అమ్మో.. మా వల్ల కాదు..!

ABN , First Publish Date - 2022-08-18T06:28:36+05:30 IST

జిల్లాలో రోడ్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. గతంలో చేసిన పనులకే ఇంకా బిల్లులు రాకపోవడం.. ఇప్పుడు చేసినా బిల్లులు వస్తాయనే నమ్మకం లేకపోవడంతో వారు అనాసక్తి చూపుతున్నారు. దీంతో ఇటీవల 287.39 కిలోమీటర్ల రోడ్ల పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు.

అమ్మో.. మా వల్ల కాదు..!
యాదమరి మండలం భూమిరెడ్డిపల్లె పంచాయతీ జొన్నాలమిట్ట నుంచి వెంకటాపురం వరకు అధ్వానంగా ఉన్న రోడ్డు

287.39 కిలోమీటర్ల రోడ్లకు టెండర్లు

పనులు చేయడానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు 

బిల్లులు రావని అనాసక్తి 


చిత్తూరు సిటీ, ఆగస్టు 17: జిల్లాలో రోడ్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. గతంలో చేసిన పనులకే ఇంకా బిల్లులు రాకపోవడం.. ఇప్పుడు చేసినా బిల్లులు వస్తాయనే నమ్మకం లేకపోవడంతో వారు అనాసక్తి చూపుతున్నారు. దీంతో ఇటీవల  287.39 కిలోమీటర్ల రోడ్ల పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు. 

జిల్లాలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా వీటి మరమ్మతులను, నిర్వహణనూ పట్టించుకోలేదు. వీటికితోడు గతేడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై కోతలు, మోకాళ్లలోతు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నెలవుగా మారాయి. మరోవైపు ప్రతిపక్షాలు రోడ్లు మరవ్మమతులు చేయాలంటూ వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్‌ రోడ్ల అభివృద్ధికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల నుంచి నిధులను కేటాయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లను కేటాయించారు. ఆ నిధులను బ్యాంకు రుణంగా సమకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో జిల్లాకు రూ.39.33 కోట్లు అవసరమని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నిధులతో 98 రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం 287.39 కిలోమీటర్ల రోడ్లను 14 ప్యాకేజీలుగా విభజించి గత నెలలో టెండర్లు పిలిచారు. కానీ, కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో పలువురు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ పనులు చేసినా బిల్లులు వస్తాయన్న గ్యారెంటీ లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. మరోవైపు ఏటా జూన్‌లో స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్‌ (ఎస్‌ఎ్‌సఆర్‌) మారుతూ ఉంటుంది. ఏటా ఐదు నుంచి పది శాతం వరకు ధరలు పెరుగుతుండటంతో ఆమేరకు వర్కు ఎస్టిమేషన్లు కూడా పెంచుతారు. కానీ ఏఎంసీ నిధులతో చేపట్టే రోడ్ల పనులకు మాత్రం పీఆర్‌ అధికారులు గతేడాది ఎస్‌ఎ్‌సఆర్‌తోనే అంచనాలు తయారు చేసి టెండర్లు పిలిచారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనులకు  జీఎస్టీ 12 శాతం ఉండగా దానిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం 18 శాతానికి పెంచింది. కానీ, టెండర్లలో మాత్రం 12 శాతంగానే చూపించారు. జీఎస్టీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో పాత జీఎస్టీతో టెండర్లు పిలవడంతో పెరిగిన ఆరు శాతం జీఎస్టీ తాము భరించాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.  ఈ కారణాలతో రోడ్ల పనులు చేపట్టేందుకు వారు అనాసక్తి చూపుతున్నారు. 

Updated Date - 2022-08-18T06:28:36+05:30 IST