మానవ శరీరాలను ఆవిరి చేయగలిగే వాక్యూమ్ బాంబు

ABN , First Publish Date - 2022-03-01T23:02:20+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అత్యంత దారుణమైన క్లస్టర్ బాంబులు

మానవ శరీరాలను ఆవిరి చేయగలిగే వాక్యూమ్ బాంబు

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అత్యంత దారుణమైన క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులను ఉపయోగిస్తోందని అమెరికాతోపాటు అనేక మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చాలా రకాల ఆయుధాలు లోహాల ముక్కలను వెదజల్లడం ద్వారా విధ్వంసం సృష్టిస్తాయి. కానీ వాక్యూమ్ బాంబు పరిసరాల్లోని గాలి నుంచి ఆక్సిజన్‌ను పీల్చుకుని, పేలి, అత్యధిక ఉష్ణోగ్రతను వెదజల్లుతుంది.


వాక్యూమ్ బాంబును థర్మోబేరిక్ ఆయుధం, ఏరోసోల్ బాంబు అని కూడా అంటారు. దీనిని ప్రయోగించినపుడు పరిసరాల్లోని గాలి నుంచి ఆక్సిజన్‌ను పీల్చుకుంటుంది. అనంతరం అత్యంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతను వెదజల్లుతుంది. సుదీర్ఘ కాలంపాటు చెప్పుకోదగ్గ స్థాయిలో పేలుడు ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.  మానవ శరీరాలను ఆవిరి చేయగలిగినంత తీవ్రమైన వేడిని సృష్టించగలదు. ఇది రెండు దశలుగల బాంబు. అత్యంత సూక్ష్మమైన పదార్థాలతో తయారైన ఏరోసోల్స్‌ (గాలి తుంపరలు) మొదటి దశలో విడిపోయి చెల్లాచెదురవుతాయి. కార్బన్ ఆధారిత ఇంధనం నుంచి సూక్ష్మమైన లోహపు కణాలతో ఈ ఫైన్ మెటీరియల్‌ను తయారు చేస్తారు. రెండో దశలో దిగ్భ్రాంతికరమైన ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఓ మేఘం ఏర్పడుతుంది. పరిసరాల్లోని గాలి నుంచి ఆక్సిజన్‌ను పీల్చుకుని ఈ ప్రభంజనం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ బాంబు పడిన చోట శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. సంప్రదాయ పేలుడు పదార్థాల కన్నా వాక్యూమ్ బాంబు వల్ల ఏర్పడే పేలుడు ప్రభంజనం సుదీర్ఘ సమయంపాటు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Updated Date - 2022-03-01T23:02:20+05:30 IST