పీఎం ఆఫీస్ నిర్మాణానికి బిడ్ల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-10T20:16:30+05:30 IST

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొన్ని భవనాల

పీఎం ఆఫీస్ నిర్మాణానికి బిడ్ల ఆహ్వానం

న్యూఢిల్లీ : సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొన్ని భవనాల నిర్మాణం కోసం బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. నాలుగు అంతస్థుల ప్రధాన మంత్రి కార్యాలయం, కేబినెట్ సచివాలయ కార్యాలయాలు, జాతీయ భద్రతా మండలి సచివాలయం, రెండు అంతస్థుల ‘ఇండియా హౌస్’లను 24 నెలల్లో నిర్మించాలని తెలిపింది. వీటి నిర్మాణం కోసం రూ.1,171 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వీటిని సౌత్ బ్లాక్‌లో నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇక్కడి నిర్మాణాలను ప్రణాళిక ప్రకారం కూల్చిన తర్వాత నూతన భవనాలను నిర్మిస్తారు. విదేశీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు ఇండియా హౌస్‌ను ఉపయోగిస్తారు. 


ప్రధాన మంత్రి కార్యాలయం, నివాసం నిర్మాణాలను 2022 డిసెంబరునాటికి పూర్తి చేయాలని మొదట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఈ గడువును పొడిగించక తప్పలేదు.  ఈ బిడ్లకు ఆమోదం లభించిన తర్వాత 24 నెలల్లోగా నాలుగు అంతస్థుల ప్రధాన మంత్రి కార్యాలయం, కేబినెట్ సచివాలయ కార్యాలయాలు, జాతీయ భద్రతా మండలి సచివాలయం, రెండు అంతస్థుల ‘ఇండియా హౌస్’లను నిర్మించవలసి ఉంటుంది. పీఎంఓ, ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌ల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంలో ప్రస్తుతం రక్షణ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటిని న్యూఢిల్లీలోని కేజీ మార్గ్, ఆఫ్రికా ఎవెన్యూలకు తరలిస్తున్నారు. 


నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 1930వ దశకంలో బ్రిటిషర్లు నిర్మించిన లుటియెన్స్ ఢిల్లీ నడి బొడ్డునగల 3.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం రూ.20,000 కోట్లు. దీనిలో భాగంగా అనేక ప్రభుత్వ భవనాలను కూల్చేసి, తిరిగి నిర్మిస్తారు. ప్రధాన మంత్రి, ఉప రాష్ట్రపతి నివాసాలతోపాటు నూతన పార్లమెంటు భవనాన్ని కూడా నిర్మిస్తారు.  కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల కోసం 10 భవనాలను నిర్మిస్తారు. 


Updated Date - 2021-11-10T20:16:30+05:30 IST