తాలిబన్లపై భద్రతా మండలి తీర్మానం... రష్యా, చైనా వాకౌట్...

ABN , First Publish Date - 2021-09-01T02:05:22+05:30 IST

అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కట్టుబడి

తాలిబన్లపై భద్రతా మండలి తీర్మానం... రష్యా, చైనా వాకౌట్...

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కట్టుబడి ఉంటామన్న హామీని నిలబెట్టుకోవాలని తాలిబన్లకు గుర్తు చేస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. భారత దేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. అయితే ఈ అంశంపై భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాల మధ్య చీలిక వచ్చింది. శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 


ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) ఆమోదించిన తీర్మానం 2593 ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత దేశ ఆందోళనను వివరించింది. అవసరంలో ఉన్నవారందరికీ మానవీయ సాయం అందడానికి ఐక్యరాజ్యసమితికి, దాని అనుబంధ వ్యవస్థలకు సంపూర్ణ, సురక్షిత ప్రవేశం కల్పించాలని కోరింది. ఈ తీర్మానం పట్ల శాశ్వత సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆఫ్ఘన్ సంక్షోభం పట్ల వైఖరిని విభజిస్తున్నట్లు ఆరోపిస్తూ రష్యా, చైనా ఓటింగ్‌కు హాజరు కాలేదు. 


యూఎన్ఎస్‌సీలో రష్యా ప్రతినిధి మాట్లాడుతూ, అమెరికా రాసిన ఈ ముసాయిదా తీర్మానంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదులను ‘‘మీ వారు, మా వారు’’ అంటూ విభజించారని ఆరోపించారు. తాలిబన్, దానికి అనుబంధంగా ఉన్న హక్కానీ నెట్‌వర్క్ పట్ల మారుతున్న వైఖరిని సూచిస్తోందన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు గతంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికన్, ఇండియన్ టార్గెట్లపై దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 


యూఎన్ఎస్‌సీలో భారత దేశ ప్రతినిధి, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా మాట్లాడుతూ, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను ఖండించాలని కోరారు. 


ఇదిలావుండగా, ఐక్యరాజ్య సమితిలోని భారత దౌత్యవేత్తల బృందం ఈ ముసాయిదా తీర్మానంపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి కృషి చేసినట్లు తెలిసింది. 


Updated Date - 2021-09-01T02:05:22+05:30 IST