుల్‌ సైడ్‌


ఏడు రోజుల పండగ

వాలెంటైన్స్‌ వీక్‌లో మొదటి రోజైన ఫిబ్రవరి ఏడును రోజ్‌ డేగా ప్రేమికులు భావిస్తారు. తమ అనుబంధాన్ని పెంచుకోవడం కోసం గులాబీలను అందజేస్తారు. 

ఇష్టపడిన వారికి మొదటిసారి ప్రపోజ్‌ చేయడం కోసం ఫిబ్రవరి ఎనిమిదిని ప్రపోజ్‌ డేగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. 

ప్రేమ బంధం ఎప్పటికీ తీయగా ఉండాలనే ఉద్దేశంతో ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. అందుకోసం ఫిబ్రవరి తొమ్మిదిని చాక్లెట్‌ డేగా జరుపుకొంటారు. 

బహుమతులెన్నున్నా అమ్మాయిలు టెడ్డీబేర్‌లను బాగా ఇష్టపడతారు. టెడ్డీని బహుమతిగా ఇవ్వడం ద్వారా తామెప్పుడూ ప్రేయసి వెన్నంటే ఉన్న భావన కలిగించవచ్చు. అందుకోసం ఫిబ్రవరి 10ని టెడ్డీ డేగా జరుపుకొంటారు. 

నమ్మకానికి గుర్తుగా ప్రామిస్‌ చేసుకుంటారు. అదే ఫిబ్రవరి 11న ప్రామిస్‌ డేగా ఎన్ని కష్టాలొచ్చినా విడిపోకూడదనే ఉద్దేశంతో జరుపుకొంటారు. 

ప్రేమికులు తమప్రేమను ముద్దు ద్వారా తెలియపరుచుకునే రోజు ఫిబ్రవరి 12. దీన్నే కిస్‌ డేగా వ్యవహరిస్తారు.

ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ ప్రేమను పంచుకునే రోజు హగ్‌ డే. ఫిబ్రవరి 13ను హగ్‌ డేగా జరుపుకొంటారు. 

వీటన్నింటినీ ఒక్క రోజులోకి మార్చితే ఫిబ్రవరి 14. అదే ప్రేమ పండగ. ప్రేమికుల దినోత్సవం. 


Updated Date - 2020-02-14T09:26:45+05:30 IST