యూపీ ఎన్నికలు : ఐదో దశలో ఉదయం 9 గంటల వరకు 8 శాతం పోలింగ్

ABN , First Publish Date - 2022-02-27T18:31:13+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ ఆదివారం మందకొడిగా

యూపీ ఎన్నికలు : ఐదో దశలో ఉదయం 9 గంటల వరకు 8 శాతం పోలింగ్

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ ఆదివారం మందకొడిగా ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 స్థానాల్లో ఆదివారం ఉదయం 9 గంటల వరకు సుమారు 8 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గాల్లో 2.24 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు.  ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సహా 692 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 


ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 9 గంటల వరకు అమేథీలో 8.67 శాతం, అయోధ్యలో 9.44 శాతం, బహ్రెయిచ్‌లో 7.45 శాతం, బారాబంకిలో 6.21 శాతం, చిత్రకూట్‌లో 8.80 శాతం, గోండాలో 8.31 శాతం, కౌషాంబిలో 11.40 శాతం, ప్రతాప్‌గఢ్‌లో 6.95 శాతం, ప్రయాగ్‌రాజ్‌లో 6.95 శాతం, రాయ్‌బరేలీలో 7.48 శాతం, ష్రావస్తిలో 9.67 శాతం, సుల్తాన్‌పూర్‌లో 8.60 శాతం పోలింగ్ నమోదైంది. 


అమేథీ, రాయ్‌బేరేలీలలో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉందని గతంలో చెప్పేవారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సిరతు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంత్రుల్లో సిద్ధార్థ్ నాథ్ సింగ్ (అలహాబాద్-పశ్చిమ), రాజేంద్ర సింగ్ (పట్టి), నంద్ గోపాల్ గుప్తా (అలహాబాద్-దక్షిణ), రామపాటి శాస్త్రి (మంకాపూర్) ఉన్నారు. 


కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తల్లి, అప్నా దళ్ (కే) నేత కృష్ణ పటేల్ ప్రతాప్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రత్యర్థులు. ఈ స్థానాన్ని అనుప్రియ బీజేపీకి వదిలిపెట్టారు. అనుప్రియ ఎన్డీయేలో ఉన్నారు. 


ఐదో విడత పోలింగ్ ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ మార్చి 3న, ఏడో విడత పోలింగ్ మార్చి 7న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 403 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదు దశల్లో మొత్తం 292 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తవుతుంది.




 

Updated Date - 2022-02-27T18:31:13+05:30 IST