జి.మూలపొలం-పల్లంకుర్రు రేవులో అనధికార దోపిడీ!

ABN , First Publish Date - 2022-09-28T05:30:00+05:30 IST

పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పెట్టి గోదావరి నదిపై పడవ ద్వారా ప్రయాణికులను దాటిస్తూ నిత్యం వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి వైసీపీ కీలక నేత సహకారంతో కొంత కాలంగా పడవలు నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రెండు మండలాల మధ్య రెండు గ్రామాల ప్రజానీకాన్ని రేవుపై దాటిస్తూ వైసీపీ నాయకుల అండదండలతో అక్రమార్జనకు పాల్పడుతున్నా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

జి.మూలపొలం-పల్లంకుర్రు రేవులో అనధికార దోపిడీ!

  • వైసీపీ నాయకుల ప్రమేయంతో ప్రయాణికుల దాటింపు
  • పంచాయతీ ఆదాయానికి గండికొట్టిన నిర్వాహకులు
  • జిల్లా పరిషతకు అప్పగించేశామంటున్న అధికారులు 
  • విచారణ జరిపాలని ప్రజల డిమాండు

పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పెట్టి గోదావరి నదిపై పడవ ద్వారా ప్రయాణికులను దాటిస్తూ నిత్యం వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి వైసీపీ కీలక నేత సహకారంతో కొంత కాలంగా పడవలు నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రెండు మండలాల మధ్య రెండు గ్రామాల ప్రజానీకాన్ని రేవుపై దాటిస్తూ వైసీపీ నాయకుల అండదండలతో అక్రమార్జనకు పాల్పడుతున్నా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఐ.పోలవరం మండలం జి.మూలపొలం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు మధ్య వృద్ధ గౌతమి నదీపాయపై ప్రధాన రేవు ఒకటి ఉంది. గతంలో జి.మూలపొలం పంచాయతీ ఆధ్వర్యంలో రేవు వేలంపాటలు నిర్వహించేవారు. 2019-20 సంవత్సరానికి రూ.10 లక్షలకు దక్కించుకున్నారు. అయితే పంచాయతీకి మాత్రం ఆ సంవత్సరానికి సంబంధించిన సొమ్ము జమ చేయకపోవడంతో కార్యదర్శి రేవులో రాకపోకలను నిలుపుదల చేశారు. వివాదం కోర్టుకు వెళ్లింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ స్థాయి నేత ఒకరు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అటు జి.మూలపొలం ఇటు పల్లంకుర్రు గ్రామాలకు చెందిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గతంలో పాట దక్కించుకున్న వ్యక్తికే రేవు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి అనధికారికంగా రేవులో ప్రయాణి కులను దాటిస్తూ జి.మూలపొలం పంచాయతీకి బకాయిపడ్డ రూ.10లక్షల్లో రూ.7లక్షల వరకు చెల్లించినట్టు సమాచారం. ఇంకా రూ.3లక్షల బకాయి ఉంది. అయితే అనధికారికంగా రేవు నిర్వహించడం వెనుక వైసీపీ పెద్దల సహకారం పూర్తిగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాటదారుల వివాదాలను దృష్టిలో ఉంచుకుని పల్లంకుర్రు, జి.మూలపొలం రేవు నిర్వహణ బాధ్యతలను జిల్లా పరిషతకు అప్పగించినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ విషయమై జి.మూలపొలం పంచాయతీ కార్యదర్శి పంపన వెంకటేశ్వరరావును వివరణ కోరగా... గతంలో పంచాయతీ నిర్వహించే రేవు వేలంపాటలను జడ్పీకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని  చెప్పారు. గతంలో ఉన్న బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. అయితే రేవులో మాత్రం నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. మనిషికి రూ.10, మోటారు సైకిలుకు రూ.30 వంతున వసూలు చేస్తూ ప్రయా ణికుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారని ఇరు గ్రామాల  ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే పంచాయతీ  గానీ, జిల్లా పరిషత నుంచి గానీ ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ నేతల ప్రత్యక్ష సహకారంతో రేవు నిర్వహిస్తూ సొమ్ము దోచేస్తున్నారన్నది ప్రయాణికుల ఆరోపణ. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-28T05:30:00+05:30 IST