ఆసిఫాబాద్‌ జిల్లా సలుగుపల్లిలో అదుపులోకి రాని డయేరియా

ABN , First Publish Date - 2022-08-12T04:57:30+05:30 IST

కలుషిత నీరో, మరేదో తెలియదుగాని గ్రామంలో మాత్రం రోజురోజుకు డయేరియా వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లా సలుగుపల్లిలో అదుపులోకి రాని డయేరియా
పాఠశాలలో ఏర్పాటు చేసిన క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులు

- మరికొందరికి వాంతులు, విరేచనాలు

- సతమతమవుతున్న సలుగుపల్లి గ్రామస్థులు

- గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో

బెజ్జూరు, ఆగస్టు 11: కలుషిత నీరో,  మరేదో తెలియదుగాని గ్రామంలో మాత్రం రోజురోజుకు డయేరియా వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారు. ఆదివారం నుంచి ప్రారంభమైన వాంతులు, విరేచనాలు ఇప్పటికీ అదుపులోకి రావడం లేదు. దీంతో సలుగుపల్లి వాసులు అతిసారతో సతమతమవుతున్నారు. గురువారం గ్రామానికి చెందిన మరి కొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన తలండి లక్ష్మి, మడె మల్లయ్య, ఇప్ప రోజ, సడ్మెక స్వాతి, నిహారిక, ఎనగందుల లక్ష్మి, పేదం యశోద, ఇప్ప సుభాష్‌, నైతం లచ్చయ్య, ఏన్క గంగారాంలకు ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో స్థానికంగానే వైద్యసిబ్బంది దగ్గరుండి వైద్యం అందిస్తున్నారు. ఇందులో ఇప్ప సుభాష్‌, నైతం లచ్చయ్యను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఏన్క గంగారాంకు వాంతులు, విరేచనాలు అధికం కావడంతో చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు. ఇప్పటికే అతిసారతో గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు బాయి మృతిచెందిన విషయం తెలిసిందే. గత అయిదు రోజులుగా గ్రామానికి చెందిన సుమారు 60మంది వరకు అతిసారతో బాధపడగా కొంతమంది కోలుకున్నారు. రోజుకు పదులసంఖ్యలో వ్యాధి వ్యాప్తిస్తుండడంతో ఆందో ళన కలిగిస్తుంది.

వీడని మూఢనమ్మకాలు

సలుగుపల్లి గ్రామంలో అతిసార విజృంభణపై గ్రామస్తులు మూఢనమ్మకంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గ్రామదేవత విగ్రహం ఇటీవల ధ్వంసం కావడంతో దేవత ఆగ్రహించడం వల్లనే వాంతులు, విరేచనాలు పెరిగి ప్రజలు అస్వస్థతకు గురవుతలున్నారని పేర్కొనడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకోసం అతిసార తగ్గేందుకు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారని పలువురు గ్రామస్థులు పేర్కొంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరంతా రంగుమారి వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొంటున్నారు. వర్షాలకు చేతి పంపు నీరంతా కలుషితంగా మారిందన్నారు. ఆ నీటిని తాగిన వారికి వాంతులు, విరేచనాలు అవుతున్నాయని అధికారుల వాదన. అయితే గ్రామంలో కొంతమంది శుద్ధ జలం తాగిన వారికి కూడా వాంతులు, విరేచనాలు అవుతన్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు కూడా బాగానే ఉన్నాయి. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నారు. అతిసార ప్రబలిన కాలనీలో ఇంటి పరిసరాల్లో కొంత అపరిశుభ్రత వాతావరణం ఉండడంతో అదికూడా కారణమని తెలుస్తోంది. 

కొనసాగుతున్న వైద్యశిబిరం

సలుగుపల్లి గ్రామంలో వాంతులు, విరేచనాలు పెరిగి అస్వస్థతకు గురైన వారికి ఐదురోజులుగా వైద్య సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. గురువారం బెజ్జూరు పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ అశ్విని ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి వైద్యసేవలు అందించారు. గ్రామస్థులు కలుషిత నీటిని తాగడం వల్లనే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ప్రజలు మూడనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. స్థానికంగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు వైద్యం అందిస్తున్నారు.

సలుగుపల్లిని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

సలుగుపల్లి గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి ప్రభాకర్‌ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అతిసార వ్యాపించడంపై అడిగి తెలుసుకున్నారు. వాంతులు, విరేచనాలు అవుతున్నా వారికి ఎలాంటి మందులు ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా రోగనిరోదక మందులు ఇవ్వాలని సూచించారు. గ్రామంలో చేతిపంపు పాతది కావడంతో చిలుము వస్తున్నందున వాంతులు, విరేచనాలు అవుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. చేతి పంపు నీటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తామన్నారు. గ్రామస్థులు క్లోరిన్‌ మాత్రలను నీటిలో వేసుకొని తాగాలని సూచించారు. గ్రామస్థులంతా వేడిచేసి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. వైద్యసిబ్బంది అందు బాటులో ఉండి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు వైద్య శిబిరం నిర్వహించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమికఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

Updated Date - 2022-08-12T04:57:30+05:30 IST