Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 21 2021 @ 02:31AM

52కు చేరిన ఉత్తరాఖండ్‌ వరద మృతులు

డెహ్రాడూన్‌, నైనిటాల్‌, అక్టోబరు 20: ఉత్తరాఖండ్‌లో జలవిలయానికి బలైనవారి సంఖ్య 52కు చేరింది. తాజాగా మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఖైరానా, గరమ్‌పానీ ప్రాంతాల్లో కొండచరియలు రోడ్లకు అడ్డుగా పడటంతో రాణిఖేత్‌, అల్మోరా నగరాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తమకు సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని సీఎం పీఎస్‌ ధామి తెలిపారు. బుధవారం ఆయన కుమావు ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయచర్యల నిమిత్తం జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేశారు. కాగా, నైనిటాల్‌లో బుధవారం వర్షం పడకపోవడంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారికి సహాయం అందించేందుకు.. వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లను నైనిటాల్‌ ప్రాంతానికి, ఒక హెలికాప్టర్‌ను గఢ్వాల్‌ ప్రాంతానికి పంపించారు.


అలాగే, జాతీయ విపత్తు స్పందన దళానికి (ఎన్డీఆర్‌ఎఫ్‌) చెందిన 17 బృందాలు ఆయా ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. కాగా.. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌ మీదుగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని చిట్కుల్‌కు అక్టోబరు 11న ట్రెక్కింగ్‌కు బయల్దేరిన 11 మంది సభ్యుల బృందం ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వారిలో 8 మంది ట్రెక్కర్లు కాగా.. ముగ్గురు వంటవారు ఉన్నారు.

Advertisement
Advertisement