వడ్డీ వ్యాపారి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2022-05-25T06:08:37+05:30 IST

పట్టణంలోని మారుతీనగర్‌లోని వడ్డీ వ్యాపారి రమణారెడ్డి ఇంట్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖాధికారుల సోదాలు మంగళవారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

వడ్డీ వ్యాపారి ఇంట్లో కొనసాగుతున్న  ఐటీ సోదాలు

కదిరి, మే 24

పట్టణంలోని మారుతీనగర్‌లోని వడ్డీ వ్యాపారి రమణారెడ్డి ఇంట్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖాధికారుల సోదాలు మంగళవారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ అధికారులు భార్గవ్‌, వెంకట్‌ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం రాత్రయినా సోదాలు చేస్తూనే ఉన్నారు. రమణారెడ్డిది ఓడీసీ మండలం తువ్వవాండ్లపల్లి. 30 సంవత్సరాల క్రితం కదిరికి వచ్చి వడ్డీ వ్యాపారం మొదలెట్టాడు. డైలీ ఫైనాన్స ఇస్తున్నట్లు తెలిసింది. వడ్డీ వ్యాపారంలో రూ.కోట్లు గడించినట్లు సమాచారం. వడ్డీ కట్టలేక చాలామంది ఆస్తులనుకూడా రాసిచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖాధికారులకు ఫిర్యాదులు అందడంతో సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఐటీ శాఖాధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. బుధవారం మధ్యాహ్నం వరకు దాడులు కొనసాగుతాయని  చెబుతున్నారు. విశ్వనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు రూ.53 లక్షల నగదు, రూ.కోటికిపైగా ప్రాంసరీ నోట్లు, ఆస్తి పత్రాలు, పెద్దఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారు, పత్రాలను కూడా ఐటీ శాఖాధికారులు తీసుకొచ్చారు. వీటిని లెక్కించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.


వడ్డీపై వడ్డీ

రమణారెడ్డి 30 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీపై వడ్డీ వేస్తూ రూ.కోట్లు గడించాడని సమాచారం. అధిక వడ్డీలు కట్టలేని పలువురు తమ ఆస్తులను రాసిచ్చినట్లు తెలుస్తోంది. రమణారెడ్డి, అతడి కుటుంబికుల పేర్ల మీద పట్టణంలో 30కిపైగా ఇళ్లున్నట్లు తెలుస్తోంది. ఇతడి వేధింపులు భరించలేక కొంతమంది ఊరు వదిలిపోయినట్లు సమాచారం. 


నలిగిపోతున్న ప్రజలు

పట్టణంలో రమణారెడ్డి లాంటి వడ్డీ వ్యాపారులు వందలమంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ దిన, వార, నెల వడ్డీలకు అప్పులిచ్చి, అధిక వడ్డీలు గుంజుతున్నట్లు తెలుస్తోంది. చిరువ్యాపారులు, చిరు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని, వీరి వ్యాపారం కొనసాగుతోంది. వడ్డీ రూ.3 నుంచి రూ.20 వరకు వసులు చేస్తున్నారు. కొన్ని సమయాల్లో రోజుల ప్రకారం కూడా అప్పులిచ్చి, వడ్డీలు వసూలు చేయడం గమనార్హం. వీరి వేధింపులు భరించలేక చాలామంది ఆస్తులు రాసిచ్చేసి, ఊరు వదిలిపోయారు. ఇప్పటికైనా అధికారులు.. వడ్డీ వ్యాపారుల బారి నుంచి ప్రజలు రక్షించాలని కోరుతున్నారు.



Updated Date - 2022-05-25T06:08:37+05:30 IST