వ్యాక్సినేషన్‌ విధుల్లో అలసత్వం..!

ABN , First Publish Date - 2021-10-29T03:59:00+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విధుల్లో అలసత్వం వహించారని నలుగురు మెప్మా ఆర్పీలపై వేటు పడింది. కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటుండగా జిల్లాలో విధులకు గైర్హాజరైన నలుగురు ఆర్పీల సస్పెన్షన్‌ సంచలనం సృష్టించింది. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ రాకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ వేగం పెంచింది.

వ్యాక్సినేషన్‌ విధుల్లో అలసత్వం..!
మంచిర్యాలలోని మెప్మా జిల్లా కార్యాలయం

మెప్మా ఆర్పీలపై సస్పెన్షన్‌ వేటు

నలుగురిపై చర్యలకు కలెక్టర్‌ ఆదేశం

ఉత్తర్వులు జారీ చేసిన పీడీ బాలకృష్ణ

మంచిర్యాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విధుల్లో అలసత్వం వహించారని నలుగురు మెప్మా ఆర్పీలపై వేటు పడింది. కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటుండగా జిల్లాలో విధులకు గైర్హాజరైన నలుగురు ఆర్పీల సస్పెన్షన్‌ సంచలనం సృష్టించింది. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ రాకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ వేగం పెంచింది.  కలెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశాల మేరకు నవంబర్‌ 3వ తేదీలోపు జిల్లాలో నూరు శాతం లక్ష్యం పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో అన్ని శాఖల అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడే కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి టీకాలు ఇస్తున్నారు. వ్యాక్సినేషన్‌ వేగం పెంచేందుకు అధికారులు అంగన్‌వాడీలు, మెప్మా, ఆశా కార్యకర్తల సేవలను వినియోగించుకుంటున్నారు. 

విధులకు గైర్హాజరుతో...

ఓ వైపు అధికారులంతా వ్యాక్సినేషన్‌ బిజీలో ఉండగా మెప్మాకు చెందిన కొందరు రిసోర్స్‌పర్సన్‌లు మాత్రం విధులకు డుమ్మా కొట్టడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. వ్యాక్సినేషన్‌ విధులు నిర్వహించమంటూ నాలుగు రోజుల కిందట మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేసే ఆర్పీ మంగ, మందమర్రిలో పని చేస్తున్న అరుణ, ఆర్‌.రుక్మిణిదేవి, బెల్లంపల్లిలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌.అరుణ మెప్మా పీడీ బాలకృష్ణకు లేఖ అందజేశారు. పై నలుగురు విధులకు గైర్హాజరు కావడమే కాకుండా ఇతర ఆర్పీలను సైతం విధులకు రాకుండా తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. ఓ వైపు పరిస్థితి తీవ్రంగా ఉండగా, మరోవైపు విఽధులు నిర్వహించమని లేఖ అందజేయడంతో పీడీ కలెక్టర్‌కు నివేదించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్‌ తక్షణమే పై నలుగురిని సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీడీ బాలకృష్ణ ఈ నెల 27న సాయంత్రం నలుగురు ఆర్పీలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

వేతనాలు రావడం లేదనే...

నెలవారీ వేతనాలు సక్రమంగా రాకపోవడంతోనే ఆర్పీలు విధులకు గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది. సుమారు 10 నెలల నుంచి వేతనాలు రాక ఆర్పీలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అసలే తక్కువ వేతనాలు, అవికూడా సక్రమంగా అందకపోవడంతో కుటుంబాల పోషణకు ఇబ్బందులు పడుతున్నట్లు ఓ రిసోర్స్‌పర్సన్‌ తెలిపారు. అప్పులు తెచ్చి పిల్లలను పోషిస్తున్నట్లు ఆవేదన చెందారు. వేతనాలు చెల్లించాలని ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. తమ బాధలు పట్టించుకోకుండా వ్యాక్సినేషన్‌ విధులకు హాజరు కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు వాపోయారు.

విధుల్లో అలసత్వంతోనే సస్పెన్షన్‌ 

వ్యాక్సినేషన్‌ విధుల్లో అలసత్వం వహించి గైర్హాజరు కావడమే కాకుండా నలుగురు ఆర్పీలు ఇతరులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో  అప్పగించిన విధులు నిర్వహించకపోవడం బాధ్యతా రాహిత్యం అవుతుంది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్పీలను సస్పెండ్‌ చేశాం. 

ఆర్‌పీలను తొలగించడం అన్యాయం 

మందమర్రిటౌన్‌ : కరోనా వ్యాక్సినేషన్‌ సర్వే సక్రమంగా చేపట్టలేదనే సాకుతో మందమర్రి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆర్‌పీలను తొలగించడం అన్యాయమని, దీనిపై పునరాలోచన చేయాలని టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక విభాగం అధ్యక్షురాలు రుక్మిణిదేవి, కార్యదర్శి అరుణలు పేర్కొన్నారు.  గురువారం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ సర్వేను పూర్తి చేస్తున్నామన్నారు. పొదుపు సంఘాలను పటిష్టం చేస్తూ 6 వేల నుంచి 7 వేల మంది సభ్యులను చేర్చామన్నారు. ఈనెల 26న కరోనా వ్యాక్సినేషన్‌ సర్వే సరిగ్గా చేయలేదని ఉద్యోగాల నుంచి తొలగించడం సబబు కాదన్నారు. వెంటనే ఆర్‌పీను తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌పీలు అంజలి, హేమలత, రమాదేవి, సునీత, విజయలక్ష్మీ, రజిత, సరోజ, రాజ్యలక్ష్మీ, రమాదేవి, కల్పన, లావణ్య తదితరులు పాల్గొన్నారు. 

ఆర్పీలకు అండగా సీఐటీయూ 

తాండూర్‌: మెప్మా పరిధిలో పని చేస్తున్న ఆర్పీల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ అండగా ఉంటుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాగం రాజారాం తెలిపారు. గురువారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణ ఆర్పీలకు 11 నెలలుగా ప్రభుత్వం వేతనాలివ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకోవడం విచారకరమన్నారు. గ్రూపుల పనులే కాకుండా ప్రభుత్వ పనులన్నీ ఆర్పీలతో చేయించుకుని వారిని చిన్నచూపు చూస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా ఆర్పీలు  వినతి పత్రాలు ఇచ్చారని, ఈనెల 27న సమస్యలపై చర్చించేందుకు పీడీ కార్యాలయానికి పిలిపించి అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే మార్గాన్ని చూడాల్సిన అధికారులే నలుగురు ఆర్పీలను తొలగించడం సమంజసం కాదన్నారు. ఆర్పీల సమస్యలు పరిష్కరించే వరకు సీఐటీయూ అండగా ఉంటుందని తెలిపారు. నాయకులు శంకర్‌, నానయ్య ఉన్నారు.  

Updated Date - 2021-10-29T03:59:00+05:30 IST