కోచి: కేరళ రాష్ట్రంలో ఎర్నాకులం సిటీలో ఉన్న జనరల్ ఆస్పత్రికి శవాల ద్వారా భారీ ఆదాయం వస్తోంది. ఆర్టీఐ డేటా ప్రకారం ఆస్పత్రిలో శవాలను ఎవరూ తీసుకెళ్లకపోవడం లేదా ఎవరూ గుర్తించలేని శవాల ద్వారా ఆస్పత్రికి భారీ ఆదాయం వస్తోంది. వజక్కలా రాజు అనే వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేయడంతో ఆగస్టు 1, 2017, అక్టోబర్ 31,2021 మధ్య 256 శవాలను తీసుకున్నట్లు ఆస్పత్రి ఈ విషయాన్ని బయటపెట్టింది. మెడికల్ కాలేజీల స్టడీ కోసం 156 శవాలను అమ్మడంతో రూ. 62.40 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆస్పత్రి పేర్కొంది. 154 శవాలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు, 2 శవాలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు విక్రయించినట్లు ఎర్నాకులం జనరల్ ఆస్పత్రి పేర్కొంది. ఒక్కొక్క శవాన్ని విక్రయించడం ద్వారా రూ. 40 వేలు వస్తోందని, ప్రస్తుతం శవాల ద్వారా రూ. 57.43 లక్షలు ఆస్పత్రి పొందిందని ఆర్టీఐ డేటా చెబుతోంది. డబ్బు మొత్తాన్ని మార్చురీ, ఫోరెన్సిక్ విభాగం చేపట్టే పనులకు వినియోగిస్తున్నారు.