వ్యాక్సిన్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2021-01-14T06:01:55+05:30 IST

జిల్లాకు కరోనా వ్యాక్సిన్‌ వచ్చింది. తొలి విడిత వ్యాక్సినేషన్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

వ్యాక్సిన్‌  వచ్చేసింది!


ప్రత్యేక వాహనాల్లో కేంద్రాలకు తరలింపు 

16న 22 చోట్ల 24వేల మందికి టీకా

ప్రభుత్వ వైద్యశాల వద్ద పరిశీలించిన కలెక్టర్‌ భాస్కర్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 13 : జిల్లాకు కరోనా వ్యాక్సిన్‌ వచ్చింది. తొలి విడిత వ్యాక్సినేషన్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిని రెండు రూట్లుగా విభజించి ప్రత్యే అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు మధ్య వ్యాక్సిన్‌ను ఆయా కేంద్రాలకు తరలించారు. జిల్లాలో మొదటి విడతలో వైద్య ఆరోగ్య సిబ్బందికి 24వేల మందికి  వ్యాక్సిన్‌ వేయనున్నారు. ప్రత్యేక వాహనాల్లో వ్యాక్సిన్‌ తరలింపు కార్యక్రమాన్ని బుధవారం ఉదయం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలివిడతలో ఈనెల 16న వ్యాక్సినేషన్‌ జరిగే 22 కేంద్రాలకు పోలీస్‌ బందోబస్తు మధ్య తరలించినట్లు తెలిపారు. జిల్లాలో మూడు విడతల్లో వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించామని చెప్పారు. తొలివిడతలో ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న 24వేల మంది సిబ్బందికి టీకా వేసేందుకు గుర్తించామని తెలిపారు. అందుకోసం  130 సెషన్‌ పాయింట్లను కేటాయించామన్నారు. 31వేల వ్యాక్సిన్‌ వయల్స్‌ డోసులు వచ్చాయని తెలిపారు.  ఒక్కో కేంద్రంలో వంద మందికి టీకా వేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఉషారాణిని నోడల్‌ అధికారిగా నియమించినట్లు చెప్పారు. ఆయన వెంట జేసీ టి.ఎస్‌.చేతన్‌, డీఎంహెచ్‌వో రత్నావళి, డిప్యూటీ కలెక్టర్‌ వసంతబాబు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ తిరుమలరావు ఉన్నారు. 

Updated Date - 2021-01-14T06:01:55+05:30 IST