బీజేపీపై ఉత్తరాఖండ్ నేతల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-22T21:00:38+05:30 IST

ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని బీజేపీ నేతలు అసంతృప్తితో

బీజేపీపై ఉత్తరాఖండ్ నేతల ఆగ్రహం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని బీజేపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరిలో చాలా మంది ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. కొందరు స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. 59 మంది అభ్యర్థులతో ఆ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాను చూసి, పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన తమను కాదని, కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని వీరు మండిపడుతున్నారు. కొందరు తమ మనోవేదనను బహిరంగంగానే వెలిబుచ్చుతున్నారు. 


అసంతృప్తితో రగిలిపోతున్న ప్రముఖుల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు దేవీ షా, మహేశ్ నేగి వంటివారు ఉన్నారు. వీరు బాహాటంగానే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దేవీ షా మాట్లాడుతూ, తనకు టిక్కెట్ ఎందుకు నిరాకరించారో కేంద్ర పార్టీ నాయకత్వం వివరణ ఇవ్వాలన్నారు. తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధిస్తున్న విజయాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళానని, అంతేకాకుండా తన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు. పార్టీకి అంకితభావంతో పని చేసిన వేరొకరికి టిక్కెట్ ఇచ్చినా తనకు ఆవేదన ఉండేది కాదని, కాంగ్రెస్ నేపథ్యంగల వేరొకరికి ప్రాధాన్యమిచ్చి, టిక్కెట్ ఇవ్వడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. పార్టీ నిర్ణయంతో కార్యకర్తల ఆత్మస్థయిర్యం దెబ్బతిందన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కార్యకర్తలు తనపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. 


2020 సెప్టెంబరులో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నేగీ మాట్లాడుతూ, కుట్రతోనే తనకు టిక్కెట్‌ను నిరాకరించారని ఆరోపించారు. పార్టీ పరంగా నిర్వహించిన సర్వేల్లో తన పేరు అగ్ర స్థానంలో ఉన్నప్పటికీ తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. 


తనకు టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనతో కాంగ్రెస్‌లో చేరేందుకు బీజేపీ నేత ఓం గోపాల్ రావత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంకితభావంతో పని చేసేవారిని పార్టీ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2022-01-22T21:00:38+05:30 IST