వచ్చే నెల నుంచి పిల్లలకు టీకా

ABN , First Publish Date - 2021-09-15T09:34:21+05:30 IST

పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందించే ప్రక్రియను అక్టోబరు - నవంబరుకల్లా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

వచ్చే నెల నుంచి పిల్లలకు టీకా

  • జైడస్‌ క్యాడిలా టీకాలు అందగానే వ్యాక్సినేషన్‌.. 
  • తొలి విడతలో 12-17 ఏళ్లలోపు  దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికే ! 
  • యోచనలో కేంద్ర ప్రభుత్వం
  • కేసులు తగ్గాయి.. మరణాలు పెరిగాయి 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 : పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందించే ప్రక్రియను అక్టోబరు - నవంబరుకల్లా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెలాఖరులో జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ డోసుల సరఫరా ప్రారంభం కాగానే దీనికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే తొలి విడతలో స్థూలకాయం, హృద్రోగాలు, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 12-17 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే వ్యాక్సినేషన్‌ చేసేందుకు సర్కారు సిద్ధమవుతోందంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా 20 లక్షల నుంచి 30 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన పిల్లలకు టీకాలు వేయాల్సి ఉంటుందని కేంద్రం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. టీకాల తొలి లాట్‌లో జైడస్‌ క్యాడిలా 40 లక్షల డోసులను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. విడతల వారీగా ఈసంఖ్యను పెంచుకుంటూ డిసెంబరు నాటికి మొత్తం 4 కోట్ల డోసులను సరఫరా చేయాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈనేపథ్యంలో పిల్లల కొవిడ్‌ టీకాల లభ్యత వచ్చే ఏడాది మార్చి వరకు విస్తృతంగా పెరగొచ్చని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి తర్వాతే పిల్లలందరికీ వ్యాక్సిన్లు అందే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 


పిల్లలపై సీరో సర్వేలో.. 

పిల్లలకు టీకాలు వేసేందుకు బ్రిటన్‌ తరహా వ్యాక్సినేషన్‌ నమూనాను అనుసరించాలని యోచిస్తున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ వెల్లడించారు. ఇందులో భాగంగా అవరోహణ క్రమంలో వయసులవారీగా పిల్లలకు టీకాలు అందిస్తారు. తొలుత 17 నుంచి 16 ఏళ్లలోపు వారికి, ఆ తర్వాత 16-15 ఏళ్లవారికి వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్న మాట. బూస్టర్‌ డోసు ఇప్పుడు ప్రధానమైన అంశం కానే కాదని.. దేశ ప్రజలందరికీ రెండు టీకా డోసులను అందించడమే తక్షణ కర్తవ్యమని బలరాం భార్గవ స్పష్టంచేశారు. ప్రస్తుతం రెండో వేవ్‌ నడి మధ్యలో ఉన్నామని, మూడోవేవ్‌ రాకూడదని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈసారికి పండుగలను కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తగా జరుపుకుంటే.. వచ్చే ఏడాది జోష్‌తో జరుపుకునే అవకాశాలు ఉంటాయని సూచించారు. కాగా, 71 శాతం మంది పిల్లల్లో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) నిర్వహించిన సీరో సర్వేలో తేలింది. 2700 మంది పిల్లల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా ఈవిషయం వెల్లడైనట్లు పేర్కొంది. ఇక కొవాగ్జిన్‌ టీకాకు ఈనెలాఖరులోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి  అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ వెల్లడించారు. 


కొత్త కేసులు 25 వేలు.. కేరళలో 15 వేలు 

దేశంలో కొత్త కొవిడ్‌ కేసులు కొంతమేర తగ్గినా మరణాలు మాత్రం పెరిగాయి. ఆదివారం 219 మంది కరోనాతో మరణించగా.. సోమవారం ఆ సంఖ్య 339కి పెరిగింది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4.43 లక్షలు దాటింది. అంతక్రితం రోజుతో పోలిస్తే కొవిడ్‌ కేసుల సంఖ్య సోమవారం 1,850 తగ్గి 25,404కు చేరింది. వీటిని కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 3.32 కోట్లు దాటింది. గత 24 గంటల్లో 12,062 యాక్టివ్‌ కేసులు తగ్గడం గమనార్హం. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో  15,058 ఒక్క కేరళలోనే బయటపడ్డాయి. అక్కడ 99 మంది కొవిడ్‌తో మృతిచెందారు. మునుపటితో పోల్చుకుంటే కేసులు కొంతమేర తగ్గినందున .. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో శనివారం రోజును పనిదినంగా పునరుద్ధరిస్తున్నట్లు కేరళ సర్కారు ప్రకటించింది. 


కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 4 నుంచి ఇప్పటివరకు శనివారం రోజును సెలవుదినంగా అమలుచేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో మరో 2,740 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో సగం కేసులను పుణె, అహ్మద్‌నగర్‌ జిల్లాల్లో గుర్తించారు. గుజరాత్‌లో సోమవారం రోజున 12 కొత్త కేసులే నమోదయ్యాయి. అయినా 8 నగరాల్లో సెప్టెంబరు 25 వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వీయ నిర్బంధం (సెల్ఫ్‌ ఐసొలేషన్‌)లోకి వెళ్లారు. కుటుంబీకులు, పలువురు సన్నిహితులకు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. వాటిలో పుతిన్‌కు నెగెటివ్‌ వచ్చినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 

Updated Date - 2021-09-15T09:34:21+05:30 IST