దేశంలో నేరం రుజువుకాకుండా జైళ్లలో ఎంతమంది ఖైదీలుగా ఉన్నారంటే..

ABN , First Publish Date - 2022-02-05T18:00:23+05:30 IST

భారతదేశంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య..

దేశంలో నేరం రుజువుకాకుండా జైళ్లలో ఎంతమంది ఖైదీలుగా ఉన్నారంటే..

భారతదేశంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య చాలా ఎక్కువ. దీంతో ఖైదీలకు సరిపడా స్థలం దొరకడం లేదని, వారికి కనీస సౌకర్యాలు అందడం లేదనే ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే జైళ్లలో ఉన్న ఈ ఖైదీలలో అభియోగాలు రుజువుకాని వారే అత్యధికులుగా ఉన్నారని మీకు తెలుసా? ఈ ఖైదీలను అండర్ ట్రయల్ ఖైదీలుగా పరిగణిస్తారు, అంటే వీరి నేరం రుజువు కాలేదని, వారి కేసులు కోర్టులో కొనసాగుతున్నాయని అర్థం. ఇటీవల ఈ ఖైదీలకు సంబంధించి పార్లమెంటులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. భారతదేశంలోని ఈ అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల దేశంలో అండర్‌ట్రయల్‌ ఖైదీల సంఖ్య ఎంత? వారి సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని.. ఎంపీ డాక్టర్‌ వికాస్‌ మహాత్మే పార్లమెంట్‌లో హోం మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి స్పందించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ..  జైలు గణాంకాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నిర్వహిస్తుందని, వాటిని తన వార్షిక నివేదిక 'ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా'లో ప్రచురిస్తుందని పార్లమెంటులో సమాధానం సమర్పించింది. 


ఒక రిపోర్టు ప్రకారం.. 2020, డిసెంబరు 31 నాటికి జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య చాలా అధికంగా ఉంది. భారతదేశం అంతటా 3,71,848 మంది అండర్‌ట్రయల్‌ ఖైదీలు ఉన్నారు. ఇందులో 28 రాష్ట్రాల్లో 3.52,495 మంది ఖైదీలు ఉండగా, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఖైదీల సంఖ్య 19,353గా ఉంది. భారతదేశంలో దాదాపు నాలుగున్నర లక్షల మంది ఇప్పటికీ దోషులుగా రుజువుకాకుండా జైళ్లలో ఉన్నట్లు ఈ డేటా తెలియజేస్తోంది. ఐదేళ్లకు పైగా జైళ్లలో ఉన్న ఈ అండర్ ట్రయల్ ఖైదీల్లో ఇలాంటి వారి సంఖ్య అధికంగా ఉండడం ఆశ్చర్యకరం. ఈ ఖైదీలు దోషులుగా నిర్ధారణకాకుండా ఐదేళ్లపాటు జైలులో ఉన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, ఐదు సంవత్సరాలకు పైగా జైలులో ఉన్న ఖైదీల సంఖ్య 7,128గా ఉంది. 16,603 మంది ఖైదీలు 3 నుండి 5 సంవత్సరాలుగా జైలులో ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలో అత్యధికంగా అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. వీరి సంఖ్య 80557. దీని తర్వాత ఈ సంఖ్య బీహార్‌లో 44,187 మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. తరువాత మధ్యప్రదేశ్‌లో 31,712 మంది అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలో ఉన్నారు. వారిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి.

Updated Date - 2022-02-05T18:00:23+05:30 IST