వాక్సిన్ విజయం!

ABN , First Publish Date - 2022-07-20T06:35:46+05:30 IST

దేశంలో కరోనా టీకా డోసుల సంఖ్య ఇటీవల రెండువందల కోట్ల మైలురాయిని తాకినందుకు సంతోషించాలి. దీంతో 87శాతం దేశవయోజనులకు కచ్చితంగా రెండుడోసులూ పడినట్టు...

వాక్సిన్ విజయం!

దేశంలో కరోనా టీకా డోసుల సంఖ్య ఇటీవల రెండువందల కోట్ల మైలురాయిని తాకినందుకు సంతోషించాలి. దీంతో 87శాతం దేశవయోజనులకు కచ్చితంగా రెండుడోసులూ పడినట్టు, 96శాతానికి కనీసం ఒక్కడోసు వేసినట్టు అయింది. దేశ జనాభారీత్యా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం కనుక, ప్రధాని అన్నట్టుగా, భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించినట్టయింది. గత ఏడాది జనవరి 16న ఆరంభించి, తొమ్మిది నెలల్లో తొలి వందకోట్ల డోసులు, మరో తొమ్మిది నెలల్లో మరో వందకోట్ల డోసులు వేసి ఓ భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇప్పుడు మూడో డోసును కూడా వయోజనులకు ఉచితంగా వేయాలని నిర్ణయించింది. ఈ డోసు ఫలితం, ప్రభావం మీద భిన్నమైన వాదనలను అటుంచితే, ఓ ప్రమాదకరమైన వైరస్ విషయంలో ముందుజాగ్రత్త అన్నది కచ్చితంగా అవసరమే.


కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నమాట నిజం. నిల్వలు కూడా అధికంగానే ఉన్నాయని అంటున్నారు. ‘ముందుజాగ్రత్త మూడోటీకా’ను ఉచితంగా ఇచ్చే పని జూలై 15నుంచి మొదలుకావడమే కాక, క్షేత్రస్థాయిలో దానికి సానుకూలత కూడా కనిపిస్తున్నది. టీకా వేసుకొనేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. బూస్టర్ డోసులు ఉచితంగా ఇవ్వకపోవడం కూడా ఈ కార్యక్రమం ఆదిలో ఊపందుకోకపోవడానికి ఓ కారణం. కరోనా కారణంగా ఆదాయాలు కోల్పోయి, అధికధరలతో బాధపడుతున్న సామాన్యులకు వాక్సిన్ ప్రయోజనం మీద పాఠాలు చెప్పడం కంటే వారిని రప్పించడం, టీకా వేయడం ముఖ్యం. బూస్టర్‌కు అర్హులైనవారిలో ఒక్కశాతం మాత్రమే ఇప్పటివరకూ దానిని తీసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. కేసుల సంఖ్యను బట్టి దేశంలో కరోనా విస్తరణ ఏ స్థాయిలో ఉన్నదో చెప్పలేం. పరీక్షలు భారీగా జరిగినప్పుడు మాత్రమే అసలు సంగతి తేలుతుంది. ప్రభుత్వాలు దీనిపై పట్టింపుగాలేవు. గతంలో ఒకటిరెండు లక్షణాలు కనిపించినా భయంతోనో, జాగ్రత్తతోనో పరీక్షలకు పరుగులుతీసిన జనం కూడా ఇప్పుడు వాటిజోలికి పోవడం లేదు. వైరస్ వల్ల అనారోగ్యం కలుగుతున్నప్పటికీ ఆ ప్రభావం తక్కువగా ఉండటం ఇందుకు ఓ కారణం. ఆస్పత్రుల్లో చేరికలు, ఆక్సిజన్ అవసరాలు, మరణాల వంటిమాటలు పెద్దగా వినబడటం లేదు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో అమలు చేసి, అత్యధిక జనాభాకు రక్షణకవచాన్ని అందించిన ఫలితం ఇది. అనేక ఉత్థానపతనాలను ఈ క్రమంలో దేశం చూసింది. టీకా వ్యతిరేకత మనదేశంలో ఒక ఉద్యమంగా, హక్కుగా లేకపోయినప్పటికీ ఆరంభంలో అనేకులు దీనికి మొగ్గుచూపలేదు. అపోహలు తొలగిపోవడానికీ, ప్రక్రియ ఊపందుకోవడానికీ మరికొంత కాలం పట్టింది. టీకాల కొరత కొంతకాలం వేధించింది. రెండు డోసుల మధ్య ఎడం ఒకదశలో ఎందుకు పెంచాల్సివచ్చిందో తెలియనిదేమీ కాదు. సెకండ్ వేవ్ కాలంలో కేంద్రం పూర్తిగా చేతులు దులిపేసుకొని, ఆర్డర్ చేయడం నుంచి అందించేంతవరకూ బాధ్యత పూర్తిగా రాష్ట్రాల నెత్తినపడేసినప్పుడు సరఫరా వ్యవస్థ బాగా దెబ్బతిన్నమాట నిజం. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చీవాట్లు పెట్టిన తరువాతే వాక్సినేషన్ ప్రక్రియ తిరిగి పట్టాలెక్కింది.


అమెరికా వంటి దేశాల్లో బిఎ–5వంటి వేరియంట్లు ఇంకా తమ ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండక తప్పదు. మనిషి రోగనిరోధకశక్తినీ, వాక్సిన్ సామర్థ్యాన్నీ దాటిపోగలిగే సరికొత్త వేరియంట్లు తయారయ్యే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నందున, ఇప్పుడున్న వాక్సిన్లనే నమ్ముకొని కూచోలేం. అన్నిరకాల వేరియంట్లకూ ఒకే సూదిమందనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా పదికంపెనీలు కృషిచేస్తున్నప్పటికీ అది ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు. ఆ రకమైన టీకా అభివృద్ధి ఇంకా వివిధ దశల్లో ఉన్నది. కొవిడ్ వాక్సిన్ మేధోహక్కులకు సంబంధించి భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా గతనెలలో ప్రపంచ ఆరోగ్యసంస్థ పేటెంట్ హక్కులను ఎత్తివేయడానికి అంగీకరించింది. ‘ఒకవైరస్ ఒకే టీకా’ లక్ష్యసాధనలో భారతదేశం పాలుపంచుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. అప్పటివరకూ ఉన్న టీకాలనూ, మాస్కులనూ నమ్ముకొని నడవక తప్పదు.

Updated Date - 2022-07-20T06:35:46+05:30 IST