కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను పదవినుంచి తొలగించాలి

ABN , First Publish Date - 2021-10-19T06:35:11+05:30 IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్‌చేశారు.

కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను పదవినుంచి తొలగించాలి
నల్లగొండ రైల్వేస్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతు సంఘం, వ్యకాస నాయకులు

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలి

  రైతు సంఘం, వ్యకాస నేతలు సుధాకర్‌రెడ్డి, ఐలయ్య

నల్లగొండ రూరల్‌, అక్టోబరు 18 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి,  వ్యవసాయ కార్మిక సఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్‌చేశారు.  అఖిల భారత కిసాన్‌ సంయుక్త మోర్చా కోఆర్డినేషన్‌ కమిటీ  పిలుపుమేరకు దేశవ్యాప్త రైల్‌రోకో కార్యక్రమంలో భాగంగా  స్థానిక  రైల్వే స్టేషన్‌ ఎదుట ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బడా కార్పొరేట్లకు మేలు చేసేవిధంగా, రైతుల నడ్డివిరిచేలా ఉన్న నూతన సాగుచట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా రైతులు శాంతియుతంగా పోరాటం సాగిస్తుంటే, ఆ పోరాటాన్ని హింసాయుతంగా మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతూ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, అస్సాం, రాష్ట్రాలలో హింసను ప్రేరేపిస్తూ  రైతులపై కి పోలీసులను, ఆర్‌ఎ్‌సఎస్‌ గుండాలను ఉసిగొలిపిందని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను వాహనాలతో తొక్కించి హత్యచేయించిన కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రా తనయుడిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అజయ్‌మిశ్రాను పదవినుంచి తొలగించాలని డిమాండ్‌చేశారు. పాలక పక్షాల బెదిరింపులకు బెదరకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.  రైతాంగ ఉద్యమం ఢిల్లీకి పరిమితమైంది కాదని, ఇది దేశ వ్యాప్త ఉద్యమమని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జోడించి ఉద్యమ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి, సీఐటీయూ  జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య,  రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు  దండంపల్లి సరోజా పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-19T06:35:11+05:30 IST