వ్యాక్సిన్‌ డే

ABN , First Publish Date - 2021-01-16T05:55:56+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొదట ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో, అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు 36,694 మందితో జాబితా సిద్ధం చేశారు.

వ్యాక్సిన్‌ డే

మొదటి దశలో వ్యాక్సిన్‌ తీసుకోనున్న ఆరోగ్య సిబ్బంది 36,694 

వ్యాక్సినేషన్‌ కేంద్రాలు (గ్రామీణం, నగరం కలిపి)      32

జిల్లాకు మొదటి దశలో వచ్చిన వ్యాక్సిన్‌ డోసులు 46,500


నేటి నుంచే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

మొదటి విడత జిల్లాలో 36,694 మంది ఆరోగ్య సిబ్బందికి...

32 కేంద్రాల్లో రోజుకు 100 మందికి...

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

పక్కాగా ఏర్పాట్లు

జిల్లాకు ‘కొవిషీల్డ్‌’


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొదట ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో, అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు 36,694 మందితో జాబితా సిద్ధం చేశారు. ఇందుకోసం 32 కేంద్రాల్లో ఏర్పాట్లుచేశారు. రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన 46,500 డోసుల వ్యాక్సిన్‌ను ఇమ్యునైజేషన్‌ కార్యాలయంలో నిల్వ చేసి...ప్రత్యేక వాహనాల ద్వారా గురువారం సాయంత్రానికి వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు పంపించారు.  


ఉదయం 10.30 గంటల నుంచి..


శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన అనంతరం వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించనున్నారు. జిల్లా నుంచి కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌తోపాటు ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పీవీ సుధాకర్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం చినవాల్తేరులోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఏర్పాట్లు చేశారు. మిగిలిన రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. 


ఒక్కో కేంద్రంలో 16 మంది సిబ్బంది


ఒక్కో వ్యాక్సిన్‌ కేంద్రంలో 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వ్యాక్సిన్‌ తీసుకునే ఆరోగ్య సిబ్బంది ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను చూసి లోపలకు పంపించేందుకు మహిళా పోలీస్‌, ఆ ఫోన్‌కు వచ్చిన వివరాలను నమోదు చేసుకునే డిజిటల్‌ అసిస్టెంట్‌, వ్యాక్సినేటర్‌ (డాక్టర్‌, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సు...ఎవరైనా కావచ్చు), అంగన్వాడీ కార్యకర్త, ఆశ వర్కర్‌తోపాటు మెడికల్‌ ఆఫీసర్‌, మరో పది మంది వలంటీర్లు  సేవలు అందిస్తారు. ప్రతి కేంద్రానికి బాధ్యులుగా ఉన్నతాధికారులను నియమించారు. ఆయా కేంద్రాల్లో ఏదైనా సమస్య వస్తే నోడల్‌ ఆఫీసర్లుగా నియమితులైన జేసీ అరుణ్‌బాబు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సూర్యనారాయణను సంప్రతించాల్సి ఉంటుంది.


రోజుకు వంద మందికి.. 


మొదటిరోజు జిల్లాలో 300 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. మరుసటిరోజు నుంచి ప్రతి కేంద్రంలో రోజుకు వంద మంది చొప్పున వ్యాక్సిన్‌ ఇస్తారు. వ్యాక్సిన్‌ తీసుకునే ఆరోగ్య సిబ్బందికి ముందురోజే వారి ఫోన్లకు సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని చూపిస్తేనే సెంటర్‌లోకి అనుమతిస్తారు. వ్యాక్సినేషన్‌ తీసుకునే సిబ్బంది వారికి కేటాయించిన స్లాట్‌లో మాత్రమే రావాలని అధికారులు సూచిస్తున్నారు. 


గంటపాటు అబ్జర్వేషన్‌


వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత ప్రతి ఒక్కరూ గంటపాటు ఆ కేంద్రంలోనే ఉండాలి. ఇందుకోసం ప్రతి కేంద్రంలో రెండు గదులతోపాటు రెండు పడకలను సిద్ధం చేశారు.   ప్రాథమిక వైద్యం అందించేందుకు అనుగుణంగా ఏఈఎఫ్‌ఐ కిట్‌ అందుబాటులో ఉంచారు. మరీ అత్యవసరమైతే సేవలందించేందుకు ఆయా కేంద్రాలకు దగ్గర్లోని ఆస్పత్రుల్లో నిపుణులైన ఐదుగురు వైద్యులతో కూడిన బృందాలు ఏర్పాటుచేశారు. ఇందుకోసం కేజీహెచ్‌, విమ్స్‌, ప్రథమ, నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఒక్కో వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద అంబులెన్స్‌ సిద్ధంగా ఉంటుంది. 


ఏర్పాట్లు పూర్తి 

డాక్టర్‌ సూర్యనారాయణ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి


జిల్లాలో మొదటి దశ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లాకు కేంద్రం కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను పంపించింది. ప్రతి ఒక్కరికీ 0.5 ఎంఎల్‌ చొప్పున ఇవ్వనున్నాం. షెడ్యూల్‌ ప్రకారం 32 కేంద్రాల్లో రోజుకు వంద మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. ఇంట్రో మస్కిలర్‌ ఇంజెక్షన్‌ (సాధారణంగా తీసుకునే ఇంజెక్షన్‌) మాదిరిగా ఉంటుంది. 


కేంద్రాలకు చేరిన కొవిడ్‌ వ్యాక్సిన్‌

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, ఆంఽఽధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌


మొదటిరోజు వ్యాక్సిన్‌ తీసుకునే వారికి ఇప్పటికే సమాచారాన్ని వారి మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ పంపించాం. ఆ మెసేజ్‌ చూపిస్తేనే కేంద్రం లోపలకు అనుమతిస్తారు.  కేంద్ర స్టోరేజీ నుంచి వ్యాక్సిన్‌ కేంద్రాలకు చేరింది. ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన తరువాత వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Updated Date - 2021-01-16T05:55:56+05:30 IST