రాజమండ్రి: విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఎందుకు చర్చించడం లేదని ఆయన ప్రశ్నించారు. చర్చ లేకుండా బిల్లు ఎలా ఆమోదిస్తారన్నారు. రాజధాని లేకుండా విభజన ఎలా చేస్తారని నిలదీశారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పోరాడాలని ఉండవల్లి సూచించారు.
ఏపీ అంటే కేంద్రానికి అంత అలుసా? అని ఉండవల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా మనవాళ్ళకు నొప్పిలేదన్నారు. రాష్ట్ర విభజనపై నరేంద్రమోదీ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ప్రశ్నించే ప్రాంతీయ పార్టీల నేతలపై బీజేపీ కేసులు పెడుతోందని, రాబోయే రోజుల్లో ఏపీని అసలు పట్టించుకోరని ఉండవల్లి అన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే విద్యుత్ కోతలు ఇలా ఉంటే...వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఏమిటో తెలియడంలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.