అటకెక్కిన హామీ

ABN , First Publish Date - 2021-01-27T04:53:21+05:30 IST

అటకెక్కిన హామీ

అటకెక్కిన హామీ

దరఖాస్తులు సరే.. జారీ ఎప్పుడో మరీ ?

ఆహారభద్రత కార్డుల మంజూరులో తీవ్ర జాప్యం

భద్రాద్రి జిల్లాలో 27,077 అర్టీలు పెండింగ్‌ 

కొత్త కార్డుల ఊసెత్తని ప్రభుత్వం

కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 26: దారిద్య్రరేఖ దిగువనున్న అర్హులందరికీ ఆహారభద్రతాకార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ.. హామీగానే మిగిలింది. రెండేళ్లుగా కొత్తకార్డుల జారీ ఊసేలేకపోవడంతో.. వివాహాలు చేసుకొని కుటుంబం నుంచి వేరుపడిన వారికి రేషన్‌ అందక అవస్థలు పడుతున్నారు. గతంలో అర్హులందరికీ ఆహారభద్రత కార్డులను జనరేట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో చాలామంది ఉమ్మడిగా ఉన్న రేషన్‌ ఆహారభద్రత కార్డులో పేరు తొలగించి కొత్తరేషన్‌కార్డుకు దరఖాస్తులు చేశారు. ఈ దరఖాస్తులు చేసి మూడేళ్లవుతున్నా వీటికి పరిష్కారం లభించలేదు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తెల్లరేషన్‌కార్డు కలిగిన వారందరికి ఆధార్‌ ఆనుసంధానం చేసి నకిలీ రేషన్‌ కార్డులు, అనర్హుల రేషన్‌ కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత సుమారు మూడు, నాలుగు నెలలు రేషన్‌కార్డుల నమోదు ప్రక్రియను పూర్తిగా  నిలిపివేశారు. ఆ తరువాత కొత్త దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. దీంతో కొత్తరేషన్‌ కార్డుల కోసం ఇబ్బడి ముబ్బడిగా జనం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకొన్నారు. వాటిని పరిశీలించి కార్డులు జనరేట్‌ చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో ఆహారభద్రత కార్డుల జారీ తీవ్ర జాప్యం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు నాటి నుంచి నేటి వరకు ఆహారభద్రత కార్డుల కోసం జిల్లాలో మొత్తం 52,024 దరఖాస్తులు వచ్చాయి. వాటిని తొలుత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ తర్వాత తహసీల్దార్‌ పరిశీలించి జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారికి ఫార్వర్డ్‌ చేస్తారు. వాటిని పరిశీలించిన డీఎస్‌వో అర్హతను బట్టి రేషన్‌కార్డును జనరేట్‌ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 21,243 దరఖాస్తులనే పరిశీలించి యాప్‌లో అప్‌లోడు చేశారు. వివిధ స్థాయిల్లో ఇంకా 27,077దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ అధికారి స్థాయిలో 209, తహసీల్దార్‌ స్థాయిలో 299, డీఎస్‌వో స్థాయిలో 26,569 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది నుంచి ప్రభుత్వం రేషన్‌కార్డుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. దీంతో సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో పరిశీలించిన రేషన్‌ కార్డులను జారీ చేయలేక అధికారులు నిస్సహాయంగా ఉన్నారు. ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రతీ ఒక్కరికి రేషన్‌ కార్డు జారీ చేస్తామన్న హామీ నెరవేరలేదు. ఏదేమైనా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులు మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అవి ఎప్పటికి జనరేట్‌ అవుతాయో, ఎప్పుడు రేషన్‌తీసుకొంటామో అని లబ్భిదారులు నిట్టూరుస్తున్నారు.

భద్రాద్రి జిల్లాలో 442 దుకాణాల ద్వారా రేషన్‌బియ్యం 

భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం 442 చౌకదుకాణాల ద్వారా సుమారు 2,83,309 తెల్లరేషన్‌ కార్డుల 18,782 అంత్యోదయ కార్డులు ద్వారా 7,286 టన్నుల బియ్యాన్ని, కిరోసిన్‌ 296 కేఎల్‌ను కొనుగోలు చేస్తున్నారు. చౌకదుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ-పాస్‌ విధానాన్ని అమలులోకి తెచ్చింది. జిల్లాలో 428 చౌకదుకాణాల్లో ఈ-పాస్‌ మిషన్లు పనిచేస్తున్నాయి. ఎలాంటి ఇంటర్‌నెట్‌ సౌకర్యంలేని 14 దుకాణాల్లో మ్యానువల్‌గా రేషన్‌ సరఫరా జరుగుతోంది. తాజాగా వేలుమద్రులు పడనివారి కోసం కంటిచూపు(ఐరీష్‌) ద్వారా రేషన్‌ ఇచ్చే విధానాన్ని అమలు చేస్తోంది. 50 సంవత్సరాలు పైబడి, కూలిపినచేసి వేళుముద్రలు అరిగిపోయిన వారికోసం ఈ విధానం ఉపయోగిస్తారు. జిల్లాలో 428 రేషన్‌దుకాణాల్లో ఐరీష్‌ మిషన్లు అమలులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకూ వేలుమద్రులు పడటం లేదనే ఇబ్బంది పడే వారి కోసం ఐరీష్‌ లేదా ఓటీపీ విధానాన్ని అమలు చేసి అర్హులైన వారందరికి రేషన్‌ సరఫరా చేస్తున్నారు.

Updated Date - 2021-01-27T04:53:21+05:30 IST