ఈసారైనా పూర్తయ్యేనా..?

ABN , First Publish Date - 2020-05-29T10:44:34+05:30 IST

జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కథ ముగిసింది

ఈసారైనా పూర్తయ్యేనా..?

రైల్వే వంతెన నిర్మాణంలో సమూల మార్పులు

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి బదులు అండర్‌ బ్రిడ్జి

ప్రతిపాదనల దశలో నూతన బ్రిడ్జి నిర్మాణం

మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదించడమే తరువాయి

స్థల పరిశీలన జరిపిన మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు


మంచిర్యాల టౌన్‌, మే 28: జిల్లా కేంద్రంలో  నిర్మించ తలపెట్టిన రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కథ ముగిసింది. దాని స్థానంలో రోడ్‌ అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి బీజం పడింది. పట్టణం మధ్య నుంచి దక్షిణ మధ్య ప్రధాన రైల్వే మా ర్గం ఉన్న కారణంగా పట్టణం టౌన్‌-1, టౌన్‌-2గా పిలవబడుతోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు స్థానిక ముఖరాం చౌరస్తా వద్ద ఉన్న రైల్వే గేటును దాటాల్సి ఉంది. నిత్యం వందలాది రైళ్ల రాకపోకల కారణంగా గంటల తరబడి గేటు మూసి ఉండ టంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గేటు కింది నుంచి దాటేవారు. ఈ క్రమంలో రైళ్లు ఢీకొని అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. 


ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి రూపకల్పన...

పట్టణ ప్రజల అవస్థలు దృష్టిలో ఉంచుకొని రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తెరపైకి వచ్చింది. 2018 ఆగస్టులో బ్రిడ్జి నిర్మాణానికి రూపకల్పన జరుగగా రూ.10 కోట్ల అంచనాతో నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అప్పటి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేయడంతో  ముఖరాం చౌరస్తాలో స్థల పరిశీలన చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో గత యేడా ది ఆగస్టు 9న చిరు వ్యాపారులకు చెందిన తొమ్మిది దుకాణాలను ఎక్స్‌కావేటర్‌తో అధికారులు బలవంతంగా తొలగించారు. వంతెన నిర్మాణానికి బడ్జెట్‌ కేటాయింపులు జరిగి టెండర్‌ పూర్తయి అక్టోబర్‌ 30న ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావులు బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక బ్రిడ్జి నిర్మాణం జరిగినట్లేనని, కష్టాలు తొలగుతాయని ప్రజలు భావించారు. అనంతరం బ్రిడ్జి నిర్మాణం రద్దు కావడంతో ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.  


స్థలా భావమే కారణమా..?

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం రద్దు కావడానికి స్థలా భావమే కారణమని మున్సిపల్‌, రైల్వే శాఖల అధికారులు చెబుతున్నారు. ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం టూటౌన్‌ ప్రాంతంలోని హమాలివాడ, భగత్‌నగర్‌, అర్కలవాడ, తిలక్‌నగర్‌, గోపాల్‌వాడ, రాజీవ్‌నగర్‌, అశోక్‌రోడ్‌, వేములపల్లి, దొరగారిపల్లి తదితర ప్రాంతాలున్నాయి. జడ్పీ బాలికల పాఠశాల ముందు నుంచి గాంధీ పార్కు సమీపంలో గల రైల్వే స్టేషన్‌ రోడ్డుకు అవతలివైపు రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జిని నిర్మించేందుకు రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. రైల్వే స్టేషన్‌ రోడ్డును ఆనుకొని ట్రాక్‌ మీదుగా హమాలివాడలో గల వినాయకుని ఆలయం వరకు ‘జడ్‌’ ఆకారంలో  లైట్‌ మోటార్‌ వెహికిల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే స్థలం సరిపోక స్లోప్‌ ఎక్కువవుతుందనే ఉద్దేశ్యంతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 


తెరపైకి రోడ్‌ అండర్‌ బ్రిడ్జి....

రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి రద్దుకావడంతో అదే స్థలంలో రోడ్‌ అండర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబి) నిర్మించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మాదిరిగానే  అండర్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు రైల్వేశాఖ కొత్తగా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. 5.5 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా వాహనాలు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జి నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై ఈ నెల 27న మున్సిపల్‌, రైల్వే అధికారులు స్థల పరిశీలన జరిపారు. ఈ మేరకు మున్సిపల్‌ అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందిన తరువాత బ్రిడ్జి నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. 


బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి...టౌ టౌన్‌ అభివృద్ది కమిటీ చైర్మన్‌ పూసాల వెంకన్న

ట్రాక్‌ దాటేందుకు ఇరు ప్రాంతాల ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. రెండు శాఖల అధికారులు సంయుక్తంగా అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సర్వే జరిపినందున పనులు వేగవంతం చేయాలి. ఓవర్‌ బ్రిడ్జి మాదిరిగా, అండర్‌ బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. 


స్థల పరిశీలన జరిపాం...మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి

ముఖరాం చౌరస్తాలో రోడ్‌ అండర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థల పరిశీలన జరిపాం. రైల్వే అధికారులు నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసినందున మున్సిపల్‌ ఇంజనీర్‌, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించాం. మున్సిపల్‌ కౌన్సిల్‌లో సభ్యుల ఆమోదం కోసం ప్రతిపాధనలు సిద్ధం చేస్తున్నాం. 

Updated Date - 2020-05-29T10:44:34+05:30 IST