లవ్‌ జిహాద్‌ చట్టం కింద తొలి శిక్ష

ABN , First Publish Date - 2021-12-23T07:50:42+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ‘లవ్‌ జిహాద్‌’ చట్టం కింద మొట్టమొదటిసారిగా ఓ యువకుడికి శిక్ష పడింది. కాన్పూర్‌కు చెందిన జావేద్‌ అనే యువకుడికి ఈ చట్టం కింద పదేళ్ల జైలుశిక్ష, ..

లవ్‌ జిహాద్‌ చట్టం కింద తొలి శిక్ష

  • యూపీలో యువకుడికి పదేళ్ల జైలు, 30 వేల జరిమానా

కాన్పూర్‌, డిసెంబరు 22: ఉత్తరప్రదేశ్‌లో ‘లవ్‌ జిహాద్‌’ చట్టం కింద మొట్టమొదటిసారిగా ఓ యువకుడికి శిక్ష పడింది. కాన్పూర్‌కు చెందిన జావేద్‌ అనే యువకుడికి ఈ చట్టం కింద పదేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధించారు. 2017లో జావేద్‌ తన పేరును మున్నాగా మార్చుకుని ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. అనంతరం ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.


అనంతరం అతడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. నిఖా చేసుకోవాలని బాధితురాలిని తీవ్రంగా బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో అతడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి తర్వాతి రోజే జావెద్‌ను అరెస్టు చేశారు. బలవంతపు మతమార్పిడి, పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతిని మతం మార్చడానికే పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో జావెద్‌కు పదేళ్ల జైలుశిక్ష, రూ.30 వేలు జరిమానా విధించారు. కాగా చట్టవ్యతిరేక మత మార్పిడి ఆర్డినెన్స్‌ 2020ను ఉత్తరప్రదేశ్‌ నిరుడు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్‌ చట్టరూపం దాల్చింది.


ఏ వ్యక్తినైనా బలవంతంగా, మోసపూరితంగా, పలుకుబడి ఉపయోగించి, లేదా ఆశచూపుతూ మతం మార్చడం ఈ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు. బలవంతంగా మతం మారిస్తే నేర తీవ్రతను బట్టి దోషికి కనీసం రూ.15 వేల జరిమానాతో పాటు ఒకటి నుంచి ఐదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి యూపీ పోలీసులు ఇప్పటిదాకా 108 కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-12-23T07:50:42+05:30 IST