రష్యాతో బెలారస్‌లో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తిరస్కరణ

ABN , First Publish Date - 2022-02-27T19:47:44+05:30 IST

యుద్ధం నేపథ్యంలో రష్యాతో బెలారస్‌లో చర్చలు జరిపేందుకు

రష్యాతో బెలారస్‌లో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తిరస్కరణ

కీవ్ : యుద్ధం నేపథ్యంలో రష్యాతో బెలారస్‌లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తిరస్కరించారు. తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుల్లో కొన్ని బెలారస్ గడ్డపై నుంచి జరుగుతున్నాయన్నారు. ఉక్రెయిన్‌పై దూకుడు స్వభావం ప్రదర్శించని ప్రాంతంలో మాత్రమే చర్చలు జరపడానికి వస్తామని చెప్పారు. రష్యా పంపించిన ప్రతినిధి బృందం ఇప్పటికే బెలారస్‌లోని గోమెల్ నగరానికి చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రాక కోసం ఎదురు చూస్తోంది. 


ఉక్రెయిన్‌పై క్షిపణుల ప్రయోగానికి వేదికలు కానటువంటి దేశాల్లో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని జెలెన్‌స్కీ తెలిపారు. వార్సా, ఇస్తాంబుల్, బకులలో శాంతి చర్చల వేదికను ఏర్పాటు చేయవచ్చునని సూచించారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రష్యా ప్రతినిధి బృందం ఇప్పటికే బెలారస్‌లోని గోమెల్ నగరానికి చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధుల కోసం వేచి చూస్తోంది. 


గత రాత్రి కిరాతక చర్యలు : జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కురిపించాయని, శనివారం-ఆదివారం మధ్య రాత్రి అత్యంత కిరాతకంగా వ్యవహరించాయని జెలెన్‌స్కీ తెలిపారు. మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని, ప్రజలు నివసించే చోట దాడులు చేశారని చెప్పారు. అంబులెన్సులతో సహా ప్రతిదానిపైనా దురాక్రమణదారులు దాడి చేస్తున్నారన్నారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కమాండర్-ఇన్-చీఫ్ వాలెరీ జలుజ్నీ ఆదివారం ఇచ్చిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో, కీవ్ నగరంపైకి బెలారస్ నుంచి ప్రయోగించిన క్రూయిజ్ మిసైల్‌ను ఉక్రెయినియన్ వాయు సేన కూల్చేసిందని తెలిపింది. బెలారస్, రష్యా మరొక యుద్ధ నేరానికి పాల్పడ్డాయని ఆరోపించింది. 


Updated Date - 2022-02-27T19:47:44+05:30 IST