టీకా మూడో డోసు అక్కర్లేదు

ABN , First Publish Date - 2021-12-13T08:00:24+05:30 IST

ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల తేలికపాటి కొవిడ్‌ ఇన్ఫెక్షన్లే సోకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీకా బూస్టర్‌ (మూడో) డోసును హుటాహుటిన అందుబాటులోకి తేవాల్సిన అవసరమేం ...

టీకా మూడో డోసు అక్కర్లేదు

హుటాహుటిన దాన్ని అందుబాటులోకి 

తేవాల్సిన అవసరం లేదు: ఐసీఎంఆర్‌

కొవిషీల్డ్‌ బూస్టర్‌పై ‘సీరం’ దరఖాస్తు తిరస్కరణ

దేశంలో మరో ఐదు ఒమైక్రాన్‌ కేసులు

ఏపీ, చండీగఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో..

మొత్తం 38కి పెరిగిన కొత్త వేరియంట్‌ కేసులు

 ఐసీఎంఆర్‌ సాంక్రమిక వ్యాధుల 

 విభాగాధిపతి డాక్టర్‌ సమీరన్‌ పాండా 


పుణె/న్యూఢిల్లీ, డిసెంబరు 12: ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల తేలికపాటి కొవిడ్‌ ఇన్ఫెక్షన్లే సోకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీకా బూస్టర్‌ (మూడో) డోసును హుటాహుటిన అందుబాటులోకి తేవాల్సిన అవసరమేం లేదని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సాంక్రమిక వ్యాధుల విభాగాధిపతి డాక్టర్‌ సమీరన్‌ పాండా స్పష్టం చేశారు. కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆదివారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈవివరాలను వెల్లడించారు. కరోనా వ్యాప్తి స్థితిగతుల ఆధారంగా దేశ ప్రజలకు బూస్టర్‌ డోసును ఇవ్వాలా? వద్దా? అనే దానికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను జాతీయ వ్యాక్సినేషన్‌ సాంకేతిక సలహా బృందం (ఎం టగీ) విశ్లేషించి ఓ ప్రకటన చేస్తుందన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మూడో డోసును అందించే అంశంపై త్వరలో ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమీరన్‌ పాండా చెప్పారు. వయోజనులు అం దరికీ టీకా రెండు డోసులను అందించడంతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని, దాన్ని మరింత వేగవంతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలు కోరుతున్నప్పటికీ.. ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారిలో వస్తున్న ఫలితాలను బట్టి ఆ వ్యవధి సముచితమైందేనని వెల్లడవుతున్నట్లు వివరించారు. 


ట్రయల్స్‌కు ముందే సిఫారసు చేయలేం

కొవిషీల్డ్‌ బూస్టర్‌ డోసుకు అనుమతులు కోరుతూ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సమర్పించిన దరఖాస్తును కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో)కు చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) తిరస్కరించింది. ప్రయోగ పరీక్షలు జరగక ముందే.. వినియోగం కోసం బూస్టర్‌ డోసును సిఫారసు చేయలేమని స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన భేటీలో ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటించిన ఎస్‌ఈసీ, బూస్టర్‌పై అదనపు సమాచారాన్ని సమర్పించాలని ‘సీరం’కు సూచించింది. 


కొత్త వేరియంట్లతో అనిశ్చితి పరిస్థితి

విషమించకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో

వ్యాక్సిన్‌ రక్షణను దాటుకొని మరీ ఒమైక్రాన్‌ సోకే ప్రమాదం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. భారత్‌లో మూడో వేవ్‌ ముప్పుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. కొత్త వేరియంట్‌ వచ్చినంతమాత్రాలన పరిస్థితులు విషమిస్తాయని చెప్పలేమని.. అయితే మరింత అనిశ్చితి మాత్రం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా ప్రాంత సంచాలకురాలు డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ అభిప్రాయపడ్డారు. ‘‘కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. కొత్త వేరియం ట్లు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెరుగుతున్న కేసులను బట్టి చూస్తే కొవిడ్‌ ముప్పు చాలా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మనం ఏమరుపాటుగా ఉండకూడదు. వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచి వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయాలి. దక్షిణాఫ్రికా నుంచి అందిన సమాచారం ప్రకారం ఒమైక్రాన్‌తో రీఇన్ఫెక్షన్‌ ముప్పు ఎక్కువ. దీన్ని ధ్రువీకరించుకోవడానికి మరిం త డేటా కావాలి. అలాగే.. డెల్టాతో పోలిస్తే ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువగా ఉందనడానికి ఆధారాలున్నాయు’’ అని ఖేత్రపాల్‌ వివరించారు.

Updated Date - 2021-12-13T08:00:24+05:30 IST