ధోలావీరాకు యునెస్కో సలాం

ABN , First Publish Date - 2021-07-28T08:14:18+05:30 IST

యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో మనదేశం ‘సూపర్‌-40 క్లబ్‌’లో చేరింది. నిన్నటికి నిన్న భారత్‌ నుంచి 39వ ప్రపంచ వారసత్వ సంపదగా తెలంగాణలోని రామప్ప ఆలయం చోటు దక్కించుకోగా..

ధోలావీరాకు యునెస్కో సలాం

  • ప్రపంచ వారసత్వ సంపదగా 4500 ఏళ్లనాటి సింధూ లోయ స్థలి
  • దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన అత్యంత ప్రాచీన స్థలం ఇదే
  • మోదీ హర్షం.. చరిత్ర, సంస్కృతి పట్ల ఆసక్తిగలవారు సందర్శించాలని పిలుపు
  • ధోలావీరాను సందర్శించినప్పటి చిత్రాలను ట్వీట్‌ చేసిన ప్రధాని మోదీ
  • 2014 నుంచి ఇప్పటిదాకా మనదేశం నుంచి 10 స్థలాలకు గుర్తింపు
  • దేశ సంస్కృతిని ప్రోత్సహించడంపై ప్రధాని చిత్తశుద్ధికిది నిదర్శనం: కిషన్‌రెడ్డి 


న్యూఢిల్లీ, జూలై 27: యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో మనదేశం ‘సూపర్‌-40 క్లబ్‌’లో చేరింది. నిన్నటికి నిన్న భారత్‌ నుంచి 39వ ప్రపంచ వారసత్వ సంపదగా తెలంగాణలోని రామప్ప ఆలయం చోటు దక్కించుకోగా.. తాజాగా సింధూ లోయ నాగరికతా కాలం (హరప్పా) నాటి గుజరాత్‌లోని ‘ధోలావీరా’కు స్థానం లభించింది. ఈ విషయాన్ని యునెస్కో ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. భారత్‌ నుంచి ప్రపంచ వారసత్వ సంపద కింద చోటు దక్కించుకున్న ప్రదేశాల్లో అత్యంత పురాతనమైనది ‘ధోలావీరా’నే! ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుజరాత్‌ నుంచి ఇప్పటికే పావగఢ్‌ సమీపంలోని చంపానెర్‌, పటాన్‌లోని రాణీకి వావ్‌(రాణికి సంబంధించిన మెట్లబావి), చారిత్రక నగరం అహ్మదాబాద్‌.. యునెస్కో జాబితాలో ఉన్నాయి. 


హరప్పా ప్రతిబింబం 

4500 ఏళ్ల క్రితం నాటి సింధూ నాగరికతలో ‘ధోలావీరా’కు ప్రముఖస్థానం ఉంది. ఆ నాగరికతకు సంబంధించి భారత్‌లోని రెండు అతిపెద్ద ప్రదేశాల్లో ధోలావీరా ఒకటి. ఈ నాగరికతలో ఓ ప్రధాన నగరంగాక్రీ.పూ.2900-1500లో ధోలావీరా వర్ధిల్లింది. గుజరాత్‌లోని కచ్‌ జిల్లా బచావు తాలుకలోని ఖదిర్‌బెట్‌కు వెళ్తే ధోలావీరాలో 120 ఎకరాల విస్తీర్ణంలో నాటి నిర్మాణాల తాలూకు రాతిగోడలు, పునాదుల శిథిలాలు కనిపిస్తాయి. ఆ అవశేషాల వెనుక హరప్పా ప్రజల జీవనశైలి కళ్లకు కడుతుంది. ఇప్పటికీ మనదేశంలో చాలాచోట్ల అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు లేవు. రోడ్లూ అడ్డదిడ్డంగా ఉంటాయి. అయితే 4500 ఏళ్ల క్రితమే ధోలావీరా ప్రజలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను నిర్మించుకున్నారు. స్నానవాటికలను కట్టుకున్నారు. విశాలమైన రోడ్లు, వీధులు నిర్మించుకున్నారు. నీటి నిలువ కోసం బావులు తవ్వి నలువైపులా రాతితో నిర్మించుకున్నారు. నీటి సంరక్షణకు 16 రిజర్వాయర్లు కట్టుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నీటి సంరక్షణ చర్యల్లో ఒకటని అభివర్ణిస్తారు. ఇలా 1400 ఏళ్లపాటు వర్ధిల్లిన ధోలావీరా, సింధూ నాగరికత సాధించిన అభివృద్ధి, సమున్నతస్థితి, పతనం సహా ఆ నాగరికత కీలక పరిణామాలన్నింటికీ సాక్షీభూతంగా నిలిచింది. ధోలావీరాను 1967లో భారత పురాతత్వ శాఖ అధికారులు తమ తవ్వకాల్లో గుర్తించారు. ఈ తవ్వకాల్లో బంగారు, రాగి, పూసలతో ఆభరణాలు, చేపల గాలాలు, జంతు బొమ్మలు, పాత్రలు, ఇతర కళాత్మక వస్తువులు లభించాయి. ఈ ఆధారాలను బట్టి మెసపొటోమియా ప్రజలతో సింధూ ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవని పరిశోధకులు నిర్ధారించారు. 


విద్యార్థి దశలోనే సందర్శించా: మోదీ

హరప్పా నాటి ధోలావీరాకు భారత చరిత్ర పుటల్లో గొప్ప స్థానం ఉందని, ఆ ప్రదేశానికి యునెస్కో గుర్తింపు లభించ డం ఆనందానికి గురిచేసిందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘చరిత్ర, సంస్కృతి, పురాతత్వ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా వెళ్లి చూడాల్సిన ప్రదేశం ధోలావీరా’ అన్నారు. విద్యార్థి దశలో తొలిసారిగా తాను ధోలావీరాను చూసి మంత్రముగ్ధుడినయ్యానని గుర్తుచేసుకున్నారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ధోలావీరాను పర్యాటకులను ఆకర్షించే విధంగా తిర్చిదిద్దే అవకాశం లభించిందన్నారు. ఈ సందర్భంగా ధోలావీరాను తాను సందర్శించినప్పటి ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. ధోలావీరాను యునెస్కో గుర్తించడం పట్ల కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటిదాకా భారత్‌లో 10 స్థలాలు.. ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయని, భారత సంస్కృతిని ప్రోత్సహించడం పట్ల ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని ఆయన ట్విటర్‌లో రాశారు.


‘పరిరక్షణ’కు ప్రైవేటు భాగస్వామ్యం

పురాతన స్థలాలను, స్మారకాలను పరిరక్షించడానికి, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రైవేటు రంగం సహకారం తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానె ల్‌ అభిప్రాయపడింది. పురాతన స్థలా లు, స్మారకాల అభివృద్ధి కోసం పెట్టుబడుల్లో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర సాంస్కృతిక శాఖకు సిఫారసు చేసింది. ఈ నివేదికను రాజ్యసభకు సమర్పించింది.

Updated Date - 2021-07-28T08:14:18+05:30 IST